సూర్యుడు ఉదయించని కథ!! మీకు తెలుసా??

పిల్లలకు కథలంటే ఇష్టం. ఇప్పుడు కాదు కాని ఒకప్పటి చందమామ, పంచతంత్ర కథలు. రామాయణ, మహాభారత గాధలను కథలుగా చెబుతూ ఉంటే ఎంతో పరమానందంగా వింటారు. జరిగిన సంఘటనలను కథలుగా చెప్పడం వెనుక విషయం తెలియడమే కాకుండా ఆసక్తి పెరిగి వినే సామర్థ్యము పెరుగుతుంది కూడా. సూర్యుడు ఉదయించని కథ కూడా అలా విషయాన్ని తెలియజేస్తూ ఎంతో ఆసక్తిని పెంచేదే!!


ఈ సృష్టి ఇప్పటిది కాదు. దీనికి మొదలు మనం చెప్పలేం. కానీ అప్పటి నుండి ఇప్పటికి వరకు చీకటి వెలుగుల ప్రయాణం జరుగుతూనే ఉంది. పగలు రాత్రి ఏర్పడుతూనే ఉన్నాయి. తద్వారా రోజులు ముందుకు వెళుతున్నాయి. అయితే సూర్యుడు ఉదయించని కథ ఒకటి ఉంది. కథ అంటే కట్టుకథ కాదు సుమా!! నిజంగా జరిగిన కథ. 

అసలు కథ ఇదీ!!

సప్త ఋషులలో అత్రి మహాముని ఒకరు. ఈయన ఏడుగురు ఋషులలో చివరి వాడు. ఈయన భార్య అనసూయ మహాపతివ్రత.  అత్రి మహర్షికి ఉగ్రశ్రవుడు అనే కొడుకు ఉండేవాడు. ఉగ్రశ్రవుడి భార్య పేరు శీలవతి. ఆమె కూడా గొప్ప ఇల్లాలు. భార్యగా తన ధర్మాన్ని ఎంతో చక్కగా నిర్వర్తించేది.  ఒకసారి ఉగ్రశ్రవుడికి జబ్బు చేసింది. అది ఎంతకూ తగ్గలేదు. ఉగ్రశ్రవుడు భార్య శీలవతిని పిలిచి నన్ను వేశ్య దగ్గరకు తీసుకువెళ్లు అని అడుగుతాడు. శీలవతి ఏమి మాట్లాడకుండా భర్తను తీసుకుని బయలుదేరుతుంది.  అలా వాళ్ళు  వెళ్తుండగా దారి మధ్యలో మాండవ్యుడు అనే ఒక ఋషికి అత్రి మహాముని కొడుకు కోడలు ఆశ్రమం దగ్గర ప్రయాణం చేస్తున్నారని, వాళ్ళు ప్రయాణం చేస్తున్న విషయం ఏమిటా అని తెలుసుకుంటాడు. వేశ్య దగ్గరకు వెళ్తున్నారనే విషయం తెలియగానే  మాండవ్యుడు కోపంతో  రేపు సూర్యుడు ఉదయించేలోపు ఉగ్రశ్రవుడు మరణిస్తాడని శాపం పెడతాడు. అది విన్న ఉగ్రశ్రవుడి భార్య శీలవతి బాధపడిపోతూ, ఆ మహర్షి మాట నిజం కాకూడదు అంటే అసలు సూర్యుడు ఉదయించకూడదు అనుకుని సూర్యుడు ఉదయించకుండా ఉండేలా శాపం పెడుతుంది.


అమె అలా చేయగానే ప్రపంచం అంతా చీకట్లోనే ఉండిపోతుంది. ఎంతటికి వెలుగు అనేది లేకపోయేసరికి అందరూ గందరగోళం అయిపోతారు.  కొందరు దేవతలకు అలా జరగడానికి గల  కారణం తెలియగానే వాళ్ళందరూ అత్రి మహాముని భార్య అయిన అనసూయ దగ్గరకు వెళ్లి "నీ కోడలు పెట్టిన శాపం వెనక్కు తీసుకునేలా చెయ్యి" అని బతిమాలుతారు. అనసూయ నచ్చజెప్పడంతో శీలవతి తన శాపం వెనక్కు తీసుకుంటుంది. అలా సూర్యుడు ఉదయించకుండా ప్రపంచం గందరగోళం కు గురైన తరువాత మళ్ళీ సూర్యుడు ఉదయించి ప్రపంచానికి వెలుగును ఇస్తాడు.


ఇదీ మరి సూర్యుడు ఉదయించని కథ. ప్రతి కథలో నీతి ఉంటుంది. మరి ఇందులో కూడా ఉంది అదేంటో పిల్లలతోనే చెప్పించండి మరి. 

◆ వెంకటేష్ పువ్వాడ 


More Purana Patralu - Mythological Stories