శనీశ్వరుడి ప్రసన్న మంత్రం

 

ఎవరి జీవితంలో అయినా ఏదైనా కష్టం కానీ సమస్య కానీ వస్తే మొదటగా వినిపించే మాట శని తగులుకున్నట్టు ఉంది అని. ఉద్యోగం, పెళ్లి, సంతానం, జీవితంలో స్థిరపడాలని అనుకోవడం, ఆరోగ్య సంబంధ విషయాలు, ఆర్థిక బాధలు, మానసిక బాధలు ఒకటా రెండా వీటికి అంతు లేదనట్టు ఎన్నో సమస్యలు. ఇలాంటివి అందరి జీవితాల్లోనూ ఉంటాయి. కొందరికి గడ్డు కాలం మాములుగా ఉండదు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా బెడిసికొడుతూ ఉంటాయి. పెద్దలు చెబుతూ ఉంటారు ఏలినాటి శని పట్టుకుందని. మరికొందరు అంటారు శని దశ జరుగుతూ ఉందని. గ్రహాలలోనూ, దేవతలలోనూ శనికి ప్రత్యేకమైన స్థానం అంటూ ఉంది.

చాలామంది శని దేవుణ్ణి హింసించే దేవుడిగా చూస్తుంటారు. కానీ అది నిజం కాదని తెలుసుకోరు. జీవితంలో ఎందరో దేవుళ్ళకు ముక్కుతూ ఉంటారు. కొందరి జీవితాల్లో ఆ సమస్యలు తీరిపోగానే దేవుడే సమస్యలను గట్టెక్కించారని భావిస్తూ వుంటారు. అయితే దేవతలందరిలోకి శని దేవుడు చేకూర్చే మేలును మరెవ్వరూ చేకూర్చలేరు అనేది వాస్తవం. ఎలా అంటారేమో!!

ఏలినాటి శని కావచ్చు, శని దశ కావచ్చు అది జరుగుతున్నంత కాలం కష్టాలకు లోనవుతూ జీవితం కాస్త అస్తవ్యస్తంగా అయిపోతూ ఉండటం నిజమే కానీ, ఆ కాలం అంతా మనో నిబ్బరంగా ఉండేలా మనిషిని గట్టిపరచి మరింత దృఢంగా తయారయ్యే శక్తిని ఇచ్చేది శనిదేవుడే.  ఉదాహరణకు నాన్న దగ్గర నేరుగా డబ్బు తీసుకుని కావలసిన వస్తువు కొనుక్కునే వ్యక్తికి ఆ డబ్బు విలువ తొందరగా అర్థం కాదు. ఖర్చు పెట్టి కొన్నా వస్తువు పోయినా పెద్దగా బాధపడకుండా మరొకటి కొనిచ్చుకోవచ్చులే అనే ధీమా ఆ వ్యక్తిలో ఉంటుంది. అదే ఆ వ్యక్తి నేరుగా కష్టపడి డబ్బు సంపాదిస్తే!! ఆ డబ్బుతో తనకు కావలసిన వస్తువు కొనుక్కుంటే వస్తువు విషయంలో జాగ్రత్తగానూ ఉంటాడు, డబ్బు సంపాదించడానికి పడే కష్టం విలువ అర్థం అవుతుంది. సరిగ్గా శనిదేవుడి విషయంలోనూ జరిగేది ఇదే. మనిషికి కష్టం విలువ తెలియజెప్పి, మనిషిని మరింత పరిణితిగా తయారుచేస్తాడు. 

అయితే శనిదేవుడు కూడా కాస్త అనుకూలంగా ఉండాలి అంటే శనివారం రోజు శని శాంతిమంత్రం చెప్పుకోవడం వల్ల ఎంతో గొప్ప ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. 

శక్తివంతమైన శని శాంతిమంత్రం :- 

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్!!

ఎంతో సులువుగా అందరూ చెప్పుకోగలిగే విధంగా ఉన్న పై శని శాంతి మంత్రం ప్రతి శనివారం చెప్పుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా జీవితంలో నెలకొన్న ఒకానొక గందరగోళం తగ్గిపోతుంది. శ్రావణమాసంలో ఆఖరి శనివారం రోజున ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల మరింత మంచి జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు మీ మంచి కోసం కాసింత సమయం కేటాయించుకుంటే కొన్ని సమస్యలు సులువుగా తొలగిపోతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories