"అవన్నీ నువ్వు చూస్తుండగానే పరిష్కరిస్తాను. ఇకపోతే నువ్వు నాకు చాలా సహకరించావు. మరి నీకూ నేను సహాయం చేయాలి గదా...?"

 

    "అర్జునరావు నాశనమయిపోతే చాలు నాకు" కసిగా అంది మధుమతి.

 

    "శత్రువుని చంపితే నీ పగ చల్లారిపోవచ్చు. కానీ ఆ తరువాత నీకు శిక్షపడితే...?"

 

    సామంత్ లాజిక్ మధుమతిపై బాగా పనిచేసింది.

 

    "శత్రువు శిక్షింపబడాలి. అదే సమయంలో మనం లాభపడాలి. శత్రువు తను దెబ్బతిన్నందుకు ఓ పక్క బాధపడతాడు. తనను దెబ్బ కొట్టిన వ్యక్తి లాభపడినందుకు మరోపక్క అసూయా ద్వేషాలతో కుళ్ళిపోవాలి"

 

    "బాగానే వుంది. కానదెలా సాధ్యం..."

 

    "రఘునాధ్ ని వెతికి పట్టుకోవడం ద్వారా- పీటర్ మన చేతుల్లోంచి జారిపోకుండా చూసుకోవడం ద్వారా..."

 

    మధుమతి ఆ క్షణాన ఒక చాణక్యుడ్ని, శుక్రాచార్యుడ్ని చూసిన విభ్రాంతికి లోనయింది సామంత్ ని చూస్తూ.


                                                         *    *    *    *


    "ఏమిటి ప్రొద్దుటే ఇలా వచ్చావ్ అర్జున్ రావు..." ఏదో ఫైల్ తిరగేసుకుంటూ అడిగింది నాగమ్మ.

 

    "ఇంతవరకు మీ కారెవరికయినా ఇచ్చారా..."

 

    "లేదే...?"

 

    "రాత్రి పాప ఇంట్లోనే వుంది గదా?"

 

    "వాడ్డూయూ మీన్...! ఉండక ఎక్కడకెళ్తుంది? కంపెనీ ఫైల్స్ ముందేసుకుని రాత్రి బాగా పొద్దుపోయేవరకు వాటినే స్టడీ చేస్తూ కూర్చుంది."

 

    "రాత్రి మీ కారు ఎవరికైనా ఇచ్చారా...?"

 

    "ఇచ్చాను"

 

    "తీసుకెళ్ళిన వ్యక్తెవరో నాకు తెలీదుగాని - కారు ఇంటికి వచ్చాక దాన్ని చూశారా...?"

 

    "ఎందుకలా అడుగుతున్నావు...?"

 

    "చెబుతాను- మీరు మీ కారుని చూశారా...?"

 

    "చూడలేదు"

 

    "ఏమనుకోకుండా ఒక్కసారి నాతో వచ్చి చూస్తారా?"

 

    "ఇంతగా అడుగుతున్నావ్- నీ మాటెందుకు కాదనాలి? ఏదో విశేషం లేందే నువ్వూ ఇలా అడగవుగదా? పద..." అంటూ ఆమె ఛైర్ లోంచి లేచి - శాలువాను నిండుగా కప్పుకొని అర్జునరావుతో బయలుదేరి కారు దగ్గరకు వెళ్ళింది.

 

    "దాని లోపలకు ఓసారి చూడండి" అన్నాడు అర్జునరావు ఎటో చూస్తూ చిద్విలాసంగా.

 

    ఆమె కారు లోపలకు చూసి ఓసారి నవ్వుకుంది.

 

    "చూశారా?"

 

    "చూశానే....!"

 

    "మీకేమనిపించింది?"

 

    "నీ మానసిక స్థితి బావోలేదని అనిపించింది"

 

    "వ్వాట్...?" అంటూ కారువేపు తిరిగిచూసి షాక్ తిన్నాడు అర్జునరావు.

 

    కారు ఫ్రంట్ సీట్ ఎంతో నీట్ గా వుంది. అరగంట క్రితం తను చూసిన దృశ్యపు ఆనవాళ్ళే లేవు.

 

    ఏం జరిగిందో అతనికో క్షణం అర్థంకాక పిచ్చెక్కిపోయాడు.

 

    "పనిలో వున్న నన్ను ఏదో కొంప మునిగిపోతుందన్న ఆత్రుతతో తీసుకొచ్చావు? ఏం జరిగింది? ఏమయింది?" నాగమ్మ మందలిస్తున్నట్టుగా అంది ఇంటికేసి వెళ్తూ.

 

    ఏం చెప్పగలడు? తను అంతకుముందు చూసిన ఫ్రంట్ సీట్ వైనాన్ని చెబితే నమ్మగలదా? నమ్మకపోగా తన మనుమరాలి భర్తనే అనుమానిస్తున్నందుకు కోపగించుకుంటే? రెడ్ హేండెడ్ గా పట్టిస్తే తప్ప నమ్మదు... ఆలోచిస్తూ, నెమ్మదిగా ఆమె వెనుకే నడుస్తూ "సారీ..." అన్నాడు సింపుల్ గా.

 

    ఆమె ముందుకు వెళ్తూనే చిన్నగా నవ్వి "వయస్సు మీద పడుతున్న కొద్దీ పరధ్యానం, మతిమరుపులాంటి జబ్బులు రావడం సహజం. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా వుండు" అంటూ లోపలకెళ్ళి పోయింది నాగమ్మ.


                                                   *    *    *    *


    మామూలుగా వుంటే ఎవరో ఒకరు తన మెదడు తినేస్తారని ఈ మధ్య వీలున్నప్పుడల్లా రెండు పెగ్గులేసుకుంటున్నాడు కనకారావు.

 

    అర్జునరావు లోపలికెళ్ళగానే వచ్చాడు కనకారావు.

 

    "ఏమయింది-? నాగమ్మగారు నమ్మారా-" పీటర్ ప్రశ్నించాడు ఆశగా.

 

    లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు అర్జునరావు.

 

    "ఏమయింది... ఆ నలభైవేలు వాళ్ళకిచ్చావా? ఎస్టేట్ కే వస్తామన్నారా?" కనకారావుకేసి చూస్తూ ప్రశ్నించాడు అర్జునరావు.

 

    "నలభైవేలేంటి-?" చిరాకుపడుతూ ప్రశ్నించాడు కనకారావు.

 

    "మతి స్థిమితం లేకుండా పోయిందా? ప్రొద్దుటే ఆ సామంత్ తండ్రికిచ్చి వాళ్ళనిక్కడికి రప్పిస్తానని చెప్పి నలభైవేలు పట్టుకెళ్ళావు-?" గుడ్లురుముతూ ప్రశ్నించాడు పీటర్.

 

    "సరిగ్గా ఇలాగే నాగమ్మగారు అర్జునరావుగార్ని ప్రశ్నించారు. ఏమిటో ఎవరికి మతిస్థిమితం లేదో - ఎవరికి మెంటలో... ఏమీ అర్థమయి చావడం లేదు" గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు కనకారావు.

 

    అర్జునరావు ఓ క్షణం సిగ్గుపడ్డాడు.

 

    ఆ వెంటనే కనకారావు కేసి కోపంగా చూశాడు.

 

    "ఆ సామంత్ గాడి తండ్రికూడా ఇలాగే చూశాడు. మతి లేదా అన్నాడు. పిచ్చి తిట్లన్నీ తిట్టాడు. ఇప్పుడు మిమ్మల్నేమో ఆ నాగమ్మగారడిగితే, మీరేమో నన్నడిగారు- నేనేమో ఆ సెక్రటరీగాడ్ని అడగాలి. వాడేడి ఇంకా రాలేదా- తిన్న ఇంటికే కన్నా లేసే ఆ దొంగ వెధవ రాలేదా...?" అన్నాడు అసహనంగా కనకారావు.

 

    సరిగ్గా అప్పుడే ఏదో ఫైల్ తీసుకొని లోపలకు వస్తున్న సెక్రటరీ పొద్దుటే తూలిపోతున్న కనకారావుని చూసి అసహ్యించుకుంటున్నట్టుగా చూశాడు.

 

    "ఏమిటి పొద్దుటే వేసుకొచ్చావా...? వేళాపాళా లేదా తాగడానికైనా? సెక్రెటరీ కనకారావుని దులిపివేయాలనుకున్నాడు.

 

    "ఆ సామంత్ తండ్రి దగ్గరకు నువ్వెళ్ళి వుంటే తెలిసేది? ఆడితో వ్యవహారం మాట్లాడటమంటే తమాషా అనుకున్నావా-? బుర్రకాయ ఓపెన్ చేయకుండానే వెలగపండులోని గుజ్జంతా ఏనుగు తిన్నట్టు తినేయగలడు. అయినా నీబాబు సొమ్మేదో ఇచ్చినట్టు ఫోజు కొడతావేంటి?- పొద్దుటేంటి ఎప్పుడు బడితే అప్పుడేసుకుంటా... నీకేమన్నా నష్టమా కష్టమా...?" కనకారావు సెక్రెటరీ మీదకు వస్తూ అన్నాడు.