యజ్ఞవల్క్యుడినే ప్రశ్నించిన ప్రతిభాశాలి గార్గి గురించి ఎంతమందికి తెలుసు!

వేదకాలంలోని గొప్ప పండితురాళ్ళలో ఒకరు  గార్గి. జ్ఞానంలో ఆమె ఎందరో మహర్షు లను అధిగమించి, ముందుకు సాగిపోయింది. ఆమె వాచక్ను మహర్షి కుమార్తె. సాక్షాత్తూ ఋషి పుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసిన వైనం బృహదారణ్యక ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంది.

ఒకసారి జనక మహారాజు శాశ్వత సత్య స్వరూపానికి సంబంధించి అభిప్రాయాలు. ఇచ్చి పుచ్చుకోవడం కోసం పెద్ద పండితుల సభ ఏర్పాటు చేశాడు. యాజ్ఞవల్క్యుడు, ఇంకా అనేక వందల సంఖ్యలో ఇతర ఋషిపుంగవులు దేశం నలుమూలల నుండీ ఆ సభకు హాజరయ్యారు. గార్గి సైతం జనక మహారాజు ఆస్థానానికి విచ్చేసింది.

ఆ సమయంలో జనక మహారాజు మనసులో ఓ ఆలోచన మెదిలింది. అక్కడకు వచ్చిన వారందరిలోకీ ఎవరు అత్యంత విద్యా సంపన్నులో తెలుసుకోవాలనే కోరిక ఉదయించింది. ఆయన ఓ వేయి ఆవులను అక్కడకు తెప్పించి, ప్రతి ఆవుకూ రెండు కొమ్ములకూ బంగారం నిండిన సంచీలు వేలాడదీశాడు. “ఓ మహర్షులారా! మీలో అతి గొప్ప వేద వేదాంగ పారంగతుడు ఎవరో వారు ఈ గోవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చు" అని జనక మహారాజు అందరి ఎదుటా ప్రకటించాడు.

అయితే, అక్కడకు వచ్చిన మహర్షులెవరూ తామే అందరిలోకీ గొప్ప వేద పండితులమని ప్రకటించుకోవడానికి ధైర్యం చేయలేకపోయారు. అందుకని వారంతా పెదవి విప్పకుండా కూర్చుండిపోయారు. అయితే, యాజ్ఞవల్క్యుడు మాత్రం ఆ ఆవులను తమ ఆశ్రమానికి తోలుకుపోవాల్సిందిగా తన శిష్యుడికి ఆజ్ఞ జారీ చేశాడు. కానీ, ఇతర ఋషులు ఆ చర్యను సమ్మతించ లేదు. యాజ్ఞవల్క్యుడి జ్ఞానాన్ని పరీక్షించడం కోసం వారు ఆయనను రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అయితే, యాజ్ఞవల్క్యుడు వారందరి ప్రశ్నలకూ అద్భుతమైన రీతిలో చకచకా జవాబులు చెప్పాడు.

చిట్టచివరకు గార్గి లేచి నిలబడింది. యాజ్ఞవల్క్యుణ్ణి తాను కొన్ని ప్రశ్నలు అడగ దలిచినట్లు ఆమె ప్రకటించింది. వాటికి గనక ఆయన సంతృప్తి కరంగా సమాధానాలు చెప్పినట్లయితే, అందరిలోకీ ఆయనే ఉత్కృష్ట జ్ఞాన సంపన్నుడని ఒప్పుకుంటానని ఆమె ప్రకటించింది. కాగా, ఆమె వరుసగా సంధించిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు సంతృప్తి కరంగా సమాధానాలు ఇచ్చాడు. గార్గి - యాజ్ఞవల్క్యుల మధ్య నడిచిన సంవాదం ఆ కాలంలో మహిళల్లో సైతం ఉన్న లోతైన ఆధ్యాత్మిక అవగాహనకు చక్కటి ఉదాహరణ.

                                     ◆నిశ్శబ్ద.


 


More Purana Patralu - Mythological Stories