Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 43

 

    ఆచార్యులు రైలులో మాకుఁ గాలక్షేప మగుటకై తాము పూర్వము చూచిన విశేషములను వేరు వేరుగ వర్ణించుచు , నాయాస్థలములను బటములో నెత్తి చూపుచు పురాతన విజయ నగర చరిత్రమును వివరించుచు విసుగు లేకుండ చేయుచుండెను. మేము వెంట గొనిపోయిన రొట్టెలను పండ్లను, దినుచు నడుమ నడుమ పెద్ద స్టేషనులలో బండి యాగినప్పుడు తేనీరు ద్రాగుచుంటిమి. కొలఁదిసేపు శర్మయును నేనును జదరంగ మాడితిమి. మా పెట్టెలో జనసమ్మర్ధ మదికముగా నున్నందువలన మేము రాత్రి యంతరము మేలుకునియే గడిపితిమి, మా శాస్త్రిమాత్రము ప్రక్కనున్న ముసలమ్మను బ్రతిమాలుకొని బల్ల మీఁద గొంచెము చోటు సంపాదించి యేట్లో యందే ముడుచుకొని నిద్రాదేవికి స్వాగత మిచ్చేను. మేము చదరంగ మాడు సమయంలో మాయాచార్యులు మెల్లగా బల్లకుఁజేరగిలబడి రెండు కునుకులు దీసెను. స్టేషను వెంట స్టేషను గడిచిపోవు చుండెను.
    హంపీ క్షేత్రము హోస్పేటకు నెనిమిది మైళ్ళ దూరములో బళ్ళారి మండలము నందున్నది మచిలీపట్టణమునుండి మార్మగోవాకుఁ బోవు రైలు మార్గము నందు హోస్పేట స్టేషను గలదు. గుంటూరు నుండి హోస్పేటకు దాదాపు మూడువందల ముప్పదిమైళ్ళు. మా బండి హోస్పేటలో నాగినది. మేము సామానులు దింపుకొని స్టేషనులోనికి వచ్చితిమి. వేఁడి వేఁడి కాఫీ తీసుకొని హంపీ మార్గమును బట్టితిమి. సామానులు తెచ్చుటకై యొక కూలీ వానిని వెంట దీసికొంటిమి. శాస్త్రీ బండి మీదఁ బోవుదమని సలహా యిచ్చేను గాని మార్గమధ్యమున గూడ గొన్ని దర్శనీయములగు కట్టడము లుండుటచే మేము దాని అంగీకరించలేదు. అందరమును కాలినడకనే హంపీ క్షేత్రన్ముఖుల మైతిమి.
    హోస్పేట యను గ్రామమునకే పూర్వము నాగలాపుర మను నామధేయముండేడిదట. కృష్ణదేవరాయలు తన ఉంపుడుగత్తెయగు "నాగులదేవి" పేరిట దీనిని నిర్మించుటచే నిట్టి పేరు కలిగినదని చెప్పుదురు.
    హోస్పేట నుండి హంపికి సువిశాలమైన మార్గము గలదు. త్రోవలో నచ్చటచ్చట శిదిలములైన దేవాలయ మంటపములు గాన్పించుచుండెను. పూర్వ మీ మార్గమొక గొప్ప బజారుగా నుండేడిదట.
    మేము హోస్పేటను దాటి సుమారొక మైలు దూరము వచ్చితిమి. అక్కడ ననంతశయన దేవాలయమొకటి గన్పించినది. ఈ యాలయము చాల గొప్పదిగను దీర్ఘ చతురస్రముగను నున్నది. గర్భాలయములో మిక్కిలి పొడవును ఎత్తును గల పీఠమొకటి యున్నది. దీని యాకారమును బట్టి చూచినా నిధి శేషశాయి యగు శ్రీ మహావిష్ణువు నుంచుట కొరకై కట్టబడి యుండవచ్చు నని తోచినది. ఈ దేవాలయములోఁ బ్రతిష్టించుటకై చేయఁబడిన విగ్రహము ప్రస్తుతము బళ్ళారి జిల్లాలోని హడగల్లి తాలూకా యందలి "హేలాలు" గ్రామమునందున్నదట.
    ఈ యాలయములోని ప్రత్యేకత యేమనగా దేవాలయ గర్భమునకుఁ బైనున్న గోపురము సున్నముతోడను నిటుక తోడను గట్టఁబడి దూలముల సహాయము లేకయే విలువంపు గలిగియున్నది. ఆ గోపుర మట్లు నిల్చియుండుటఁ జూచిన నాకాలపు వాస్తు శాస్త్రజ్ఞులు కళా కౌశలము మనకు స్పురింపకపోదు. దేవాలయమున కెదురుగఁ చక్కని స్తంభములు గల యొక మంటపమున్నది.
