Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 17


    వీళ్లని కదిలించి వాదించారా పురాతన శాస్త్రాలనుంచి, పశ్చిమ ఖండవేదాంతాల నుంచి, నవీన సంస్కారాల వరకు తమకు నచ్చిన భాగాలను ఏరి సాక్ష్యాలు తీసుకొస్తారు. తమ అనుభవమంటారు. తమకన్న వెనకగా ఉన్నవాళ్లు పిరికివాళ్లు తమకన్న ముందుకు వెళ్లినవాళ్లు fools.
    "ఏదో పిల్లలులేని వితంతువులు, పాపం...ఏదో పెళ్లిచేసుకున్నారంటే....." అని ఒకరు.
    "ఇంకా భర్తతో సంసారం చెయ్యని పసికూన పాపం..." అని ఇంకోరు.
    "ఇంకెవరూ దిక్కులేని వితంతువు......" అని మూడోవారు.
    అని జాలి! ఈ దిక్కుమాలిన వాదనలు చేసే వీళ్లని చూసి జాలిపడేవాళ్లు లేరు.
    ప్రతి విషయమూ ఎట్లా జరగాలో, ఏ కూరలు మంచివో, ఏ గాలి ఆరోగ్యమో, ఏ దేశం ఏ కాలం, ఏ రాజు, ఏ ఫిల్ము ఏ సంస్కారం, ఏ సంగీతం, ఎంతవరకు మంచిదో వాళ్లది cast word. వాళ్లకి తెలీనివి లేవు.
    "కుర్రవాళ్ళకి స్వతంత్రం వుండాలనుకోండి...కాని వాళ్లు చెడిపోతూ వుంటే..."
    ఇట్లా మాట్లాడే స్థితికి రావడంకన్న చెడిపోవడం ఇంకేముందో అర్ధంకాదు.
    వాళ్ళ మనసుల్లో నిర్ణయించుకొన్న విలువలూ, గొప్పతనాల కన్న, వేరేవాటికి అంధులు.
    ఒకసారి కొన్ని యేళ్ళ కిందట, నా చిన్నప్పటి టీచరు ఒకాయన ఒచ్చారు, నన్ను చూడ్డానికి. ఆయన్ని చూస్తే చిన్నప్పుడు నాకు చాలా ప్రేమ, ఇప్పటికీ గౌరవం. నన్ను గురించి విని, నా స్థితిని తలుచుకుని దిగులుపడ్డారు. అదే భేధం __ మనని నిజంగా ప్రేమిస్తున్నవాళ్ళు, మనం అవినీతి పాలవుతున్నామన్నా, కష్టాల్లోకి పోతున్నామన్నా దిగులు పడతారు. ఎవరన్నా కోపగించారా, వాళ్లు మనమీద ప్రేమ చేతకాదు, వారిమీది స్వంత ప్రేమచేత, లేకపోతే యీర్ష్య చేత. చెడిపోయిందన్న స్త్రీని యితరులు కాకుల్లాగు పొడిచి అదంతా నీతిమీది ప్రేమ అనుకుని తృప్తి పడతారు. ఆ కోపమంతా యీర్ష్య. పిల్లలు దుష్టులవుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహిస్తారు. అదంతా తమమీది స్వంత ప్రేమ, పిల్లలమీద కాదు. తమ ప్రతిష్టకి భంగం తెలుస్తున్నాడనీ, తమ శాంతిని ధ్వంసం చేసి, శ్రమ కలిగిస్తున్నాడనీ. కిందపడ్డ పిల్లని పడ్డందుకు కొట్టే మాతృదేవతల్ని చూట్టంలేదా? చాలారకం ప్రేమలు గొప్పవారివి కూడా అదేరకం. చాలామంది దేశభక్తుల పేట్ర్రియాటిజం ని సైకో ఎనలైజ్ చేస్తే ఎన్ని వికృతమైన ప్రోద్బలాలూ, ఉద్దేశ్యాలు బైటపడతాయో ఎవరు చెప్పగలరు.
    "మీ...గారండీ, చిన్నకూతురికి పెళ్ళి చెయ్యరట. ఆడపిల్లలకి చదువు ముఖ్యమంటున్నారు. చూశారా, అంత సనాతనులు ఎంత ధైర్యంతో....." అన్నారు మునిమాణిక్యంగారు.
    "ఇంతవరకు ఎవరూ విని కని యెరగని యింత గొప్ప 'డిస్కవరీని' _ కట్నాలకి లోభించి చేశారేమో!"
    తమని తాము మోసపుచ్చుకుని తమ ఘనతని లోకంముందు నిలబెట్టుకోడం కోసం private lectures కొట్టే scoundrels కన్న, తాము నమ్మినదానినించి కదలని సనాతనులు ఎంత Heroic sincere souls!
    కాలంతో, ప్రజలతో, అందరూ ఎట్లానడిస్తే అట్లా, ఎవరికీ ఆగ్రహం కలిగించకుండా, మర్యాదగా బతికేవాళ్లతో తగాదా లేదు గాని, అదేదో చాలా తెలివైన పని అయినట్లు, తాము చాలా research చేసి కనిపెట్టినట్టు, అది చాలా heroic deed అయినట్టు, సంతుష్టిగా మాట్లాడేవాళ్లంత చోరులూ, అధములూ వుండరు.
    "నువ్వు ముందు ఏం కాబోతున్నావు? నీ పిల్లల గతి ఏం కాబోతోంది? పోనీ ఆ బ్రహ్మసమాజంలోనన్నా వుండకపోతివి? ఏకాకివి. సంఘబలం లేందీ మనిషి నిలవగలడా? ఈనాడు, చిన్నతనంలో, కష్టాలు లక్ష్యం లేకపోవచ్చు. ముందు ముందు 'టూ లేట్' అయిన తరవాత విచారపడి ఏం ప్రయోజనం?" అన్నాడు.
    "ఈ మాటలే, కాలం గడిచినకొద్దీ నాకే తెలిసి పశ్చాత్తాపపడి తిరిగి బంధువుల్లో చేరతానని పదేళ్ళనించి వింటున్నాను" అని ప్రకాశం మామయ్య. వైద్యుడు సీతారామయ్యగారు మొదలు, ఆనాటి వరకూ, యీ గుంపునించి వేరుగా నిలవలేననీ, అపనిందల్ని, ఒంటరితనాన్ని భరించలేక, సౌఖ్యం కోసం, శాంతి కోసం, మర్యాద కోసం, పిల్లల కోసం, మళ్లీ యీ సంఘం కాళ్ళు పట్టుకుంటాననీ, ఎంతో ఆశించిన నేను తిరిగి తమలో చేరతానని ఆశపడేవారి సలహాలన్నీ యాకరువు పెట్టాను.
    "కష్టాలు కలగనేలేదా? ఒంటరితనం 'ఫీల్' కాలేదా?" అన్నాడు దయగా.
    నా కళ్ళంబడి నీళ్ళు తిరిగాయి. వొక్కరు దయగా పలకరించినవారు లేక, ఏకాకినై నేను గడిపిన నెలలు, ప్రతివారి మొహానా హేళనా, అసహ్యమూ కనబడి కుంగిపోయిన దినాలు, స్నేహితులే రహస్యాలు వెతికే కళ్ళతో నా యింట్లోకి భద్రంగా ప్రవేశించిన సాయింత్రాలు, ఒక్కరు హృదయం విప్పి మాట్లాడడానికి వున్నారా, యీ వర్ష రాత్రి అని వెతుక్కున్న సమయాలు! ఏమిటి, జీవిత సమస్యకి అర్ధమేమిటి, (values) విలువలు ఉంటే ఎట్లా కట్టాలి? యీ బాధకి అర్ధముందా లేదా అని వెతికిన అర్ధరాత్రులు!
    "అవును, బాధపడ్డాను. ఆ బాధలో ఏదో సంతోషం వుంది. గుంపులో చేరాలని మాత్రం ఎప్పుడూ ఉద్దేశ్యం రాలేదు."
    "ఎందుకు యిట్లా? ఏమిటి ఆదర్శం?"
    ఏం చెప్పను? నాకు తెలుసా? అదే నా ప్రశ్న. నేను దిక్కుల్ని అడిగే సమస్య. దేవుడా? సత్యమా? ధర్మమా? అన్నిటినీ మళ్ళీ నాకు నేను కనుక్కోవాలనే నా యత్నం. ఏమీ తెలీలేదు అంతవరకు. అన్నీ సందేహాలే. అయిన నేనేం చెప్పను? తెలుసునన్న వారితో తగాదా తప్ప!
    అదృష్టవంతులు మీరు.
        ...       ...     ...
    వడ్డించిన విస్తరి మీ జీవితం.
        ...    ...     ...
    నడతా, నాణ్యం, విలువల విషయం.
    నిశ్చల నిశ్చితాలు మావి.
    అభాగ్యలం మేము,
    సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం.             


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS