సైఫ్ చెల్లెలు సోహా, యాక్టర్ కునాల్ ఎప్పుడు ప్రేమలో పడ్డారంటే...
on Oct 17, 2020
బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్స్‌లో సోహా అలీఖాన్, కునాల్ కెమ్ము ఒకటి. సైఫ్ అలీఖాన్ చెల్లెలు అయిన సోహా గతంలో సౌత్ హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం గట్టిగానే వినిపించింది. ఆ ఇద్దరూ 'రంగ్ దే బసంతి' చిత్రానికి కలిసి పనిచేసినప్పట్నుంచీ కొంత కాలం వరకు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పుకుంటారు. ఏమైనా అది గతం. ఆ తర్వాత సోహా మరో సహనటుడు కునాల్ కెమ్మును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరూ తొలిసారి 'ధూంతే రెహ్ జావోగే' మూవీలో కలిసి నటించారు. అయితే ఆ టైమ్‌లో వాళ్లిద్దరూ కనీసం ఫ్రెండ్స్ కూడా కాలేదు.
కానీ 2009లో రెండోసారి కలిసి నటించిన '99' సినిమా సెట్స్‌పై పరస్పరం కనెక్టయ్యారు. ఆ విషయం సోహా స్వయంగా తెలిపింది. ఆ టైమ్‌లో అతను చాలా హ్యాండ్సమ్గా, మిస్టీరిస్గా కనిపించాడని ఆమె చెప్పింది. 2014లో పారిస్‌లో సోహా, కునాల్ ఎంగేజ్జెంట్ జరగగా, 2015 జనవరిలో ముంబైలో వైభవంగా వారి పెళ్లి జరిగింది. 2017 సెప్టెంబర్‌లో ఆ జంటకు తొలి బిడ్డ ఇనాయా నౌమి పుట్టింది. ఐదున్నరేళ్లకు పైగా సంసారిక జీవితాన్ని ఆ ఇద్దరూ అత్యంత ఆనందకరంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
అక్టోబర్ 4న తన జీవిత సహచరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కునాల్, "నాలోని అన్ని ఎమోషన్స్‌ను ఒకే ఒక్కరి దగ్గర నుంచి తెలుసుకోగలిగాను.. వాటిలో కొన్ని ఎమోషన్స్ నాలో ఉన్నట్లు కూడా అప్పటి దాకా నాకు తెలీదు. నేను సంతోషంగా ఉన్నప్పుడు ఆమె ముఖంలోని నవ్వు, నేను బాధగా ఉన్నప్పుడు ఆ ముఖం నుంచి నేను పొందే కాంతి, నేను మాటలు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె డిక్షనరీగా కనిపించడం.. నా ప్రియతమా నీకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ సోహాపై తన ప్రేమానురాగాలను పంచుకున్నాడు కునాల్.