గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తాడని తెలుసు కానీ.. అది బృందావనానికి ఎలా చేరిందంటే..


భాగవతంలో శ్రీకృష్ణుడు ఎన్నో లీలలతో అలరిస్తాడు. అలాంటి మధుర ఘట్టాలలో గోవర్ధనపర్వతాన్ని ఎత్తడం కూడా ఒకటి. గోవర్ధన్ పర్వతాన్ని కృష్ణుడు ఎత్తడం గురించి అందరికీ తెలుసు కానీ.. గోవర్ధన పర్వతం గురించి ఎవరికీ అంతగా తెలియదు.  గోవర్ధనగిరి ద్రోణాచలానికి పుత్రుడని చెపుతారు. ఆ రెండూ శాల్మనీ ద్వీపంలో ఉండేవి. పరమ పవిత్రమైనవి.

పూర్వం వారణాసిలో పులస్త్యుడనే మహర్షి వుండేవాడు. ఒకసారి ఆ మహర్షి తీర్థయాత్రలకని బయలుదేరి అనేక పుణ్యస్థలాలను సందర్శించాడు. ఆయన ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రజలు ఆయనకు గోవర్ధనగిరి మాహాత్మ్యాన్ని గురిచి చెబుతుండేవారు. దాంతో ఆయనకు ఆ కొండను చూడాలన్న కోరిక కలిగింది. వెంటనే అక్కడికి ప్రయాణమయ్యాడు. ఎత్తైన ఆ కొండను చూడగానే పులస్త్యునికి అమితానందం కలిగింది. ఆ గోవర్ధనగిరి శాల్మనీ ద్వీపంలో వుండడం కన్నా వారణాసిలో విశ్వేశ్వర సన్నిధానంలో వుండటం ఉచితంగా వుంటుందనుకుని ఆయన అనుకున్నాడు. అందుకని తనతోపాటు వారణాసికి రావలసిందిగా గోవర్ధనగిరిని ప్రార్థించాడు. గోవర్ధన గిరీంద్రుడు కూడా అందుకు అంగీకరించాడు. కాని ఆయనకు అక్కడ నుంచి ఎలా కదలి వెళ్ళాలో, ఎటుగా వెళ్ళాలో తోచలేదు. అది గ్రహించిన పులస్త్యుడు 'నువ్వు నా అరచేతిలో కూర్చుంటే నేను నిన్ను భద్రంగా వారణాసి చేరుస్తాను' అన్నాడు.

గోవర్ధనుడు సరేనన్నాడు. పులస్త్యుడి అరచేతిలో ఎక్కి కూర్చున్నాడు. తనను తీసుకుని బయలుదేరబోతున్న తాపసితో గోవర్ధనుడు 'మహర్షి' నన్ను మార్గమధ్యంలో ఎక్కడబడితే అక్కడ దించుతానంటే కుదరదు. ఎక్కడ దించితే అక్కడే కదలకుండా వుండిపోతాను. ఆపై మీ ఇష్టం' అని హెచ్చరించాడు.

పులస్త్యుడు సరేనని నవ్వుకుంటూ బయలుదేరాడు. గోకులందాకా బాగానే సాగింది నడక. అక్కడికి చేరాక మౌనికి కొద్దిగా అలసటగా అనిపించింది. నడచి నడచి డస్సి వున్నాడు కదా! కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. గిరీంద్రుడు పెట్టిన షరతు మరచిపోయాడు. ఆయనను అక్కడ దించి యమునా నదిలో స్నానం చేసేందుకు వెళ్ళాడు. స్నానం చేసి బడలిక తీర్చుకున్నాక 'ఇక బయలుదేరుదాం పద' అన్నాడు గోవర్ధనుడితో.

గోవర్ధనుడు మందహాసం చేశాడు. 'మహర్షీ! మీకు ముందే చెప్పాను. మార్గమధ్యంలో నన్నెక్కడ దింపితే అక్కడ వుండిపోతానని. నా నియమాన్ని మీరు విస్మరించారు. నేను మాత్రం ఇక్కడ నుంచి కదిలేది లేదు' అన్నాడు.

గోవర్ధనగిరీంద్రుడి విశ్వేశ్వర సన్నిధానంలో వుంచాలన్న తన కోరిక నెరవేరనందుకు పులస్త్యునికి బాధ కలిగింది. చేసేదిలేక కొండను అక్కడే వదిలి తను కాశీకి వెళ్ళాడు. ఆ గోవర్ధనగిరినే శ్రీకృష్ణుడు చిటికెన వేలిమీద ఎత్తి ఏడురోజుల పాటు నిలిపింది! అలా గోవర్ధనగిరి గోకులం చేరింది.


                                 ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories