పరివర్తిని ఏకాదశి.. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే..!

హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనది. ప్రతి వ్యక్తి ఏ వ్రతం చేసినా చేయకపోయినా ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలని చెబుతారు. ఏకాదశి రోజు విష్ణువు ఆరాధన చేస్తారు. ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు, భగవంతుని అనుగ్రహం పొందుతాడని నమ్ముతారు. కొంతమంది ఏకాదశి రోజున నిర్జల ఉపవాసం కూడా చేస్తారు. ఇది చాలా కష్టతరమైనప్పటికీ చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో ప్రతికూలత తొలగిపోతుంది. ఆధ్యాత్మిక పురోగతి కూడా లభిస్తుంది. అసలు పరివర్తిని ఏకాదశి ప్రత్యేకత ఏమిటి? దీని వెనుక కథ తెలుసుకుంటే..
పరివర్తిని ఏకాదశి..
పరివర్తిని ఏకాదశి విష్ణువు వామన అవతారంతో ముడిపడి ఉంది. త్రేతాయుగంలో అసురరాజై బలి యజ్ఞం చేయడం ద్వారా స్వర్గాన్ని పొందేందుకు ప్రయత్నించాడు. దానిని ఆపడానికి విష్ణువు వామన రూపం తీసుకున్నాడు. వామనుడు మూడు అడుగుల భూమిని అడిగాడు. మొత్తం విశ్వాన్ని రెండు అడుగుల్లో కొలిచాడు. మూడవ అడుగు కోసం బలి తన తలను అర్పించాడు. సంతోషించిన విష్ణుభగవానుడు అతన్ని పాతాళ లోకానికి రాజుగా చేసి, అక్కడ తనతో పాటు నివసిస్తానని వాగ్దానం చేశాడు.
ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో పక్షం తిరుగుతాడు. అందుకే దీనిని "పరివర్తిని ఏకాదశి" అని పిలుస్తారు. కొందరు ఉపవాసం ఉంటారు, మరికొందరు జాగరణ కూడా చేస్తారు, హరినామం జపిస్తారు, దానధర్మాలు చేస్తారు. ఈ ఉపవాసం పాపాలను నాశనం చేస్తుందని, ఆత్మను శుద్ధి చేస్తుందని, విష్ణువు ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని, మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు.
ఉపవాసం, పూజ..
పరివర్తిని ఏకాదశికి కూడా అన్ని ఏకాదశుల లాగే ఉపవాసం ఉండటం, పూజ చేయడం చేయాలి. దైవనామ స్మరణ, గొడవలకు దూరంగా ఉండటం, ఎవరినీ దూషణ చేయకపోవడం, అబద్దాలు ఆడకుండా ఉండటం, దానధర్మాలు చేయడం వంటివి చేయాలి. ముఖ్యంగా విష్ణుభగవానుని ఆరాధన, దేవాలయ సందర్శన, తులసి ఆరాధాన చాలా ముఖ్యం.
*రూపశ్రీ.



