వైవస్వత మనువు వంశ చరిత్ర!

వైవస్వతమనువు ఎవరు? అతని వృత్తాంతమేది తెలుసా?? సూర్యభగవానుడి భార్య సంజ్ఞాదేవి. వారి కుమారుడు 'వైవస్వత మనువు'. మొత్తం మనువులు 14 మంది వారిలో ఏడవవాడు వైవస్వత మనువు. మొదటి ఆరుగురు మనువుల పాలనాకాలము ముగిసిపోయిన తరువాత వారంతా దేవతలలో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు వైవస్వతుని రాజ్యము పాలించమని దీవించారు..

కలియుగములోని ప్రధమ పాదములో దేశాన్ని పాలించేవాడు వైవస్వత మనువు...

మన దేశాన్ని పాలించిన వారిలో శ్రేష్టమైనవి రెండు వంశాలు. 1) సూర్య వంశం, 2) చంద్ర వంశము, బ్రహ్మ మానసపుత్రుడు మరీచి, ఇతని కుమారుడు కశ్యపుడు. ఇతడికి 'వివస్వంతుడు' అని కూడా పేరు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి కుమారుడు వైవస్వతుడు. ఈ రకంగా సూర్యవంశము వృద్ధి పొందింది. వైవస్వతుని కుమారుడే ఇక్షాకువు. ఈ వంశంలో పురు చక్రవర్తి, మాంధాత, వగరుడు, దిలీపుడు, భగీరధుడు, అజమహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు మొదలైనవారు ప్రసిద్దులు. ఈ వంశంలో అతి ముఖ్యమైనవాడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము ఆఖరి భాగంలో రావణ సంహారం చేశాడు. ఆయన కుమారులే లవకుశులు.

వైవస్వతమనువు కుమార్తె ఇళ. ఈమెకు చంద్రుని కుమారుడైన బుధుడికి వివాహం జరిగింది. వీరి కుమారుడు పురూరవుడు. ఈ రకంగా చంద్ర వంశము అభివృద్ధి చెందింది. ఈ వంశంలో దుష్యంతుని కుమారుడు భరతుడు, ప్రదీపుడు ఉదయించారు. ప్రదీపుని కుమారుడే శంతనుడు. ఇతని కుమారుడు గాంధేయుడు. శంతనునికి మత్స్యగంధి యందు పుట్టిన వారే విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. వీరికి అంబిక, అంబాలికలతో వివాహమయ్యింది. కాని వారికి సంతానము కలగలేదు. తల్లి ఆనతి ప్రకారము వ్యాసుడికి అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు, ఇంటి దాసి యందు విదురుడు జన్మించారు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండురాజు కుమారుడు పాండవులు. 

అర్జునుడికి సుభద్ర తో పుట్టినవాడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. ఇతని కుమారుడు జనమేజయుడు, సర్పయాగం చేసిన మహారాజు, మహాభారతాన్ని వైశంపాయనుడి ద్వారా విన్న మహానుభావుడు ఇతడే..

మహాభారతంలో పాటుగా అష్టాదశ పురాణాలు వ్రాసినవాడు వ్యాసుడు. వశిష్ట మహర్షి కుమారుడు శక్తి, అతని కుమారుడు పరాశరుడు.  పరాశరుడు దేశాటన చేస్తూ, మార్గమధ్యంలో దాశరాజు కుమార్తె మత్స్యగంధినిని చూసి మోహించాడు. ఆమెకు అనేక వరాలిచ్చి, పగటిని రాత్రిగా మార్చి తన కోరిక తీర్చుకున్నాడు. వారి కుమారుడే వ్యాసుడు. మహాభారతం వ్రాయటమే కాకుండా, అందులోని కథతో ప్రత్యక్ష సంబంధం కలిగినవాడు. వ్యాసుని కుమారుడు శుకుడు, ఈ రకంగా వైవస్వత మనువు యొక్క సంతానమే సూర్యచంద్ర వంశాలుగా ప్రసిద్ధి చెందినాయి. 

                                     ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories