English | Telugu

బోయపాటి చుట్టూ బిగుస్తున్న రామ్‌చరణ్ ఉచ్చు!?

on Feb 6, 2019

'వినయ విధేయ రామ' పరాజయానికి కారణం ఎవరు?
దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన మొండివైఖరే అనుకోవాలా!?

రామ్ చరణ్ రాసిన లేఖలో బోయపాటి పేరు లేకపోవడం ఏమిటి?
అంటే... సినిమా విడుదలకు హీరో, దర్శకుడు మధ్య ఏర్పడ్డ అభిప్రాయ బేధాలు నిజమేనా!?

సినిమా విడుదల తరవాత బోయపాటి మీడియా ముందుకు ఎందుకు రాలేదు?
ప్రేక్షకుల్లో... ముఖ్యంగా మెగాభిమానుల్లో తనపై పెల్లుబికిన ఆగ్రహాన్ని ఆయన తెలుసుకున్నారా!?

ఒక్క లేఖతో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయ్! సంక్రాంతికి విడుదలలైన 'వినయ విధేయ రామ' అంచనాలను అందుకోలేకపోయిందనీ, తామంతా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీయడానికి ఎంతగానో శ్రమించమనీ రామ్ చరణ్ మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. అందులో నిర్మాత దానయ్యకు, సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. కానీ, బోయపాటి పేరు మాత్రం లేదు. మాటవరసకైనా లేఖలో బోయపాటి ప్రస్తావన తీసుకురాలేదు రామ్ చరణ్. లేదంటే సాంకేతిక నిపుణుల్లో బోయపాటిని కలిపేశారా!?

'వినయ విధేయ రామ' విడుదలైన తొలి ఆట నుంచి బోయపాటిపై విమర్శల జడివాన మొదలైంది. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా హీరో కట్టివేతుకు గాల్లో ఎగిరిన తలలను గద్దలు క్యాచ్ చేయడం, ప్రతినాయకుణ్ణి కాటేసిన పాము చచ్చిపోవడం వంటి సన్నివేశాలను బోయపాటి ఎలా తీశాడని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశ్నించారు. ఒకవేళ సినిమా విజయం సాధించి ఉంటే ఆ సన్నివేశాల గురించి గొప్పగా చెప్పుకునేవారేమో!? ప్లాప్ కావడంతో ప్రతి సన్నివేశాన్ని బూతద్దంలో చూపించి దర్శకుణ్ణి ఒక ఆట ఆడుకున్నారు. రామ్ చరణ్ సినిమా కోసం పడిన కష్టాన్ని, నిర్మాత ఖర్చుని బోయపాటి బూడిదలో పోసిన పన్నీరు చేశారని సగటు ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేశారు.

'వినయ విధేయ రామ' విడుదల తరవాత ప్రతి వేలు బోయపాటి వైపు చూపింది. సినిమా పరాజయానికి అతడే కారణం అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా లేఖ రాశాడు. పైగా, అందులో బోయపాటి పేరు లేదు. దాంతో సహజంగానే ప్రేక్షకుల్లో అనుమానాలు వచ్చాయి. అంతకు ముందు సినిమా పరాజయానికి బోయపాటి కారణం అన్న  వచ్చిన కామెంట్స్ నిజమని పలువురు  నమ్ముతున్నారు. దాంతో బోయపాటి చుట్టూ ఉచ్చు బిగిసింది. తప్పక స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజైనా లేదంటే త్వరలో బాలకృష్ణతో చేయబోయే సినిమా ప్రచారం కోసమైనా ప్రేక్షకుల ముందుకు, మీడియా ముందుకు వచ్చిన సందర్భంలో 'వినయ విధేయ రామ' ఫలితం గురించి, రామ్ చరణ్ లేఖ గురించి బోయపాటి సమాధానం చెప్పక తప్పదు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here