Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 2

    క్యాంటీన్ ఓనర్ ఫోనెత్తి...వెంటనే అవని వైపు చూసి  "అవనీ  మేడమ్! ఫోన్ మీకే"  అన్నాడు.
    అవనీ   తనకీ  టైంలో ఫోన్ ఎవరు చేస్తారా?  అని ఆలోచిస్తూనే వెళ్ళి రిసీవర్ తీసుకుని "హలో"  అంది.
    తెరలు తెరలుగా నవ్వు...
    "నిన్ను హ..త్య..  చే..య..బో..తు..న్నాం..  అ..వ..నీ..."   అని  వినిపించింది అటువైపు నుంచి.
    అవని చేతిలోని రిసీవర్ కిందికి జారిపడిపోయింది.
    "ఏయ్ అవనీ..ఏమైంది...వాట్ హ్యాపెండ్?"  అడిగింది వసుధ.
    అవని  ఫోన్ ఎత్తడం, వెంటనే రిసీవర్ కిందికి జారవిడవడం గమనించి వసుధ కంగారుపడి అడిగింది అవనిని.
    ఒక్కక్షణం  ఏమీ  మాట్లాడలేకపోయింది  అవని.
    వసుధకు అనుమానం వచ్చి జారిపడిన రిసీవర్ ని   ఎత్తి "హలో"  అంది.
    అవని భయంగా చూస్తోంది.
    అటువైపు నుంచి ఎవరో మాట్లాడుతున్నారు.  వసుధ మౌత్ పీస్ కు  చేయి అడ్డం పెట్టి "ఏయ్.. అవనీ ఫోన్ నీకేనే ఎవరో మీ ఓల్డ్ ఫ్రెండట.." అంది.
    అవని అపనమ్మకంగా చూసింది.
    రిసీవర్ అవనికి ఇచ్చింది వసుధ.
    "నీకు ఫోన్ చేస్తే రిసీవర్  మరొకరికి ఇస్తావేం?  అంత తొందరగా హత్య చేయించుకోవాలని వుందా? "   అటువైపు గొంతులో నుంచి కర్కశమైన మాటలు వినిపించాయి. గొంతులో జీర...
    చెమట్లు పట్టాయి అవనికి.  వెంటనే ఫోన్ పెట్టేసింది.
    .....
    "ఏంటే..ఏమిటా కంగారు?  ఫోన్ లో  మాట్లాడింది ఎవరు?"  అంది వసుధ.
    "ఫ్రె..ఫ్రెండ్"  అంది.   ఫోన్ లో జరిగిన సంభాషణ చెప్పినా వసుధ నమ్మదు. పైగా  దాన్నో ఇష్యూ చేస్తుంది.
    .....
    "ఏయ్ అవనీ.. నిన్నే"  భుజాలు కుదిపి మరి అడిగేసరికి ఆలోచనలో మునిగిపోయిన అవని తేరుకుంది.
    సాయంత్రం నాలుగయింది.  మధ్యాహ్నం లంచ్ టైంలో క్యాంటీన్ కు  తనని బెదిరిస్తూ వచ్చిన ఫోన్ కాల్  గురించే ఆలోచిస్తూ వుంది.
    తలంతా దిమ్ముగా అనిపించింది.  అసలు నమ్మశక్యం కాకుండా వుంది.  సినిమాల్లో జరిగే సంఘటనలా  అనిపిపిస్తోంది.  నవలల్లో చదివింది కానీ, ఇప్పుడు...
    "ఏయ్ అవనీ...ఇవ్వాళా నీకేమైందసలు ..." వసుధ రెట్టించి అడిగింది.
    "ఏ..ఏమీ లేదు"అంది అవని.
    "అద్సరేగానీ,  నాకో చిన్న హెల్ప్ చేయాలి.  చేస్తావా?"  అడిగింది వసుధ.  అవని పక్కనే సెటిలవుతూ.
    ఏంటన్నట్లు చూసింది అవని.
    "అదిగో అలా చూడద్దు.  మరేం లేదు.  ఇవ్వాళ ఈవినింగ్ ధీరజ్ తో సినిమా ప్రోగ్రామ్ వుంది.  బాస్ ఎలాగూ మధ్యాహ్నమే వెళ్ళిపోతాడని తెలిసే ఫిక్స్ చేసి ఇందాకే చెప్పాను.  అర్జంటుగా ప్యాక్ చేయించాల్సిన ఆర్టికల్స్ కొన్ని వున్నాయి.  ప్లీజ్..నువ్వు కాస్త ఓసారి..."
