పది కోట్లు ఇస్తేనే...?
on Mar 24, 2020
విక్టరీ వెంకటేష్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంత క్రేజ్ ఉందనేది చాటిచెప్పిన సినిమా 'ఎఫ్ 2'. వెంకీకి సరైన స్క్రిప్ట్ పడితే... బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పిన సినిమా కూడా 'ఎఫ్ 2'నే. గతేడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము దులిపింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3' స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు అనిల్ రావిపూడి బిజీ బిజీగా ఉన్నారు.
ఒక్కసారి 'ఎఫ్ 3' స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యాక... వెంకటేష్, వరుణ్ తేజ్ డేట్స్ చూసుకుని షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... పది కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తేనే ఈ సినిమా చేస్తానని వెంకటేష్ పట్టుబట్టారట. నిజానికి, 'ఎఫ్ 2' కంటే ముందు ఆయన రేటు అంత లేదు. ఐదారు కోట్ల లోపే తీసుకునేవారు. వంద కోట్ల సినిమా తన ఖాతాలో పడటం, ప్రస్తుతం చేస్తున్న 'నారప్ప'పై మంచి అంచనాలు ఉండటంతో రేటు పెంచారట. వెంకీ లేకపోతే 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాలను ఊహించలేం. అందుకని, ఆయన అడిగినంత ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యారట.