Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 37


    చేతులు  వాష్ చేసుకుంటూ  అన్నాను ,రాజేశ్వరితో__"ఈ రోజు మరో గుణపాఠం నేర్చుకున్నాను డాక్టర్ ! ఒక రోగి తన బాధను  వ్యక్తపరచినప్పుడు, ఆఁ ఏదో చాదస్తంగా  చెబుతున్నాడులే !" అని తేలిగ్గా తీసుకోవటానికి  వీల్లేదు. ఆ తప్పటడుగే  మహా  ప్రమాదానికి  దారి తీయవచ్చు."

    ఆమె అంగీకరిస్తున్నట్లు  తల ఊపింది.

    ఈ వార్త  బయటకు  ప్రాకగానే  హాస్పిటల్లో  మరోసారి  పెద్ద  సంచలనం చెలరేగింది "హల్లో గ్రేట్ సర్జన్ ! మళ్ళీ  ఏదో  ఘనకార్యం  చేశావుటగా" అంటూ  మృదుల  వచ్చింది. ఆ సాయంత్రం  రెండు గంటలసేపు నా దగ్గరే  కూర్చుండిపోయింది. నా డ్యూటీటైము  అయిపోయేవరకూ  కదలలేదు. చివరకు  నాతోనే  బయటకు వచ్చింది.

    నేనెంత శాంతమూర్తిని  అనుకున్నా, శాంతంగా  ప్రవర్తించాలని  ప్రయత్నించినా  మానవ సహజమైన  బలహీనత్వం  ఒక్కోసారి  ఆక్రమించి  జయిస్తూ  వుండేది.

    ఒక ఉదయం  టేబిల్  ముందు  కూర్చుని  వున్నాను. ఒక స్త్రీ  ఆసరాతో  ఒక వ్యక్తి  కుంటుకుంటూ  నడిచి  వచ్చాడు లోపలకు  బహుశా ఆ స్త్రీ అతని భార్య అయివుండాలి.

    "సైకిలు మీద  పోతూంటే  ఏక్సిడెంట్  అయింది. కాలు విరిగినట్లుగా  వుంది చూడండి" అన్నాడు, దుడుకుగా.

    చదువుకున్న  వాడిలాగానే  వున్నాడుగాని  అతని  ప్రవర్తనలో  సభ్యతెక్కడా  కనిపించలేదు.

    నేను రిస్ట్ వాచి  చూసుకుని, "యిప్పుడు తొమ్మిదే  అయింది. మీ కాలిమీద  బయటకు  దెబ్బేమీ కనబడటం లేదు. మీరు ఆర్దోపిడిక్ వార్డుకు  వెళ్ళి  చూపించుకోవాలి" అన్నాను.

    అతను  విసుగ్గా  చూస్తూ "యింత  బాధతో  వస్తే, అక్కడకూ  యిక్కడకూ వెళ్ళమంటా రేమిటండీ! మీరు డాక్టర్లు కాదా ! పరీక్ష చెయ్యండి" అన్నాడు.

    నేను ఓర్పుగానే  "చూడండీ, హాస్పిటల్ కు కొన్ని  నిబంధనలున్నాయి. ఈ టైములో  వచ్చేవారు  ఆ బాధలకు  సంబంధించిన  డిపార్టుమెంట్ లకు  వెళ్ళి  చూపించుకోవాలి" అని  చెప్పాను.

    "అహ ! అలాగా ! ఆ రూల్సన్నీ  మాకు  తెలియవు  లెండీ....అయినా  నేనిప్పుడు  నడిచివెళ్ళే స్థితిలో  లేను. ఎలా  పంపిస్తారో  మీరే  పంపించండి నన్ను" అన్నాడు మొండిగా.

    అతని  మొండితనం  చూస్తుంటే  కోపం వచ్చింది  నాకు. "అంత కదల్లేని  స్థితిలో  వున్నవారు  యిక్కడిదాకా  ఎలా  నడుస్తూ  వచ్చారు ?" అనడిగాను.

    "అవన్నీ  మీకు  అనవసరం .హాస్పిటల్  లోపలికి  ప్రవేశించాక  రోగి  తాలూకు  బాధ్యత  మీరే వహించాలి. మీ కందరకు జీతాలిస్తున్నది ఎందుకు ?" భార్య "అబ్బ, ఊరుకోండి. ఘర్షణ ఎందుకూ?" అని వారించటానికి  ప్రయత్నిస్తూన్నా, దూకుడుగా  అన్నాడు.

    "మాకు జీతాలిస్తున్నది  మీ అందర్నీ  మోసుకెళ్ళటానికి  కాదు ఇహ వెళ్ళండి" అన్నాను, కుర్చీలోంచి  లేచి నిలబడి గట్టిగా  అరుస్తూ.

    "ఏమిటలా  మీదమీదకు  వస్తున్నారు కొడతారా ?"

    ఆ మనిషి  అంటే  పరమ  అసహ్యమేసింది. నా సంస్కారాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ  చంపేస్తున్నాడతను.

    "ఛ ! నిన్ను కొడతానా ?" అన్నా నప్రయత్నంగా.

    అతను ఉలికిపడినట్లు  చూశాడు.

    బెల్ కొట్టి  వార్డు బాయ్ ని  పిలిచాను. అతను  రాగానే  "వీరిని  జాగ్రత్తగా బయటకు పంపేయి" అన్నాను.

    ఆ వ్యక్తి మాటలు  తడబడుతూండగా  అస్పష్టంగా ఏదో అంటున్నాడు. వార్డుబాయ్ పరిస్థితి  అర్ధంచేసుకుని "పదండి మేష్టారూ ! ఇక్కడ  గొడవ  చెయ్యకూడదు" అని భుజంమీద  చెయ్యివేసి  మృదువుగానే  బయటకు తీసుకువెళ్ళాడు.

    ఆ సంఘటన తల్చుకుంటే  కాసేపున్నాక  విచారమూ వేసింది, నవ్వూ వచ్చింది.

    క్యాజుయాలిటీ  పోస్టింగు  అయిపోవస్తోంది. ఇంకా ఒకటి  రెండు రోజుల్లో   ఒకనాటి  ఉదయం  నళిని  వచ్చింది. "కనిపించటం  లేదేం  డాక్టర్ ?" అంటూ.

    ఆ మాట నిజమే. అప్పటికామెను  కలుసుకొని  పదిహేను రోజులకు పైగా  అయింది.

    "ఇవాళ నా డ్యూటీ  రెండుగంటలకు  అయిపోతుంది. సాయంత్రం  వస్తాను సిస్టర్!" అన్నాను, నవ్వి.
   
    "నన్ను  సిస్టర్ అని పిలవ్వొద్దన్నాను. నాకిష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను ?"

    నేను మెదలకుండా  ఊరుకోవటం చూసి "ఊఁ సరే, దాన్ని  గురించి గంటలు గంటలు ఆలోచించి వర్రీ అవకండి....సాయంత్రం  తప్పకుండా వస్తారుగా ! ఒట్టు సుమా !" అంది.

    "వస్తానంటే  మాట  తప్పను" అన్నాను.

    అన్న ప్రకారమే  ఆ సాయంత్రం  ఆరుగంటలకు  నళిని  పనిచేస్తున్న సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్టుమెంటుకు  వెళ్ళాను. హాస్పిటల్ కు కావలసిన  సకల సామగ్రీ, యింజక్షన్  సిరంజిలూ, బేండేజీ క్లాత్ లూ __ అన్నీ యిక్కడ స్టెరిలైజ్ చేసి  ఆయా డిపార్టుమెంటులకు  పంపిస్తారు.

    నళిని  నన్ను చూసి  కుర్చీలోంచి  నవ్వుతూ  లేచి నిలబడి, "రండి డాక్టర్!" అంటూ ఆహ్వానించి నన్ను కూర్చోపెట్టింది.

    బల్లమీద  బేండేజి క్లాత్ లు   గుట్టలు గుట్టలుగా  పడివున్నాయి. నేను వెళ్ళేసరికి  ఆమె కత్తిరిస్తూ  కూర్చుందన్నమాట.

    "ఒక్కరే ఉన్నారే, మీ స్టాఫ్ లేదా ?"

    "లేదు. రెండు రోజులు సెలవు పెట్టింది. ఆమె స్థానంలో  మరెవరినీ నియోగించక పనంతా  నన్ను ఒక్కదాన్నే  చూసుకోమన్నారు."

    "మీకు పరీక్ష లెప్పుడు ?" అనడిగాను.

    "దగ్గరకొస్తున్నాయి. మరో పదిరోజులు."

    "బాగా చదువుతున్నారా ?"

    "ఏం చదువులెండి ? నా మొహం.ఇవతల పనే చూసుకోవాలా, మధ్య మధ్య వాళ్ళు  వేసే క్లాసులు ఎటెండ్ అవ్వాలా ? రాత్రుళ్ళు  పుస్తకం తీసేసరికి  నిద్ర వస్తుందాయె. ఇహ ఎప్పుడు చదివేది ?" అని నవ్వింది.

    "ప్యాసు కాకపోతే మీ పని చెబుతాను" అన్నాను.

    "ఏం చేస్తారేం ? అవును, ఏం చేస్తారు ? చెప్పండి. వినాలని  చాలా యింటరెస్టు గా వుంది" అంది, ముఖంలో కుతూహలం  కనబరుస్తూ.

    "అమ్మా ఆశ ! ఇప్పుడు చెబుతానేమిటి ?"

    "చెప్పకపోతే  దాచుకోండి  పోనీ. నాకేమన్నా  భయమనుకున్నార ? అసలు నేను తప్పితే  కదా ! తప్పటం యీ జీవితానికి  అలవాటు లేదు."

    "నేనేం వద్దన్నానా ? పోనీ, ప్యాసవ్వండి. అప్పుడు శిక్ష కాదు, ప్రెజెంటు."

    "ఓహో ! ప్రెజెంటా ?" అని కళ్ళెగురవేసింది. "ఏమిటిది ? మిమ్మల్నడగకూడదు లెండి. చెప్పరుగా."

    నళిని గోడ దగ్గరకు  వెళ్ళి బీరువా తెరిచి, అందులోంచి  ఎర్రటి ఏపిల్ పండు ఒకటి తీసుకువచ్చింది. వాష్ బేసిన్ దగ్గర  దాన్ని  శుభ్రంగా కడిగింది. తర్వాత  చాకుతో  దాన్ని  రెండు  ముక్కలు కోసి  ఒకటి నాకు అందిస్తూ  "తీసుకోండి" అంది.

    ఆమె దగ్గర  ఒక మంచిగుణం  చూశాను. ఎప్పుడు కలుసుకున్నా  చాకలెట్టో, పిప్పరమెంటో, స్వీటో, పండో ఏదో ఒకటి  యిస్తూ  వుంటుంది. ఒట్టి  చేతుల్తో  ఎప్పుడో  వుండేది కాదు.

    యాపిల్ ముక్క  మెరిసే  తన పళ్ళ  మధ్య  వుంచుకుని  కొరుకుతూ ఏదో అనుమానం తోచినట్లు  గబగబ  గుమ్మందాకా  వెళ్ళి  తొంగిచూసి, తొట్రుపాటుపడుతూ  తిరిగి  వచ్చి  చప్పున  నా చెయ్యి  పుచ్చుకొని  లాగుతూ  "రండి, మేట్రన్ వస్తోంది. మిమ్మల్ని  దాచేస్తాను" అంది ఆదుర్దాగా.

    "దాచెయ్యట  మేమిటి ? నాన్సెన్స్ ! వస్తే  రానివ్వండి."

    "అలాక్కాదు. వాదులాడకుండా  చప్పున  రండి. మీకు పుణ్యముంటుంది" అని నేను తిరిగి  మాట్లాడటానికి  సందులేకుండా  చెయ్యిపట్టుకుని  లాక్కుపోయి, ఒక ప్రక్కకి  తీసుకువెళ్ళి, తలుపు తెరిచి, ఓ గదిలోకి  త్రోసి, మళ్ళీ  బయట  గొళ్ళెం  పెట్టింది.

    జరిగింది నాకేం  అర్ధం  కాలేదు .నళిని  మీద  వెర్రికోపం  వచ్చింది. గదిలో  చీకటిగా  వుంది. బహుశా  స్టోర్ రూమ్ అనుకుంటాను. చెడ్డ ఉక్కగా  వుంది. స్విచ్ ఎక్కడ వుందో తడిమి లైటు వేద్దామనుకున్నాను. ఒక్క క్షణమాలోచించి  ఆ ప్రయత్నం  విరమించి, గట్టిగా తలుపు తడదామనుకున్నాను. ఇంతలో  బయట ఎవరివో మాటలు వినిపించి, ఆ ప్రయత్నమూ  విరమించి మెదలకుండా నిలబడ్డాను.

    "స్టాఫ్ లేదా ? నువ్వొక్కదానివీ  పనంతా  చూసుకుంటున్నావా ? వెరీ నైస్" అంటూ మేట్రన్ గొంతు వినబడుతోంది.

    నళిని  సన్నని  స్వరంతో  ఏదో అందిగానీ, సరిగ్గా  వినబడలేదు.

    "స్టెరిలైజేషన్  జరుగుతోందా ? జాగ్రత్తగా  వుండాలి సుమా ! హాస్పిటల్ కి చెడ్డ పేరు రాకూడదు .స్టోర్ రూమ్ లాక్ చెయ్యకుండా  వదిలేశావేం ? అప్రమత్తతతో  వుండాలి. చాలా సామాగ్రి పోతోంది ,హాస్పిటల్ నుండి."

    "అలాగేనండీ !" నళిని  వినయంగా  సమాధాన మిచ్చింది.

    తర్వాత  వాళ్ళు  వెళ్ళిపోతూన్న  సవ్వడి  వినిపించింది. నా గుండె గబగబ కొట్టుకుంటోంది. మేట్రన్, తదితరులూ  వెళ్ళిపోయారని  దృడపర్చుకున్నాక  ఓ నిట్టూర్పు  విడిచాను. ఎంత గండం తప్పింది ! నా అదృష్టం బాగుండి, వాళ్ళి గది తలుపులు  తెరవలేదు గాని ,లేకపోతే  ఎంత రసాభాస అయేది ! నా పని ఎంత  నగుబాటు కావల్సివచ్చేది ! హాస్పిటలంతా  ఎంత  చిలవల పలవలుగా  చెప్పుకునేవారు !

    నళిని  తలుపు  తీసింది. దీపం వెలుగు  గదిలో  పడింది. నా చెయ్యి పట్టుకుని  యివతలకు  లాగి ఆమె అంది. "ఇప్పుడు మీరు తల వాచేటట్లు  చీవాట్లు  పెడతారని  తెలుసు. చేసిన తప్పిదానికి  చెంపలు  వేసుకుంటున్నాను. క్షమించండి" అంటూ నా చెయ్యి  వదిలిపెట్టి  రెండు చెంపలూ  గట్టిగా  వాయించుకుంది.

    ఎంతో ఉద్రిక్తతతో  ఆమెను  కడిగి పారెయ్యాలనుకుంటూన్న  నా నోటికి తాళం  వేసినట్లయింది.

    "చాలా  గొప్పదానివేలే. ఇంకెప్పుడూ  నీ దగ్గరకు  రాను" అన్నాను ఉక్రోషంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS