పితృపక్షంతో ముడిపడిన కర్ణుడి కథ తెలుసా?


పితృపక్షం భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి మొదలై.. అమావాస్య వరకు ఉంటుంది. ఈ పితృపక్ష కాలంలో మరణించిన పెద్దలకు శ్రాద్దకర్మలు,  పిండప్రదానాలు,  తర్పణాలు చేస్తుంటారు. అయితే ఈ పక్షాలలోనే పితృదేవతలకు ఈ కార్యాలు నిర్వహించడం ఎందుకు?  పైగా ఈ పక్షాల కాలంలో ఎటువంటి శుభకార్యాలు జరగకూడదు అని కూడా నిర్ణయించారు ఎందుకు? దీని వెనుక గల కారణాలు ఏమిటి? అసలు పితృపక్షాలకు, మహాభారతంలో మరణించిన కర్ణుడికి మధ్య సంబంధం ఏమిటి? ఈ కథ ఏమిటి? తెలుసుకుంటే..

మహాభారతంలో కర్ణుడు యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడు.
అక్కడ అతనికి స్వర్ణమయమైన భవనాలు, అపారమైన వైభవం లభించాయి. కానీ భోజనానికి వెళ్తే అతనికి ఆహారం  లభించకుండా బంగారమే వస్తుండేది.. బంగారపు రొట్టెలు, బంగారపు పానీయాలు.. ఇలా అంతా బంగారమే వస్తుండేది.  ఇదంతా చూసి  కర్ణుడు ఆశ్చర్యపడి దేవతలను అడిగాడట.. “నేను జీవితంలో ఎంతో దానం చేశాను. అన్నదానం, జలదానం ఎన్నో చేశాను. బంగారం,  ధనం కూడా ఎంతోమందికి దానం చేశాను.  అయినా నాకు ఆహారం  ఎందుకు రావడం లేదు?” ఎప్పుడూ బంగారమే వస్తోంది ఎందుకు" అని అడిగాడట.

“కర్ణా! నీవు బ్రతికినంతకాలం బంగారం, ఆభరణాలు, ధనం..  వీటినే అధికంగా దానం చేశావు. కానీ పితృదేవతలకు నీ చేత శ్రాద్ధ కర్మలు జరగలేదు. తర్పణం, పిండప్రదానం నువ్వు చేయలేదు. అందుకే నీకు ఆహారం లభించడం లేదు.” అని దేవతలు కర్ణుడికి సమాధానం ఇచ్చారట.

అప్పుడు కర్ణుడు మనసు కలచిపోయి, యమధర్మరాజును వేడుకున్నాడట.. “ ఒకసారి భూమికి వెళ్లి నా పితృదేవతలకు శ్రద్ధ, పిండప్రదానం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి.” అని.

దీంతో యమధర్మరాజు  15 రోజులు భూమికి వెళ్లి రావడానికి అనుమతించాడట.  ఆ సమయంలో కర్ణుడు తన పితృదేవతలకు తర్పణం, పిండప్రదానం చేసి వారికి సంతృప్తి కలిగించాడట. ఈ 15 రోజులు గడిచిన  తరువాత అతను మళ్లీ స్వర్గానికి చేరుకున్నాడట.  అప్పటి నుండి ఆ కాలాన్ని పితృపక్షంగా పరిగణిస్తున్నారని కథనం.

ఎవరు,  ఏ వస్తువులు, ఎంత దానం చేసినా.. పితృదేవతలకు శ్రాద్దకర్మలు,  పిండప్రదానాలు , తర్పణాలు చేయకపోతే వారికి ఎలాంటి పుణ్యం లభించదు. మరీ ముఖ్యంగా మరణించిన తరువాత వారు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇది పురాణాలలో ఉండే మహాభారత సంబంధ కథ.

                                   *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories