Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 4

    "నే కాస్తాలే"

    "కాయి జాగ్రతగా కాయి" అంటూ ఇద్దరూ జోగుతూ అవతలి కెళ్ళారు.

    నందితాదేవి నిశ్శబ్దంగా నవ్వుకుంది." తనకి తనే కాపలా. మాట్లాడిందేవరో తెలియనంత మత్తులో వున్నారు హ్హూ" అనుకుంది.
    ప్రెజెంటేషన్ పెట్టె విప్పేముందు గది లోపల గడియ బిగించింది. పెట్టె విప్పి బురఖా తీసింది, పెట్టెని మంచం క్రిందకి తోసి బురఖా ధరించింది. ఎవరయినా గదిలోకి వచ్చినా అనుమానం రాకుండా వుండటానికి బాత్ రూంలో పంపుని ఫుల్ గా తిప్పింది.

    ఇప్పుడు నీళ్ళు పడుతున్న ధ్వని పెద్దగా వినిపిస్తున్నది. బాత్ రూమ్ బయట నుంచే లోపల గడియ వేయవచ్చు. అలా చేస్తే తలుపులు బద్దలు కొట్టాల్సిందేగాని, ఇంక గడియ రాదు. చేయవలసిన గట్టిపని చేసేసింది.

    నెమ్మదిగా గది తలుపులు తీసి తల బయటికి పెట్టి చూసింది. నడవాలో ఎవరూ లేరు. వేగంగా బయటికి నడిచింది. మేడ దిగటానికి వెనుక నుంచి మరో దోవ వుంది. దానిని పెద్దగా ఎవరూ వాడరు. ఆ దోవన మేడ దిగింది నందితాదేవి.

    పెళ్ళికూతురు ఇంట్లోంచి పారిపోయింది అని తెలియటానికి చాలా సమయమే తీసుకుంటుంది. బాత్ రూం తలుపు కొట్టి కొట్టి పిలుస్తారు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టాలి. కనీసం గంట పని. దాసీలు మత్తుగా నిద్రపోతున్నారు. వాళ్ళ మత్తు వదలాలి. కొంత సమాచారం తెలియాలి.

    బురఖా వేసుకుని బయటికి వచ్చిన నందితాదేవిని పెళ్లివారింట్లో ఎవరయినా చూసి వుండవచ్చు. కాని ఎవరికీ అనుమానం రాదు. ఎందుకంటే గోవర్ధనమ్మకి పలురకాల స్నేహితురాళ్ళు వున్నారు. గోవర్ధనమ్మ భర్త గోపాలరావు సంగతి చెప్పేదేం లేడు. మంది మార్బలం-ఆ వూరికి చిన్న సామంత రాజే అనొచ్చు ఇదే రాజుల కాలం అయితే. తెలిసిన తమిళులు వచ్చి వెళుతుంటారు. గుజరాతీ స్నేహితులున్నారు. బురఖాలలో ముస్లిం సోదరీమణులు వచ్చి వేడుతూండటం పరిపాటి నందితాదేవిని వాళ్ళలో ఒకరనుకుంటారు.

    నందితాదేవి క్షేమంగా ఇంట్లోంచి బయటపడింది.

    వీధిమూల మలుపులో ఆటో వుంది.

    గబగబ నడిచి ఆటో దగ్గర కెళ్ళింది.

    ఆటో డ్రయివర్ నిర్లక్ష్యంగా ఆమెని చూసి అరమోడ్పు కన్నులతో బీడీ తాగుతూ వుండిపోయాడు ఆటో నానుకుని.
    "భాయ్! ఆటో పాతది లాగుంది?" నందితాదేవి అంది.

    ఆటో డ్రయివర్ చటుక్కున బీడీ పారేశాడు. "బహెన్! ఆటో పాతది. అవసరానికి ఆఘమేఘాల మీద పరుగెత్తుతుంది" వినయంగా అని సీట్లో కూర్చున్నాడు.

    ఏమాత్రం ఆలస్యం చేయకుండా నందితాదేవి ఆటో ఎక్కింది.

    ఆఘమేఘాల మీదనే ఆటో ముందుకు పరుగుతీసింది.

    పూల బజారుకి పావుగంట పడుతుంది.

    ఆటో డ్రయివర్ ఏమన్నా చేబుతాదేమో అని చూసిందామె. అతను స్పీడుగా ఆటో నడపటం తప్ప పెదవి కదపలేదు...

    పచ్చరంగు చిన్నకారు పక్క కొచ్చి ఆటో ఆగింది.

    ఆటో ఆగగానే కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు కారు డ్రయివరు.

    నందితాదేవి ఆటో దిగి కారు ఎక్కింది.

    పచ్చరంగు కారు పడుచుపిల్లలా పరుగు తీసింది ముందుకు.

   
                                     2

    ఆ వీధిలో "అందాలు-అలంకరణలు" బోర్డ్ ఓ ఇంటి ముందు వేలాడుతున్నది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS