రాముడి ధర్మం ఎలాంటిది?

రావణుడిని చూసి బాగా ఏడ్చిన మండోదరి ని చూసి రాముడు  "ఆవిడ చాలా ఏడిచింది. ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు కాబట్టి, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి" అన్నాడు.

అప్పుడు విభీషణుడు "రామ! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము" అన్నాడు.

రాముడు విభీషణుడితో "విభీషణ! అవతలివాడు ఏ శరీరముతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరముతోనే వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు చెయ్యను అంటే, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను" అన్నాడు.

ఇక తప్పదని విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు.

అంతా అయిపోయాక రాముడు లక్ష్మణుడితో  "విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది లక్ష్మణా. సముద్రానికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యండి" అన్నాడు.

విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి "ఇవ్వాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకి రాజయ్యాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు, కాబట్టి ఇవ్వాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉందని,  బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు" అన్నాడు.

హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా, సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ ఓ సారి హనుమంతుడి వంక చూసి "హనుమ! నువ్వే కదా" అనింది.

హనుమంతుడు సీతతో "సీతమ్మ! రాముడు సుగ్రీవుడు, విభీషణుడి సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవ్వాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు, అందువల్ల నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు" అన్నాడు.

వెంటనే సీతమ్మ "ఎంత మంచిమాట చెప్పావయ్య హనుమ" అని ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.

"అదేమిటమ్మ ఏమి మాట్లాడావు" అన్నాడు సీతమ్మతో.

"నేను 10 నెలల నుండి ఈ మాట ఎప్పుడు వింటాన అని తపస్సు చేశాను కదా హనుమ. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటరాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా సంతోషపడ్డాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కాని నేను ఆలోచన చేస్తే, నీకు ఏమి ఇవ్వగలను. ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకములని ఇచ్చినా సరిపోదు. ఈరోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమిలేదు హనుమ. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతో కూడిన బుద్ధి ఉంది, వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్య" అని ఎంతో సంతోషంతో చెప్పింది.

                                   ◆నిశ్శబ్ద.
 


More Purana Patralu - Mythological Stories