సంపంగి పువ్వు పూజకు పనికిరాదు ఎందుకు?

దక్షిణ దేశములో గోకర్ణము అనే క్షేత్రమున్నది. దానినే 'భూకైలాసము' అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెడుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. అది విరగపూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నుంచున్నాడు. అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి! "నీవెవరవు?. ఇక్కడ ఏం చేస్తున్నావు?" అన్నాడు. 

దానికి ఆ విప్రుడు "నేనొక బాటసారిని. త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిలుచున్నాను" అన్నాడు. 

నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెడుచుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు దగ్గరకు వెళ్ళి "ఇక్కడ ఏం చేస్తున్నావు" అన్నాడు. 

"ఏమీలేదు" అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు. 

నారదుడు సంపంగి చెట్టుతో "ఓ వృక్ష రాజమా! ఆ బ్రాహ్మణుడెవరు? అతడెక్కడికి వెడుతూన్నడు?' అని అడిగాడు. ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు. అందుచేత సంపంగి చెట్టు 'నాకు తెలియదు' అంది.

నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు ఆర్చించారు? అని అడిగాడు. 

"నారద మహర్షీ! ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు" అని చెప్పాడు.

ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో "దేవదేవా! ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు. అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు" అన్నాడు. 

ఇంతలో ఓ మధ్యవయస్కురాలు ఆలయంలోకి వచ్చి "ప్రభో శంకరా! పాహిమాం! పామిమాం" అన్నది. 

నారదుడు ఆమెతో "నీవెవరు? నీకొచ్చిన ఆపద ఏమిటి?" అన్నాడు. 

అప్పుడు ఆమె "మునీంద్రా! నా భర్తకు ప్రమాదంలో ఒక కాలుపోయి అవటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్ధించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి, ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని, ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక శ్రీ మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను" అన్నది. 

ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో "దేవా… ఇంకా ఉపేక్షిస్తావెందుకు? ఆ దుష్టుని శిక్షించు" అన్నాడు. 

దానికి ఈశ్వరుడు "నారదా! నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు" అన్నాడు.

నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరకు పోయి "ఓ తరురాజమా! నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడెవరు? ఎందుకు నీ పూలు తీసుకువెడుతున్నాడు?" అని అడిగాడు. 

"నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు". 

అప్పుడు నారదుడు "ఓ సంపంగి చెట్టా! నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కాని నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్దం చెప్పావు. అందుచేత నీ పూలు శివపూజకు ఇంక పనికిరావు" అని శాపం పెట్టాడు. 

అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి "ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు. నిన్ను క్షమించరాదు. నువ్వు రాక్షసుడిగా జన్మించు" అన్నాడు.

 ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళవేళ్ళా పడి బ్రతిమిలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి "నువ్వు "విరాధుడు" అనే రాక్షసుడుగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది" అన్నాడు. ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికిరాకుండా పోయింది. ఇదీ సంపంగి పువ్వు వృత్తాంతం.

                                 ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories