రానాను పెళ్ళికొడుకు చేసేది ఈరోజే
on Aug 7, 2020
దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. రానా పెళ్లి సందడి మొదలు కావడంతో దగ్గుబాటి ఫ్యామిలీ అంతా ఫెస్టివల్ మోడ్లో ఉంది. రెండు రోజుల క్రితం రానాకు కాబోయే శ్రీమతి మిహీకా బజాజ్ ఇంట పసుపు-కుంకుమ వేడుక జరిగింది. దానికి రానా సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెళ్ళికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. శనివారం పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రానాను పెళ్ళికొడుకు చేయనున్నారు.
తెలుగు సంప్రదాయాల ప్రకారం శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు రానాను పెళ్ళికొడుకు చేయనున్నారు. అయితే, తోడు పెళ్ళికొడుకు లేకుండా ఈ శుభకార్యం జరగొచ్చని రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు. సాధారణంగా కుటుంబ సభ్యులలో చిన్నపిల్లలను తోడు పెళ్లికొడుకుగా కూర్చోబెడతారు. దగ్గుబాటి ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఎవరు లేరు. కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న బంధువులు పెళ్ళికి వచ్చే పరిస్థితి లేదు. అందుకని, రానా పక్కన తోడు పెళ్లి కొడుకు లేకుండా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దగా హడావిడి లేకుండా చిన్నగా, సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు.