English | Telugu

రాజుగారి గది-2 మూవీ రివ్యూ

on Oct 13, 2017

 

సినిమా: రాజుగారి గది 2
తారాగణం: అక్కినేని నాగార్జున, సమంత అక్కినేని, అశ్విన్, సీనత్ కపూర్...
దర్శకత్వం: ఓంకార్
నిర్మాత : పీవీపీ సంస్థ, నిరంజన్ రెడ్డి


ఒకప్పుడు హారర్ సినిమాలంటే భయపెట్టడమే పరమావధిగా ఉండేవి. కాళరాత్రి, ఇంటినెంబర్ 13, పురానా మందిర్, క్షణం క్షణం భయం భయం.. అలా వచ్చిన సినిమాలే. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ.. హారర్ సినిమాలకు కొత్త భాష్యం చెప్పాడు. హాలీవుడ్ తరహాలో హారర్ సినిమాలను తీసి... బాగానే భయపెట్టాడు. అయితే... హారర్ కథల్లో భిన్నమైన కథంటే మాత్రం మలయాళ చిత్రం ‘మణిచిత్ర తాజు’నే. ఆ సినిమానే తెలుగులో ‘చంద్రముఖి’లా వచ్చి సంచలనం సృష్టించింది. దానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి కానీ.. పెద్దగా ఆడలేదు. అయితే.. లారెన్స్ ‘ముని’ నుంచి హారర్ కథల్లో కామెడీ ప్రధాన భూమిక పోషించడం మొదలైంది. ‘కాంచన’తో అది ఇంకాస్త ఊపందుకుంది.  ప్రేమకథాచిత్రమ్, గంగ, రాజాగారి గది, ఆనందో బ్రహ్మ... ఇలా అదే దారిలో చాలా సినిమాలు ప్రయాణించాయ్. విజయం సాధించాయ్.  

ఇప్పుడు ‘రాజుగారి గది 2’. ఇది కూడా హారర్ సినిమానే. అయితే... పైన చెప్పుకున్న సినిమాల్లో ఇది ఏ తరహా సినిమా? అసలు ఈ సినిమాను దర్శకుడు ఓంకార్ ఎలా తీశాడు? అనేది చెప్పుకునే ముందు కథలోకెళ్దాం. 

కథ:
ముగ్గురు కుర్రాళ్లు జీవితంలో ఎదగాలనే సంకల్పంతో ఓ రిసార్ట్ ని రెంట్ కి తీసుకుంటారు. అయితే.. ఆ రిసార్ట్ లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయ్. అవి అసహజంగా ఉంటుంటాయ్. టోటల్ గా వాళ్లకు ఓ విషయం అర్థమవుతుంది. రిసార్ట్ లో దెయ్యం ఉంది అని. దాంతో ఓ పాస్టర్ ద్వారా.. రుద్రా అనే మెంటలిస్ట్ ని కలుస్తారు. అతనొక మోడ్రన్ సెయింట్. కళ్లను చూసి మనసుని చదవగలడు. జరిగిన దాన్ని కూడా ఊహించి చెప్పే అతీతమైన శక్తి కలవాడు. రుద్రా వారితో పాటు రిసార్ట్ లోకి అడుగుపెడతాడు. అక్కడ్నుంచి ఆ రిసార్ట్ లో ఉన్న ఆత్మకూ, రుద్రా కు జరిగిన సంఘర్షణే మిగిలిన కథ.   

విశ్లేషణ:
సాధారణంగా హారర్ కథల్లో కొత్తదనం ఉండదు. ఎవరితోనో మోసగించబడ్డ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడటం.. తర్వాత దెయ్యం అవ్వడం.. హీరో వచ్చి.. దెయ్యాన్ని పంపించేయడం. ఇదే కథ. సో.. కథలో కొత్తదనం చూడాల్సిన అవసరం ఇక్కడ లేదు. కొత్తగా ఎలా భయపెట్టాడు? కొత్తగా ఎలా నవ్వించాడు? పాత కథను కొత్తగా ఎలా చెప్పాడు? ఈ విషయాలనే మనం పరిగణనలోకి తీసుకోవాలి. ‘రాజుగారి గది 2’ అనగానే.. హారర్, కామెడీనే అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలా చూస్తే... ఈ సినిమాలో హారర్ అస్సలు లేదు. కామెడీ చెప్పుకునే స్థాయిలో లేదు. కాబట్టి ఇది ‘కాంచన’ తరహా సినిమా కాదు. ఇందులో ‘చంద్రముఖి’ తరహాలో ఇన్విస్టి గేషన్ డ్రామా ఉంది. అది జనాలకు పట్టేస్తది. కథలో ఆసక్తిని రేకెత్తించేది అదే. కథనం ఆసక్తికరంగా ఉంటే... కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. జనాలు ఎంజాయ్ చేస్తారు. కథతో చివరి వరకూ ట్రావెల్ అవుతారు. ఈ సినిమా విషయంలో కూడా జరిగింది అదే. ముఖ్యంగా నాగార్జున, సమంత మధ్య సాగే ఎపిసోడ్స్ జనాన్ని కట్టిపడేస్తాయ్. ఆ విషయంలో ఓంకార్ సక్సెస్ అయ్యాడు. అంతేకాదు... మామూలు హారర్ కథను ఎంచుకోకుండా.. ఓ సామాజిక సమస్య చుట్టూ నడిచే కథను తీసుకొని.. దాన్ని ఆసక్తికరంగా జనాలకు అందించడంలో కూడా ఓంకార్ సక్సెస్ అయ్యాడు. 

అయితే.. ఈ కథకు సమంతే అవసరం లేదు. ఏ కొత్త అమ్మాయిని తీసుకున్నా బాగానే ఉండేది. ఓ విధంగా సమంత ఈ కథకు మైనస్. ఎందుకంటే... తెరపై ఆ అమ్మాయిని చూసి ఎవరూ దెయ్యంలా ఫీలవ్వడంలేదు. ఏది ఏమైనా.. నంబర్ వన్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి పాత్ర చేయడం అభినందనీయం. ఇక నాగార్జున. ఇలాంటి జానర్ తొలిసారి చేశారాయన. నాగ్ కళ్లు,  కళ్లల్లోని తీక్షణత.. పాత్రకు చాలా హెల్ప్ అయ్యింది. అంతకు ముందు రజనీకాంత్ చేసిన పాత్రే అయినా... నాగ్ తన స్టైల్ లో చెడుగుడు ఆడేశాడు. అద్భుతంగా చేశాడు.. ఇక రెండో మాట లేదు. ఓంకార్ తమ్ముడు అశ్విన్, తక్కినవారందరూ కూడా బాగానే చేశారు. 

సాంకేతికంగా చూసుకుంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు అబ్బూరి రవి. చాలాకాలం తర్వాత కలం బలం చూపించారాయన. పతాక సన్నివేశంలో అబ్బూరి రవి డైలాగ్స్ క్లాప్స్ కొట్టించాయ్. అలాగే తమన్ నేపథ్యం సంగీతం, దివాకరన్ కెమెరా బావుంది. 

టోటల్ గా... ఏదో భయపెడతాడూ.. నవ్విస్తాడూ.. అని మాత్రం ఈ సినిమాకెళ్లొద్దు. ఆసక్తిగా నడిచే ఓ కథను చూడాలంటే ‘రాజుగారి గది’లోకి వెళ్లండి. మీకు నచ్చుతుంది. 

రేటింగ్: 2.75/5
 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here