    "నేనా ప్యాకింగ్ సేక్షనుకు వెళ్ళను"  అంది వెంటనే అవని.
    "అదేంటే..పుసుక్కున అంత మాటనేసావ్?   నువ్వా పన్జేయకపోతే ధీరజ్ నామీద అలుగుతాడు.  ప్లీజ్...ఈ ఒక్కసారికి"  అంది వసుధ అవని గడ్డం పట్టుకుని.
    "అలాగే"  అంది అయిష్టంగానే అవని.
    "హమ్మయ్య...థాంక్ గాడ్...నాలుగున్నారకు వెళ్తే చాలు...థాంక్యూ థాంక్యూ వన్స్ ఎగైన్ అవని" అంది.
                              *        *         *
    తనకు ఫోను వచ్చిన విషయాన్ని తాత్కాలికంగా మరిచిపోయింది.  టైం చూసుకుంది అవని.  నాలుగున్నర. ఆఫీసు వెనకే ప్యాకింగ్ సెక్షన్ వుంది.
    అటువైపు  వెళ్తుంటే ఆమె మనసులో ఏదో తెలియని భయం.
    క్రితం వారం జరిగిన సంఘటన గుర్తొచ్చింది.  ఆ రోజు కూడా ఇలాగే వసుధ ప్యాకింగ్ సెక్షను కు వెళ్ళమని బ్రతిమలాడింది.
    తను ప్యాకింగ్ సెక్షన్ ని సూపర్ వైజ్ చేస్తుంటే...
    వర్కర్స్ ప్యాకింగ్ సెక్షనులో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.  అవని వాళ్ళు ప్యాక్ చేస్తుంటే చూస్తోంది.  వాళ్ళు సరిగ్గా ప్యాక్ చేస్తున్నారో,  లేదో...ఎన్ని లోడ్లు తిసుకెళ్తున్నారు?  లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి.  విశాలమైన  ఆ ప్యాకేజి సెక్షన్ ను మొత్తం పరిశీలిస్తూ  వుండిపోయింది అవని.
    పెద్ద పెద్ద  అట్ట పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు.  ప్యాక్ చేసినవాటిని సీల్ చేసి,  స్టాంప్ వేసి, ఆర్డర్ లో పెట్టి రిజిష్టర్ లో ఎంటర్ చేస్తున్నారు.  వాటిని పర్యవేక్షించే వసుధ స్ధానంలో అవని ఆ పని చేస్తున్నది.
    మొత్తం ఆ సెక్షన్ లో కలియ తిరుగుతుంటే ఓ వైపు నుంచి మాటలు వినిపించాయి.
    బొంగురు గొంతుతో ఓ వ్యక్తి మాట్లాడుతున్నాడు.
    "ఆ అట్ట పెట్టెల మధ్య మనం తీసుకొచ్చిన అట్ట పెట్టెలు కొన్ని పెట్టండి."
    "ఎవరికైనా అనుమానం వస్తే?"
    "లేపెయ్యండి ...మన  దారికి అడ్డు వచ్చినవాళ్ళని  వదలొద్దు...ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్..."
    క్షణంలో  మొహమంత చెమట్లు పట్టాయి అవనికి.
    వాళ్ళ మొహాలను చూడాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంది. వాళ్ళెవరు?  ఈ అట్టపెట్టెల మధ్య ఏం పెడతారు?  ఈ విషయం రేపు బాస్ కు చెబితే...నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని  అడుగుతాడు.  వసుధను సస్పెండ్  చేసినా చేయగలడు...అసలే ఇలాంటివి గిట్టవు ఆయనకు.
    పోనీ రేపు వసుధకు చెబితే...అమ్మో నానా యాగీ చేసి..హంగామా సృష్టించి,  లేని పోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది.
    ఏం చేయాలో తోచలేదు.
    ఇంతలో ఎవరివో అడుగుల శబ్దం వినిపించేసరికి తప్పుకుంది అక్కడ్నుంచి అవని.
    ప్యాకింగ్ పని పూర్తయ్యింది.
    అట్టపెట్టెల మిద సీళ్ళు వేయడం కూడా అయిపోయింది.  లారీల్లోకి ఎక్కిస్తున్నారు వర్కర్స్.
    ఎవరి పని వాళ్ళు కామ్ గా  చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందాక బొంగురు గోంతుతో మాట్లాడింది ఎవరు?  తమ వర్కర్స్ లో  ఎవరైనా స్మగ్లర్స్ తో చేతులు కలిపారా?
    వాళ్ళని గుర్తించడం ఎలా?  రకరకాల ఆలోచనలతో వుండిపోయింది.  ఆలోచనలతో పాటు భయమూ కలిగింది.
    ఇవన్నీ ఆలోచిస్తూ బుర్ర బద్దలు చేసుకోవడం కన్నా, మరోసారి ఇటువైపు రాకుండా వుంటే సరి అనుకుంది.
    అందుకే ప్యాకింగ్ సెక్షన్ కు   వెళ్ళనని వసుధ తో చెప్పింది.  అవనికి రిస్క్ ళు అంటే భయం.  ప్రశాంత జీవితాన్ని గడపాలనుకునే మనస్తత్వం.
    తను,  తన భర్త, తన పిల్లలు...అంతకన్నా టెన్షన్లు,  లగ్జరీస్ అవేవి అక్కర్లేదు అనుకుంది.

            *           *           *
    ప్యాకింగ్ సెక్షన్ లో ప్యాకింగ్ జరుగుతుంది.  ఎప్పడూ ఏవో ఒకటి ప్యాక్ అవుతూ వుంటాయి.
    "అదేంటి మేడమ్...వసుధమ్మగారు రాలేదా?"  అడిగాడు ప్యాకింగ్ సెక్షన్ హెడ్.
    అతనికి  తెలుసు.  అప్పడప్పడు వసుధ తన బదులు అవనిని పంపిస్తుందని.
    నవ్వి  వూర్కుంది అవని.
    సరుకుల లిస్ట్,  దాని డిటెయిల్స్,   వున్న పేపర్లు తెచ్చి ఇచ్చాడు.
    అవని సెక్షన్ మొత్తం తిరుగుతూ ప్యాకింగ్ పనులను పర్యవేక్షిస్తుంది.
    అట్ట పెట్టెలు,  చెక్క పెట్టెలు ఆ సెక్షన్ నిండా వున్నాయి.  నిలువెత్తు  పెట్టెలు.
    వారం రోజుల క్రిందట సంఘటన గుర్తొచ్చి ఒక్కక్షణం భయపడిపోయింది.  ఆ వెంటనే సర్దుకుంది.
    సెవెన్ కల్లా మొత్తం ప్యాకింగ్ పనులు పూర్తయ్యాయి.  హమ్మయ్య అని  నిట్టూర్చింది.
    లారీల్లోకి లోడు ఎక్కిస్తున్నారు.
    చలికాలం కావడం వల్ల ఏడుగంటలకే చాలా చీకటిగా వుంది.
    "రైట్ రైట్ పోనీ"  ఓ వర్కర్ అన్నాడు.  లారి కదులుతుండగా...
    మాటలు వినిపించాయి లారీలో నుంచే.
    "సరుకులు అన్నీ సరిగ్గా ప్యాక్ చేసినట్టేనా?"  ఆ గొంతు విని ఉలిక్కిపడింది అవని.
    ఆ గొంతు...ఆ గొంతు ఎక్కడో వింది.  అవును...సరిగ్గా వారం రోజుల క్రితం విన్న గొంతు.
    అతనెవరో చూడాలని లారీ ముందుకు  వెళ్లింది.  ఈలోగా లారీ ముందుకు కదిలింది.
    "షిట్...ఒక్క క్షణంలో మిస్సయ్యాను"  అనుకుంది అవని.
                      *          *         *
    అవని   ఇంటికొచ్చేసరికి   ఇంటిల్లిపాదీ ఆదుర్దాగా ఎదురు చూస్తూన్నారు. ఎప్పడూ ఆరు ఆరున్నరకల్లా వచ్చే అవని ఏడున్నర దాటినా రాకపోయేసరికి కంగారుపడ్డారు.  ఆఫీసుకు ఫోన్ చేస్తే ఎవరూ లిప్ట్ చేయలేదు.
    "అదేమిటమ్మా... ఇంత ఆలస్యమైందేంటి?"  తండ్రి ఆదుర్దాగా అడిగాడు.
    "చిన్న పని పడింది నాన్నా... ఫోన్ చేసి చేబుదామనుకుని మరిచిపోయాను"  అంది నొచ్చుకుంటూ.
    తను రాకపోయేసరికి వాళ్ళెంత కంగారు పడివుంటారో...వూహించుకుంది.
    "ముందు వెళ్ళి మొహం కడుక్కో..వేడి వేడిగా కాఫి తాగు అలసట పోతుంది" అన్నాడు తండ్రి
    అది నిజమేననిపించింది.  బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది.
    ఈలోగా వేడి వేడి ఫిల్టర్ కాఫి తెచ్చింది.  పొగలు కక్కుతోన్న కాఫీని చూడగానే ప్రాణం లేచివచ్చినట్టయింది.
    "తమ్ముడేడి?" అడిగింది తల్లిని,  కాఫి తాగుతూ.
    "చదువుకోవాలి... నన్ను డిస్ట్రబ్  చేయకండి...అని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.  సాయంత్రం అయిందింటికి వెళ్ళాడు.  ఇంతవరకు  తలుపు తీయలేదు" చెప్పింది తల్లి.
    వాడికి చదువుమీద ఇంత ఇంట్రస్ట్ ఎప్పుడు కలిగిందా?  అని ఆశ్చర్యపోతూ...తన గదివైపు  నడిచింది. ఆ గదిలో తను, తమ్ముడు పడుకుంటారు.
    మెల్లిగా తలుపు దగ్గరకి వెళ్లి తలుపు తట్టింది.
    "నేన్రా...తలుపు తీయ్ "  అంది అవని
    "నువ్వా..ఒక్క నిముషం"  అని తలుపు దగ్గరకి వచ్చి, కీ  హొల్  నుంచి చూస్తూ...
    "నీ వెనక అమ్మగానీ ,  నాన్నగానీ వున్నారా?" అని అడిగాడు.
    "అబ్బబ్బ.. నీకన్నీ  అనుమానాలే...ఎవరూ లేరు" అంది అవని.
    అప్పుడు తలుపు తీశాడు.
    "అవున్రా..లోపల సాయంత్రం నుంచీ ఏం చేస్తున్నావు?" అడిగింది అనుమానంగా.
    బుద్ధిగా చదువుకుంటున్నానని  తమ్ముడు అంటే నమ్మేంత అమాయకురాలు కాధు  అవని.
    "అబ్బబ్బ...అలసట...స్టడీస్..కష్టపడి చదువుకుంటాన్నాను" అన్నాడు బాగా అలిసిపోయినట్టు నటిస్తూ.
    పేరుకు తగ్గట్టు లావుగా బొద్దుగా వుంటాడు డుంబు.  అతని అసలు పేరు రాజు...అయినా 'డుంబు' అనే పిలుస్తారు.
    అవనికి తమ్ముడంటే బోల్డు ఇష్టం.  డుంబుక్కూడా  అక్కంటే ప్రాణం.
    "నీ చదువు సంగతి నాకు తెలియదా? ఏది ఏ బుక్ చదివావో చెప్ప?"  అంది గదిని పరిశీలిస్తూ.
    "ఇంగ్లీష్..కాదు కాదు సోషల్" అన్నాడు కంగారు పడిపోతూ.
    అప్పటికే టేబుల్ దగ్గరకి వెళ్లి టేబుల్ మీద వున్న సోషల్ బుక్ తీసింది.  ఆ పుస్తకం మధ్యలో డిటెక్టివ్ నవల వుంది.  స్మశానంలో శవం'  అన్న డిటెక్టివ్ నవల అది.
    "డూంబూ..నీకెన్నిసార్లు చెప్పాల్రా?  ఇలాంటి డిటెక్టివ్ నవలలు చదవొద్దని" కోపంగా అంది తమ్ముడ్ని మందలిస్తూ అవని.
    ఎలా  అలవాటు అయిందో కానీ,  సంవత్సరం గా  పాత డిటెక్టివ్  నవలలు  లెండింగ్ లైబ్రరీ నుంచి అద్దెకు తెచ్చుకొని మరి చదువుతున్నాడు.
    ఆ విషయాన్ని పసిగట్టి ఎన్నోసార్లు తమ్ముడికి వార్నింగిచ్చింది.  తండ్రి వరకూ తీసుకువెళ్తే బావుండదని వూర్కుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS