'మర్డర్' అప్‌డేట్: ఆర్జీవీని కోర్టుకు లాగిన అమృత
on Aug 4, 2020
ఇటీవల వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ, తీస్తూ, కాంట్రవర్షియల్ పబ్లిసిటీతో లాభపడుతూ వస్తోన్న రామ్‌గోపాల్ వర్మ తాజాగా మరోసారి చట్టపరమైన సమస్యను ఎదుర్కొన్నారు. ఆయన తీస్తున్న 'మర్డర్' సినిమాకు సంబంధించి మంగళవారం నల్గొండ కోర్టులో ఆర్జీవీపై ఓ కేసు దాఖలైంది. 'మర్డర్' మూవీని సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసు ఆధారంగా తీస్తున్నట్లు స్వయంగా ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించడమే కాకుండా ఆ కేసుకు సంబంధించిన తండ్రీకూతుళ్లు మారుతీరావు, అమృత ఫొటోలను సైతం షేర్ చేశారు.
అగ్ర వర్ణానికి చెందిన అమృత ఒక దళిత యువకుడైన ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో, సహించలేకపోయిన అమృత తండ్రి మారుతీరావు తన అల్లుడైన ప్రణయ్‌ను పట్టపగలు హాస్పిటల్ ఆవరణలోనే కిరాతకంగా కిరాయి హంతకుల చేత హత్య చేయించాడనే కథ మనకు తెలుసు. ఆ తర్వాత మారుతీరావు సైతం అనుమానాస్పదంగా మృతి చెందడమూ సంచలనం సృష్టించింది.
ఇప్పుడు తన అనుమతి తీసుకోకుండా తన కథను 'మర్డర్' పేరుతో సినిమాగా తీస్తున్నారనీ, అందులో అనేక అసత్యాలను చూపిస్తున్నారనీ అమృత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. "నా భర్త ప్రణయ్ మర్డర్, ఐదు నెలల క్రితం నా తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత నేను భయంకరమైన మానసిన వేదనలో ఉన్నాను. మా జీవితాల్లో జరిగిన భయానక ఘటనలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వర్మ 'మర్డర్' ఫిల్మ్ తీస్తున్నారు" అని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
తన నుంచి కానీ, తన కుటుంబం నుంచి కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా తన జీవితానికి సంబంధించిన ఘటనలతో సినిమా తీస్తూ, తమ పేర్లను వర్మ ఉపయోగిస్తున్నారని అందులో ఆమె ఆరోపించారు. తమ పర్మిషన్ లేకుండా తమ పేర్లను, తమ ఫొటోలను ఉపయోగిస్తున్నందున ఆ సినిమాను నిలుపుదల చేయాల్సిందిగా కోర్టును ఆమె అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి నల్గొండ కోర్టు బదలాయించింది. ఆగస్ట్ 6న ఆర్జీవీని, మర్డర్ నిర్మాతలను కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
