.png)
వారం రోజులయింది.
స్వంత పనిమీద మద్రాసు వెళ్ళి వస్తానని వెళ్ళిన పిళ్ళై ఇంతవరకూ రాలేదు. రోజూ ఒక్కో దేవాలయాన్ని పరీక్షగా చూస్తూ చీకటి పడ్డాక గెస్ట్ హౌస్ చేరుకుంటున్నాడు లిన్ దార్టన్.
తన స్వదేశాన్ని వదిలి చాలా సంవత్సరాలైనట్టని పించిందతనికి. తనకు వూహ వచ్చినప్పటి నుండీ తల్లిదండ్రులను వదిలి దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడు. దేశదేశాల వింతల్ని తిలకిస్తూ వాటిపై పరిశోధనా వ్యాసాల్ని వ్రాస్తున్నాడు. ఎంతో మంది నుండి తనకు ప్రశంసాపత్రాలు వస్తున్నాయి. పత్రికల వారు పంపించే చెక్కులు ఖజురాహో బ్యాంకులో జమ అవుతున్నాయి. డబ్బు చాలకపోతే తండ్రికి టెలిక్స్ మెసేజ్ పంపిస్తున్నాడు.
తండ్రి పక్కా వ్యాపారస్తుడు. ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడు. తల్లి మేరీకి విడాకులు ఇచ్చి చాలా రోజులైంది. తల్లితో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. తండ్రితో వీలకాదు. బిజినెస్ లో ఆయన బిజీగా వుంటాడు. ఎక్కడ తిరుగుతుంటాడో, ఏ టైమ్ లో ఏ మూడ్ లో వుంటాడో అన్ని లిన్ డైరీలో వ్రాసుకుని వుంచాడు.
మంచి మూడ్ లో వున్నప్పుడే తనకు డబ్బు పంపుతాడు. వేరే సమయాల్లో అయితే వీలుకాదని లిన్ కు బాగా తెలుసు. తల్లి మేరీ టీచరుగా లండన్ లో వుంటోంది. చెల్లెలు డయానా కూడా మేరీతో వుంటోంది. కాలేజిలో మెడిసిన్ చేస్తోంది. అప్పుడపుడు అక్కడి పరిస్థితుల గురించి డయానా ఉత్తరాలు రాస్తుంటుంది. ఏమీ తోచనప్పుడు లిన్ ఆ ఉత్తరాలను మంచంమీద పరుచుకుని చదువుకుంటూ ఉంటాడు.
అమెరికా ఆర్కియాలాజికల్ డిపార్ట్ మెంట్ వారు కూడా లిన్ పరిశోధనలకు గాను స్కాలర్ షిప్పు ఇస్తున్నారు. ఆ డిపార్ట్ మెంట్ కు లిన్ ఎప్పటికప్పుడు పరిశోధనా ఫలితాలను పంపిస్తూ ఉండాలి. భారత దేశ చారిత్రిక కట్టడాల గురించి అమెరికా ఆర్కియాలాజికల్ డిపార్ట్ మెంట్ వారు ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండికాలో ఆ విషయాలను ప్రచురించగలిగారు.
ప్రపంచపు ఎన్నో దేశాల గురించి అలా గ్రంధాలు ప్రచురించాలని వారి ఆశయం. దానికి లిన్ దార్టన్ సహకారం అందిస్తున్నాడు. చారిత్రిక పరిశోధకుడిగా లిన్ కు మంచి పేరు రావడంతో పాటు బాగా డబ్బుకూడా వతోంది. ఎన్నో రకాల మనుషులు, మనుగడలు, అలవాట్లు, భాషలు, సాంప్రదాయాలుంటాయి. లిన్ దార్టన్ చాలా కష్టపడి ఎన్నో భాషలు, వ్రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకున్నాడు.
మనుషులతో కలిసి బ్రతకాలంటే భాషల్ని నేర్చుకోవడం తప్పదు. అలాగే తెలుగు, హిందీ ఓ మాదిరిగా బాగానే నేర్చుకున్నాడు. అతడి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఒక్కచోట నిలకడగా వుండే మనిషికాదు. అతను పూర్తిగా నమ్మగలిగే వ్యక్తి ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఎక్కడ ఎన్నిరోజులు గడిపితే అక్కడి వ్యక్తులతో ఆ కొన్ని రోజులు పరిచయాల వరకే పరిమితం!
తనకు తోడుగా ఓ స్త్రీ ఉంటే బాగుంటుందను కుంటాడు. కానీ ప్రత్యేకంగా ఎవరి కోస్సమో తను అన్వేషించలేదు. తన జీవితమే ఓ అర్తకాని అడవి. అందులో ఎవరు కాలు పెట్టినా ఏదో ఒకటి వారికి గుచ్చుకోక తప్పదు. ఆ గాయాల్ని తట్టుకుని తనకు నీడగా వచ్చే వ్యక్తి ఎక్కడో పుట్టే వుంటుందనిపిస్తుందతనికి.
ఆ స్త్రీ కోసం అన్వేషించేందుకు తనకి తీరికా, ఓపికా రెండూ లేవు వచ్చిన వ్యక్తి అనుకూలవతి కాకపొతే ...? లిన్ విచిత్రమైన వ్యక్తి. ప్రేమాభిమానాలు అందరికీ పంచుకుంటూ పొతే బాగుంటుందనుకుంటాడు. గదిలో కూర్చుని తలుపులన్నీ మూసుకుంటే బయటి ప్రపంచపు అందాలు కనుమరుగైపోతాయి. కిటికీలు తెరచి చూట్టమే కాదు, గది నుండి మనిషి బయటకి నడవడం కూడా చాలా అవసరమన్న నిర్ణయానికి వచ్చిన లిన్ ఏ విషయాన్నీ, ఏ సమస్యనూ అంత సీరియస్ గా తీసుకోడు.
అమెరికాలాంటి దేశాల్లో తిరిగేటప్పుడు స్నేహం, ప్రేమ, మమత, మాసిచ్చి పుచ్చుకోవటం లాంటి సెంటిమెంట్స్ కు అర్థం లేదనుకునేవాడు. వ్యక్తిగత స్వేచ్ఛ బోలెడు. అందరూ దగ్గర దగ్గరగా తిరుగుతూ కనిపిస్తారు. కానీ అందరూ ఒంటరి మనుషులే. వాడిగా నడిచిపోతున్న బాటసారికి మారిపోతూ కనిపించే దృశ్యాల్లా అక్కడి నీతి నియమాలు మారుతూ వుంటాయి. కానీ భారతదేశంలో అడుగుపెట్టాక లిన్ లో చాలా మార్పు వచ్చింది.
మానవీయ విలువలు భారతదేశంలో ఇంకా వూపిరి పీల్చుకుంటున్నాయని, అవి లేకుండా జీవితాలు నీరసంగా తయారవుతాయని లిన్ అభిప్రాయం. ఇతరుల జీవితాల బరువుల్ని మోస్తూ మనిషి తన జీవిత బరువును మరచిపోవడానికి ప్రయత్నిస్తూ వుంటాడని లిన్ కు అనుభవం నేర్పింది. లిన్ దార్టన్ సుబ్రహ్మణ్యం కోసం ఎదురుచూస్తున్నాడు.
అదిగో సుబ్రహ్మణ్యం వస్తున్నాడు చేతిలో సంచి, సంచిలో ఏదో తినుబండారమే అయి వుంటుంది. మద్రాసు నుండి వచ్చినప్పుడల్లా తనకు ఏదో ఒక విచిత్రమైన తిండి పదార్ధం తెస్తూ వుంటాడు.
“వణక్కం దొరవాడికి. అంతా సౌఖ్యమే గదా?’’
“ఐయామ్ ఓకే పిళ్ళై! హౌ ఆయ్ యూ?’’ విష్ చేస్తూ అన్నాడు లిన్.
“అంతా నల్లగా వుంది. వారంరోజులు ... నిండా పనులు సర్! నాన్ ఒకడిదా చేసుకోవాలి. మురుగా!’’ అంటూ కుర్చీలో కూలబడ్డాడు.
“ఏమిటా సంచిలో?’’ ఆశగా చూశాడు లిన్.
“మీకుదా తెస్తిని. ఇది తెలుగు స్పెషల్. బహుత్ అచ్చా, కంట్రీమేడ్, ప్రిపెర్డ్ బై షుగర్ కేన్, పేరు అరిసెలు. నిండా ఘీతో తయారు ...’’
“ఈజిట్! లెట్ మీ టెస్ట్ ఫస్ట్’’ అంటూ అరిటాకులో తెచ్చిన అరిసేల్ని ప్రేమగా తింటూ లిన్ “ఇట్స్ ఫెంటాస్టిక్, వండర్ ఫుల్ టెస్ట్. అది సరే నీవు చెప్పిన కథ ఎక్కడ ఆపావో గుర్తుందా?’’
“అంతా గుర్తుంది. ఇప్పుడు తాంత్రికుడి కథదా చెప్పాలి’’
“యస్! అది వినాలని వుంది. నేను అరిసె తింటూ వుంటాను. నీవు కథ ప్రారంభించు’’ లైట్లన్నీ వెలిగిస్తూ అన్నాడు లిన్.
*****