    హోస్పేటకును హంపికిని మధ్య "చూళాయి బావి" యను నొక బావి కలదు. ఇయ్యది బాటసారుల యుపయోగార్ధము "చూళాయి" యను నొక వేశ్యకాంతచే నిర్మింపఁబడినదట. ఇది ప్రస్తుతము పాడుబడి యున్నది.
    మేము మరి కొంచెము సేపటికి హంపి సమీపించితిమి. హంపికి సమీపముగా రెండు గొప్ప మహమ్మదీయ సమాధులు మాకు కనిపించినవి. ఒకటి కొంచెము పెద్దది, రెండవది దాని కన్నఁ జీన్నది. పెద్ద సమాధికి ధనురాకారము గల ముఖ ద్వారములు నాలుగు దేసలను గలవు.
    ఈ మహమ్మదీయ సమాధులను గడచి మరికొంచెము దూరము ముందుకు నడచితిమి. "మనము జీర్ణ విజయ నరములోఁ గాలు పెట్టినా" మని యాచార్యులనెను. నా శరీర మాపాద మస్తకమును బులకరించినది. గుండె లెందుకో దడదడ కొట్టుకొనసాగినవి. నా నరములలోని రక్తము పొంగు లేత్తినది. ఆ శిధిలములకును నా జీవితమునకును నేదో యాంతరంగిక మగు నాత్మీయ సంబంధమున్న దనిపించింది. నా కన్నుల నుండి రెండు శుక్ర కణములు రాలినవి. వారు చూడకుండ నుత్తరీయంతో ముఖము దుడుచుకొని, అందరితో పాటు ముందున కడుగులు పెట్టుచుంటిని.
    "హంపీ" కీ ప్రాంతమం దెచటనైన బసచేసి శిధిలములను జూడఁ గూడదా యని శర్మయును, శాస్త్రియును బలికిరి, కాని మాకిది యిష్టము కాలేదు. పాడుపడిన పట్టణములు జూచుటకై వచ్చిన మేము పాడుపడిన స్థలములలోనే నివాస మేర్పరచుకొని యందలి శిధిలములను దర్శించినప్పుడే సరియైన సానుభూతి లభించును గాని, దొరబిడ్డ వలె బంగళాల లోపలను, భవనములలోను బసచేసి యదృశ్యములను జూచి యాత్మ సంతృప్తి సంపాదించ జాలమని తోచినది. ఉచితమగు మనోభావమున్నప్పుడు గదా విషయగ్రహణమును వీలేర్పడి యాత్మీకతృప్తి చేకూరుట!
    'హంపీ' లోని శ్రీ విరూపాక్ష దేవాలయము ప్రక్కనున్న మఠములో బసచేయుదమని నేను ప్రవేశ పెట్టిన తీర్మానమును మాలో నదిక సంఖ్యాకులొప్పుకొనుటచే స్వామి వారి యాలయమునకు సూటిగఁ బోయితిమి. ఎటు చూచినను శిదిలములైన కట్టడములు కంటఁబడుచుండగా ద్రవించుచున్న హృదయముతో స్రవించుచున్న బాష్పములతో నందఱమును ముందునకు నడచి యా మఠములో నొకగది తీసికొని యందు బస చేసితిమి.
    గంటలో మా శ్యాము వంట ముగించినాడు. వెంట వచ్చిన కూలీవానిని బజారునకుఁ బంపి పెరుగు తెప్పించి'తిమి. సమీపమం దున్న తుంగభద్రానదిలో స్నాన మొనరించి వచ్చితిమి. అచ్చట తుంగభద్ర మిక్కిలి యురవడిగాఁ బ్రవహించుచున్నది. ఆ తరంగణీ తరంగముల కదలికలో నాకు పురాతన విజయనగర సామ్రాజ్య లక్ష్మి శిధిలకంఠధ్వనులు వినిపించినవి. త్వరత్వరగ స్నానము ముగించుకొని భోజనములు గావించి యొకింత సేపు మార్గాయాసము దీర శయనించితిమి.
    కొంచెము చల్లబడిన తోడనే మే మందఱమును గలిసి దేవాలయమునకు సమీపమం దున్న మాతంగ పర్వతము వద్దకు నడచితిమి. ఆ పర్వతము చాలా యెత్తుగానున్నది. ఆ పర్వత శిఖరముపై నొక దేవాలయ మున్నది. ఆ యాలయపు కప్పుపై నెక్కి నలుగడలఁ జూచినతో జీర్ణ విజయనగర మంతయు గన్నులకుఁ గట్టినట్లు స్పష్టంగా గనిపించు ననియు, అప్పుడేయే కట్టడము లెక్క డెక్కడ నున్నదియు బాగుగా నాకళింపు జేసికొని యనంతరము శిధిలములను దర్శించుట బాగుండుననియుఁ దెలిపి యాచార్యులు మమ్మా పర్వతము పైకిఁ గొనిపోయేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS