Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 4

 

"ఏమిటి అంటున్నావు?" అన్నాడు తను.

"నేనేమీ అనలేదు సార్!"అన్నాడతను.

అంటే అతని అభిప్రాయాన్ని తనలా ఊహించుకున్నాడా?

లేదు...లేదు...అనే ఉంటాడు.

బృంద కి వీరవిధేయుడు.  తనకి మద్ధతు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో. బృంద ప్రతిపక్షం లో ఉంటే ఇంట్లోంచి తనకు ఒక్క ఓటు కూడా పడదు.

ఏముంది ఆమెలో. తన భార్య అని అందరూ ఆమెతో అతి వినయం వొలకబొస్తారు. దానిని తన గొప్పతనం కింద బృంద ఫీల్ అయిపోతోంది.

ఎప్పుడు చూసినా మోచేతుల వరకూ కాటన్ జాకెట్లు, జరీ లేని అంచు చీరలు. సహజంగా అందగత్తె కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమెని తన ఇంట్లో పని మనిషి అనుకుంటారు. అన్నీ ముసలమ్మ వేషాలు. అవే పెద్ద ప్రిన్సిపుల్స్ అనుకుంటుంది.

ఈమె వయసు ఎంత అనుకుంటారో జనాలు. కుతూహలం కలిగింది అతనికి.

ఒకసారి తమ చుట్టాలబ్బాయి, అతని ఫ్రెండ్, తనని కలవడానికి ఇంటికి వచ్చారు.

తనక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. వాళ్ళు తనని చూడలేదు. అటుగా వెళ్తున్న బృంద వాళ్ళని పలకరించింది.

"ఆంటీ, అన్న ఎక్కడ?" అడిగారు వాళ్ళు. తన వైపు చూపించి తప్పుకుంది అక్కడ నుంచి.

తను ఆమె కంటే నాలుగేళ్లు పెద్ద. తను అన్న, ఆమె ఆంటీ. చచ్చేంత నవ్వొచ్చింది సుధీర్ కి. అదే మొదటి సారి బృంద మీద గెలిచిన ఫీలింగ్. 
***
స్టేడియం ని సమీపించారు.

విష్ణు తన సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెక్ చేయటానికి వెళ్లారు. అదంతా ఒక 10 నిమిషాల తతంగం.

బృంద కావాలని కక్ష సాధింపు కోసం అలా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడూ. వచ్చేముందు టాబ్లెట్స్ వేసుకోటానికి తాగిన నీళ్ళ వల్లే బాత్ రూం కి వెళ్లాల్సిన అవస్త కావచ్చు.

నిన్న టీవీలో ప్రతిపక్ష నాయకుడు తనని రాజీనామా చెయ్యమని సవాల్ చేస్తున్నాడు. వాళ్ళు రోజూ ఏదో ఒక కారణం చెప్పి రాజీనామా చెయ్యమనటం, తాము ప్రతిసవాళ్లు విసిరి నిరూపిస్తే ఇరవై నాలుగు గంటల్లో రాజీనామా చేస్తామనటం.  ఇలాంటివి అనటానికి, వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఎన్నిటికో తెగించి, బరి తెగించి రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదించే తాము ఎవరో విసిరే ఛాలెంజ్ లకి రాజీనామాలు చేస్తారా? ప్రాణం పోయినా పదవులు పట్టుకు వేలాడటమే. పిచ్చి జనాలు ఈ గిమ్మిక్లను ఎలా నమ్ముతారో.

బయట ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తోడెళ్లలా. 

ఏదో రోడ్లు విషయంలో స్కాం జరిగిందని తన వెంట పడ్డారు ఉన్నట్లుండి. వీళ్ళు ఏ విషయంలో ఎందుకు రచ్చ చేస్తారో వాళ్ళకే తెలీదు. రోడ్లు ఒక్కటేనా? డ్రైనేజ్ లు, ముఖ్యమంత్రి సహయనిధి నుంచి వెళ్లే నిధులు, భవన నిర్మాణ కాంట్రాక్టులు - కుంభకోణం ఏ విషయంలో జరగటం లేదు? ఇదొక్కటే వీళ్ళకి కొత్తగా తెలిసినట్లు. 

తన మీద ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అప్పుడప్పుడూ. 

***

సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బాత్ రూం కి వెళ్లి వచ్చాడు.

స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్ లు ఇచ్చే ప్రోగ్రాం అది. చిన్న పిల్లలు ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు.  తన సిబ్బంది హడావిడి ఒక వేపు. ముఖ్యమంత్రి గారు త్వరగా వెళ్లాలి కాబట్టి స్కాలర్షిప్ లు ఇచ్చేసి వెళ్ళిపోతారు కానివ్వండి అంటూ.

ఈ ప్రోగ్రాంలో అన్నా ప్రశాంతం గా కూర్చుందామనుకున్నాడు. మధ్యలో వీళ్ల గోలేంటి. 

ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లి తను పీకేదేముంది? చికాకు వేసింది. 

అన్నీ తను కంట్రోల్ చేస్తున్నట్లు ఉంటుంది చూసేవాళ్ళకి. కానీ ఏదీ తన కంట్రోల్ లో ఉండదు. 

తిక్క తిక్కగా ఉంది సుధీర్ కి. బీపీ పెరిగిపోతోంది. ఏదో సంచిలో తన శరీరాన్ని కుక్కేసినట్లు ఊపిరి ఆడట్లేదు. ఈ పరిస్థితులకు, పరిసరాలకు దూరంగా పారిపోవాలనిపిస్తోంది.

 ఒక టీచర్ పేర్లు ప్రకటిస్తుండగా విద్యార్థులకి స్కాలర్షిప్ లు ఇచ్చాడు. అందులో కూడా పార్షియాలిటీలు. స్పష్టంగా తెలిసిపోతుంది. టీచర్ ల పెట్ స్టూడెంట్స్ కి అధిక ప్రాధాన్యత కనపడుతూనే ఉంది. 

ప్రతి ఫీల్డ్ లో ఉన్నదే ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతం - రాజకీయాలకి పడి ఎందుకు 
ఏడుస్తారు...

పిల్లలు తనతో ఫొటోస్ దిగటానికి పోటీలు పడ్డారు.

మళ్లీ కాన్ఫిడెన్స్ పెరిగినట్లు అనిపించింది అతనిలో. 

ఈ గుర్తింపు కోసమే కదా తను ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చింది. దీని కోసమే కదా విలువల్ని తుంగలో తొక్కి, అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక్కడ వరకూ వచ్చాడు. ప్రెస్ ని ఎదుర్కొనే సత్తా తనలో ఉందనిపించింది.

***

స్టేజ్ దిగుతుండగా ప్రెస్ చుట్టుముట్టింది. కింద పడబోయినంత పనయింది. తనని కదలకుండా చుట్టు ముట్టి వాళ్ళ ఇంట్రోడక్షన్ మొదలెట్టారు.

"ఇప్పుడు మీరు ఎవరినైతే చూస్తున్నారో ఆయన మన ముఖ్యమంత్రి. మన సీఎం మొహంలో కనపడుతున్నది ఏమిటి? దిగులా? దిగ్భ్రాంతా? మనం ఇదివరకే ఒక సారి మాట్లాడుకున్నట్లు ఓడలు బళ్ళు అవుతాయి...బళ్ళు ఓడలు అవుతాయి. మరి ఇప్పుడు మన ముఖ్య మంత్రి ఏం కాబోతున్నారు. బడా? వొడా?"
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS