కాలం ఆదేశానుసారం నడుచుకుపోవడమే కర్మ సిద్ధాంతం

 

౹౹కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన! 
మాకర్మ ఫలహేతుర్భూ, మాతే సంగోస్త్య కర్మాణి౹౹

మనం కర్మ ఆచరించడం వరకే గానీ ఫలితాన్ని కోరడం, ఆశించడం మరియు శాసించే అధికారం మనకి లేదు. కర్మ ఫలం నీది అవుతుందని భావించకూడదు. కర్మను విడిచిపెట్టే ఆలోచన కలిగిన మనసు నీకు రాకూడదు అని గీతాచార్యుడు అన్నాడు.కర్మ అంటే కర్తవ్యం. కర్తవ్యపరునునికి జయాపజయాల విశ్లేషణ హితాహితాల వివరణ ఉండకూడదు. కర్తవ్య నిర్వాహణ ఒక్కటే అతని గురిగా ఉండాలి.

కర్మసిద్ధాంతం అంటే కర్తవ్య సిద్ధాంతం.

కర్మసిద్ధాంతంతోనే వర్ణాశ్రమ ధర్మం వచ్చింది.

సామాన్యులకు గాని, గృహస్థులకు గాని ప్రతిఫలం లేకుండా  కర్మాచరణ చేయటం కుదరదు. ఎలాగంటే, పాలకోసం పశువుల్ని, పండ్లకోసం చెట్లను పెంచుతాం. అదే పశువులు పాలు ఇవ్వకుంటే పెంచలేడు. చెట్లు పండ్లు ఇవ్వకుంటే వాటి వంకైనా చూసేవాడు కాదు. ప్రతిఫలం ఆశించకుండా కర్మాచరణ చేయటం మహాత్ములకే సాధ్యం కాని మామూలు మనుషులకు అసాధ్యం. ఇది చేస్తే నాకు అది వస్తుంది లేదా ఇంకోటి ప్రాప్తిస్తుంది అనే మాటకి తావుండదు.

కురుపితామహుడైన భీష్ముడు కర్మ సిద్ధాంత పరాయణుడై కురుక్షేత్రానికి వచ్చాడు. తప్పని తెలిసీ దుర్యోధనుని పక్షాన నిలబడ్డాడు. అరవీర భయంకర పరాక్రమంతో పదిరోజులు యుద్ధం స్వచ్ఛంద మరణంతో పరమపదిస్తాడు. ధర్మం ఎదుట నిలబడలేను అని తెలుసు కానీ మహాపండితుడైన భీష్ముడు కౌరవ పక్షాన నిలబడటానికి కారణం కర్మసిద్ధాంతం. 

కర్మసిద్ధాంతం అనుభవంలోకి రావాలంటే వయసుండాలి. జీవితంలో ఒడిదుడుకుల్ని చూడాలి. కష్టనష్టాలలో కాగాలి. ఎత్తుపల్లాలు నడవాలి. 

“ధారణాత్ ధర్మః ఇత్యాహుః ధర్మోధారయతి ప్రజాః”

సంస్కృతంలో “ధృ” ధాతువుకి ధరించుట/ పోషించుట అనే రెండు అర్థాలున్నాయి. మనిషియొక్క సర్వతోముఖాభివృద్ధికీ, మరియు అత్యోన్నతికి ఏది సాధనమో అదియే “ధర్మం”.

“ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా” – త్తెత్తరీయోపనిషత్తు

ధర్మే సర్వం ప్రతిష్ఠితమ్ – నారాయణోపనిషత్తు

కర్మాచారణ చేసేవారికి జయాపజయాల భయం ఉండదు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories