శ్రీవల్లి కుమారస్వామిల వివాహం ఎలా జరిగిందో తెలుసా?

పురాణాలలో కుమారస్వామి, శ్రీవల్లిల వివాహం ఎంతో విచిత్రమైనది. దీని వృత్తాంతం తప్పకుండా తెలుసుకోవాలి. 

కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి, సత్కరించాడు. కుశలప్రశ్నలు అయిన తరువాత "స్వామీ, ముల్లోకాలలోని జనులు సుఖంగా ఉన్నారా?? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించటం లేదు కదా? త్రిలోకసంచారులు. తమకు తెలియని విషయాలుండవు. దయచేసి శెలవియ్యండి" అన్నాడు. 

దానికి నారదుడు "కుమారా! నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడ ఉంటారు? లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా ఒక్క విషయము. ఇక్కడికి కొంతదూరాన పుళింద దేశమున్నది. దాన్ని భిల్లరాజు పుళిందుడు పరిపాలిస్తున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు. ధర్మపరుడు. అతడికి బిడ్డలు లేరు. ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది.

ఆ నదీ తీరంలో 'శివుడు' అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజున ఆయన ధ్యానంలోంచి కనులు తెరిచేసరికి రెండు జింకలు గాడానురాగముతో మైధునక్రియలో ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చలించి రేఃపతనమయింది. అతని వీర్యము గడ్డిమీద పడింది. ఆ గడ్డిని ఆడజింక తిన్నది. ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బిల్ల రాజ దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. 

శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పుళిందుడు. ఆ బాలికకు 'శ్రీవల్లి' అని నామకరణం చేశాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమె నీకు తగిన జోడు" అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమయింది. శ్రీవల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు? ఆమెను చూడాలి. ఆమెను వివాహమాడటానికి తల్లితండ్రులు, దేవసేన ఒప్పుకుంటారా? అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. 

నారదుడు పుళింద దేశం చేరాడు. పుళిందుడు మహర్షికి స్వాగతం పలికి, తన కుమార్తెను చూపి, తగిన వరుని చెప్పమన్నాడు. నారదుడు కొంచెము ఆలోచించి "బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామి అని చెప్పాడు" అని వివరించాడు.

ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా 'దేవసేనాని తనను వివాహమాడతాడా? ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోటానికి ఒప్పుకుంటారా? ఇలాంటి ఆలోచనలతో కాలం గడుపుతోంది.

ఒకరోజు అనుకోకుండా క్రొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి. అది పుళిందపురము ఉద్యానవనము. ఆ సమయంలో రాజకుమారి చెలులతో కలిసి వనవిహారం చేస్తున్నది. ఆ ముగ్ధమోహనాకారాన్ని చూశాడు కుమారస్వామి. ఇక భరించలేక పోయాడు. తనను తాను పరిచయం చేసుకుని వల్లిని వివాహమాడతానని చెప్పాడు. చెలికత్తెలు ఈ విషయం రాజు పుళిందుడికి నివేదించారు. పుళిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తోడ్కొనిపోయారు. పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం వెళ్ళింది. వల్లీ పరిణయం నిశ్చయమైంది.

పుళింద దేశమంతా కోలాహలంగా ఉంది. నగరాన్నంతటినీ అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగవల్లులు దిద్దారు. మంగళతోరణాలు కట్టారు. నగరం అంతా సందడే. ముక్కోటి దేవతలు వచ్చారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గజాలన్నీ విచ్చేసినాయి. కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పుళిందుడు. నవదంపతులను దేవతలు దీవించారు. గంధర్వులు పాడారు. అప్సరసలు ఆడారు. శ్రీవల్లీ కుమారస్వామిల వివాహం లోకకళ్యాణమయింది" 

                                       ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories