Next Page 
లేటెస్ట్ లవ్  పేజి 1


                              ది లేటెస్ట్ లవ్

                                 బొల్లిముంత నాగేశ్వరరావు

 


   
   హైటెక్ సిటీ!
రోడ్లు విశాలంగా వున్నాయి. మధ్య మధ్య నిలువునా పైబర్ రాడ్స్ తో బిఫార్ కేట్ చేయబడ్డాయి.
హిల్స్ మధ్య కట్టబడిన సిటీ అవ్వటంలో ఎత్తుపల్లాల్ని బాలెన్స్ చేస్తూ 'ప్లయ్ ఓవర్స్' ఒకదాని క్రింద ఒకటి ఒకటి నిర్మించబడి 'క్లోవర్ లీఫ్' లా అందంగా కనిపిస్తూ రోడ్ టెక్నాలజీలో పరాకాష్టను సంతరించుకున్నాయి.
గ్రౌండ్ మీది 'కాం కోర్స్' 'వెర్జెస్' లో వత్తుగా పెరిగిన గ్రీన్ గ్రాస్ కన్నుల పండువులా వుంది! ఆ వెంట నిలువునా అందమైన లేడీ సోల్జర్స్ లా విరబూసిన పూలచెట్లు శాంతి గీతాల్ని తమ రంగుల అక్షరాల్లో లిఖించి, గాలికి వినిపిస్తున్నాయి.
ఆ పూల చెట్ల వెనుక విశాలమైన ప్రదేశాల్లో వినూత్న రీతుల్ని సంతరించుకుని గంభీరంగా నిలబడిన హైటెక్ బిల్డింగ్స్!
రోడ్ల ఇంటర్ సెక్షన్స్ లో వున్న ఆలోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే పోలీసులెవరూ ఆ వీధుల్లో లేరు!
'మాన్ పవర్' స్థానంలో 'మెషిన్ పవర్' చోటుచేసుకున్న సిటీ!
అక్కడక్కడ పార్కింగ్ కోసం అందంగా కట్టబడిన 'లే-బైస్' ఆధునికంగా వున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఓల్డ్ సిస్టమ్స్ అయినా 'కాట్స్-ఐ'స్థానంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ చోటుచేసుకున్నాయి. ఎప్పుడూ అవి వెలుగుతూ, ఆరుతూ తమ హైటెక్ స్క్రీన్స్ మీద 'హెచ్చరికలు' జారీచేస్తున్నాయి.
ఇక ఖరీదయిన కార్లు మెత్తగా వున్న ఆ రోడ్లమీద మంచుగుట్టల మీదినుండి 'ఐస్ క్యూబ్స్' జారినట్లు సౌండ్ లేకుండా పోతున్నాయి.
రోడ్ల మధ్య ఇరువైపులకీ వంగి నియాన్ లైట్స్ తమ వంతు డ్యూటీ రాత్రికే అన్నట్టు-తమ జెయింట్ కళ్ళను మూసుకుని నిద్రపోతున్నాయి!
అక్కడే ప్రభుత్వ కార్యాలయాలున్నాయి.
మంత్రి వర్గం కాలనీ వుంది.
సరిక్రొత్త సొగసుల్ని వెదజిమ్ముతూ శాసనసభలున్నాయి.
ఆఫీసుల్లో కాగితాలు గుట్టగా పేరుకొని, తమకు అర్జెంటు అక్షరాల క్రింద 'ఫైల్స్' అని పేరు పెట్టుకొని ఆర్దనరీగా కూడా కదలకుండా సంవత్సరాల తరబడి మూలుగుతూ ముక్కుతూ అక్కడ లేవు.
చేతికి తడి అంటితేకాని జలవిద్యుత్ పుట్టి 'ఫైలు' పెరిగే ఫెండింగ్ ప్రాబ్లెమ్స్ అక్కడలేవు!
పనులు చకచకా జరిగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నానుకొని వున్న అలాంటి హైటెక్ సిటీలో...
                                                        *    *    *    *
ఆ రోజు రుక్మిణి గుట్టమీది పాలరాతి దేవాలయంలో పూజముగించుకుని ఇంటికి చేరింది. ఇంటి ముందు ఏడెనిమిది మంది సెంట్రీలు-భుజాలకు గన్స్ తగిలించుకుని అలాగే నిలబడి వున్నారు. ఆమెను చూసి వారు మరింత ఎలర్టివ్ అయ్యేరు.
ఆమెకు వారిని చూసినప్పుడల్లా అదోరకం వింతభావం! తన భర్త మంత్రి కాకముందు ఫ్రీగా తిరిగి__ఇప్పుడు రక్షణ వలయాల మధ్య నిత్యం దాగి దాగి తిరుగుతున్నాడు. ఆయన బయలుదేరితే వేనుకామున్దూ కార్లు. ఆ కార్లనిండా పోలీసులు, అధికార్లు. వీరు కాక పర్సనల్స్! ఫైలట్ కార్లు చేసే రోద భరించరానిదిగా వుంటోంది.
ఆయన బయటి కెళ్ళాక కూడా ఇంటిచుట్టూ కాపలా! ప్రజా పరిపాలకులకు ప్రజలనుండి ప్రమాదం. ప్రజల్ని రక్షించటానికి ప్రజల నుండి రక్షణ.
ఆమె నవ్వుకుంటూ భవంతి ముందుకు చేరింది.
ఆమె వెంట కూడా అప్పటివరకు ఫాలో అయిన గన్ మాన్ సెంట్రీల్లో కలసిపోయాడు.
ఆమె చేతిలో పూలసజ్జ. అందులో వున్న ఐదు కొబ్బరిచిప్పలు, పూలు, ఇవన్నీ ముక్కలుచేసి, ఇంట్లో పనిమనుష్యులకీ, సెంట్రీలకూ తలారెండు ముక్కలివ్వాలి. వారు కళ్ళ కద్దుకొని తింటారు.
సర్వేశ్వరుడు తమను రక్షించాలని....
తాము మాత్రం తను మంత్రిగారిని రక్షించాలని....
తమను రక్షించే సర్వేశ్వరుడిని కూడా అక్కడ గుడి చుట్టూ తుపాకులు చేతపట్టుకుని రక్షిస్తున్న గార్డ్ లు...! ఆమె మరింతగా మనసులో నవ్వుకుని ముందుకు కదిలింది.
విచిత్రమైన రక్షణ వలయాలు.
భవంతి ముందు రకరకాల పూలచెట్లు రంగు రంగుల్లో తమ పూలను విరబూసి__మనోహరంగా కనిపిస్తున్నాయి.
ఆమె మరింత ముందుకు కదిలింది.
భవంతి ముందు మెట్లమీద ఓ చిలుక! ముదురు ఆకుపచ్చ రంగులో ముక్కు పగడంలా మరింత ఎరుపుగా, ముచ్చటగా తమకు స్వాగతం పలుకుతున్నట్లు అలాగే వుంది.
తనను చూసి లేవలేదు.
సంబరం బంధనాలనుండి పదిరోజుల క్రితమే తనో చిలుకను వదిలింది. ఆ పంజరం అలాగే ఖాళీగా వుంది.
'స్వేచ్ఛ' జీవితానికి సంకేతమయితే....తను పదిరోజుల క్రితం చేసినా పని చాలా గొప్పది! ఆ చిలుక ఎంత ఆనందంగా రెక్కలల్లార్చు కుంటూ ఎగిరిపోయిందో....ఇప్పటికీ దాని రెక్కలక్రింద వినిపించిన స్వేచ్చాగాన రెపరెపలూ, టపటపలూ ఆ తరువాత ఆకాశంలో అది కొట్టిన ఫల్టీలు- కళ్ళ ముందు జ్ఞాపకాల్లో అలాగే వున్నాయి. ఇక ముందు కూడా అలాగే వుంటాయి.
మరి ఈ చిలుకేమిటి బయటి నుండి లోనికొచ్చింది. తనను చూసి లేవందే...?!
ఆమె మెట్లను సమీపించింది.
ఆ చిలుక అలాగే నిలబడింది. కదల్లేదు. మెదల్లేదు. ఆమె మెట్లెక్కింది.
ఆమెకు మరింత ఆశ్చర్యం...!
అది చిలుక కాదు!
అచ్చం చిలుకలా వున్న అపురూపమైన బొమ్మ!
దాని కాళ్ళక్రింద ఏదో కాగితం మడత.
ఆమె మరింత ఆసక్తిగా ముందుకు కదలి__ఆ బొమ్మను చేతిలోకి తీసుకుంది.
పూలసజ్జను తన వెంట వున్న పనిమనిషి చేతికిచ్చింది.
చిలుకను అలాగే ఓ చేతిలో వుంచుకుని, రెండోచేత్తో కాగితాన్ని అందుకుంది. మెల్లిగా మడతల్ని విప్పింది.
అందులో అందంగా, గుండ్రంగా ముచ్చటగా వున్న అక్షరాలు.....ఆమె చదవటం మొదలెట్టింది.
"....మీరు భయపడకండి! మీ చేతిలోని బొమ్మ చాలా విలువయినది. దాని ఖరీదు ఒక అధ్బుతం! ఆ తరువాత ఒక కోటి రూపాయిలు మీ చేతికొస్తాయి.
మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్!
ఈ చిలుక మెడ దగ్గిర గట్టిగా పట్టుకుని నొక్కండి. ఒక నిభిడాశ్చర్యం జరుగుతుంది.
సిటీలో సైరన్ వినిపిస్తుంది. పోలీసులు హడావుడి చేస్తారు. గూండాలు రంగంలోకి దిగుతారు. కొట్లు మూయిస్తారు. ఆ రోజు ఆఫీసులన్నీ సెలవు ప్రకటిస్తాయి.
రెండు రోజులు గడుస్తాయి. ఆ తరువాతే మీ చేతికి కోటి రూపాలొస్తాయి!
పై విషయాలన్నీ బేరీజు వేసుకుని- చిలువను చేతిలోకి తీసుకోండి! ఆలోచించుకోవాలనుకున్నారా?! అయితే ఓ సంబరంలో పెట్టండి. గట్టి నిర్ణయం తీసుకున్నాకే గట్టిగా నొక్కండి."
కాగితంలోని విషయం మొత్తం చదివి ఆమె అలాగే చలనం కోల్పోయినట్టు నిలబడింది.
ఇంతమంది సెంట్రీలుండగా ఈ బొమ్మ యిక్కడికెలా వచ్చింది? అయినా ఈ చిలుక పీక నేను నొక్కటమేమిటి? నాకు కోటిరూపాయలు ఎందుకు వస్తాయి?
కోటిరూపాయలు!
ఆమెకు మరింత చెమటలు పోశాయి.
తనకు ఈ సమయంలో వెంటనే కావాల్సింది కూడా ఒక కోటి రూపాయలే! తన ఆరాటం కూడా కోటి రూపాయిల కోసమే!
దీని పీక నొక్కితే తనకు తెలీని అధ్బుతం జరుగుతుంది.
ఆమెకు మరింత అయోమయమయింది.
"తను కోటిరూపాయల కోసం సతమతమవుతున్న విషయం ఈ బొమ్మను యిక్కడ పెట్టిన మనిషికి ముందే తెలుసా?"
ఆమె రాకను గమనించిన ఇంట్లోని పనిమనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు తీశారు. లోనికి రావాల్సిందిగా స్వాగతం చెప్పారు.
యజమానురాలి చేతిలో వున్న అందమైన చిలుకబొమ్మను చూసి....క్షణకాలం నిజమైన చిలుకే అనుకొని....లోపలి నుండి వచ్చిన ఒక పని మనిషి-
"పంజరంలోకి మరో చిలుకను తెచ్చారా అమ్మగారూ?" అంటూ వినయంగా అని అలాగే నిలబడింది...ఆ మనిషి ముఖంలోకి సూటిగా చూస్తూ ఆమె.
"ఇంతకు ముందు ఇటెవరైనా వచ్చినట్టు చూసారా?" అంటూ అడిగింది.
"చుట్టూ పోలీసోళ్ళుండగా ఎవరొస్తారమ్మగారూ?" పనిమనిషి అమాయకంగా అంది.
"తలుపెప్పుడేశారు?"
"మీరు గుడి కెళ్ళంగానే వేశాం. మళ్ళా ఎవరన్నా బెల్ మోగిస్తేనే గంధా తలుపు తీసేది?"
పనిమనిషి సమాధానం విని ఆమె మనసులో అనుకుంది.
"అంటే ఈ చిలుక రహస్యం వీరికెవరికీ తెలీదన్నమాట! మరెవరు పెడతారిక్కడ?! తను వెళ్ళేటప్పుడు లేని చిలుకబొమ్మ, తను గుడికి వెళ్ళి వచ్చేలోపు యిక్కడికెలా వస్తుంది? దీనిలో ఆటోమాటిక్ సిస్టమ్ లాంటిది ఏదయినా వుంది కీ ఇచ్చి వదిలితే అలా ఎగురుకుంటూ వచ్చి, వారు వాలమన్నచోటులో వాలి వుంటుందా?
అదిప్పుడు పెద్ద సమస్య కాదు.
రిమోట్ కంట్రోల్ తో పిల్లలు ఇప్పుడు విమానాలనే నడుపుతున్నారు. అదీకాక తాముంటుంది హైటెక్ సిటీ!
ఎలా వాలిందన్నది కాదిప్పటి సమస్య!
అలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అందులోనూ తన ఇంటిముందు దీన్ని వుంచాల్సిన అవసరం వారికెందుకుంటుంది?
తనకీ సమయంలో డబ్బు కావాల్సిన మాట నిజం! అది వారికెలా తెలుసు?!
ఆమె మనసులో ఆలోచనలు సంఘర్షించుకుంటే ఆ చిలుకని అలాగే పట్టుకుని ఆమె లోనికి రావటానికి ప్రయత్నించింది. మరలా మనసు వెనక్కి పీకింది.


Next Page 

WRITERS
PUBLICATIONS