Home

»

Latest News

కిరీట సుంద‌రీమ‌ణుల‌పై క‌న్నేసిన కింగ్!

Mar 10, 2020 11:05AM

 

కింగ్ నాగార్జున సినిమాలంటేనే 'గ్లామ‌ర్' మ‌యం. ద‌క్షిణాది భామ‌ల‌తో పాటు ఉత్త‌రాది సుంద‌రీమ‌ణుల‌తోనూ నాగ్ ప‌లు సంద‌ర్భాల్లో ఆడిపాడారు. అంతేకాదు.. మ‌రే ద‌క్షిణాది క‌థానాయ‌కుడికి ద‌క్క‌ని ఓ అరుదైన ఘ‌న‌త కూడా నాగ్ కు ఉంది. అదేమిటంటే.. అందాల పోటీల్లో కిరీటాలు గెలిచిన ప‌లువురు 'మిస్' బ్యూటీల‌తో ఆడిపాడిన వైనం సౌత్ లో ఒక్క ఈ 'మ‌న్మ‌థుడు'కే సొంతం. 

నాటి 'విక్కీ దాదా'లో 'మిస్ ఇండియా' (1984) జూహీ చావ్లాతో జ‌ట్టుక‌ట్ట‌డం మొద‌లుకుని.. నేటి 'వైల్డ్ డాగ్' కోసం 'మిస్ ఆసియా ప‌సిఫిక్' (2000) దియా మీర్జాతో క‌ల‌సి న‌టించ‌డం వ‌ర‌కు ఈ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తున్నాడు ఈ అక్కినేని అంద‌గాడు.

ఓ సారి అలా గ‌తంలోకి వెళితే.. 'మిస్ ఇండియా' కిరీట సుంద‌రి జూహీ చావ్లాతో 'విక్కీ దాదా' (1989), 'శాంతి క్రాంతి' (1991) చిత్రాల్లో అల‌రించిన నాగ్.. ఆపై ఏకంగా 'విశ్వ సుంద‌రి' (మిస్ యూనివ‌ర్స్ - 1994) కిరీటం అందుకున్న సుస్మితా సేన్ తో 'ర‌క్ష‌కుడు' (1997)లో ఆడిపాడాడు. విశేష‌మేమిటంటే.. ద‌క్షిణాదిలో సుస్మిత న‌టించిన తొలి చిత్ర‌మిదే కావ‌డం. ఇక ఆమె 'మిస్ యూనివ‌ర్స్' కిరీటం గెలిచిన ఏడాదిలోనే 'ప్ర‌పంచ సుంద‌రి' (మిస్ వ‌ర‌ల్డ్)గా నిల‌చిన ఐశ్వ‌ర్యా రాయ్ తోనూ నాగ్ 'రావోయి చంద‌మామ‌' (1999)లో ప్ర‌త్యేక గీతం చేశాడు. తెలుగులో మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐష్ క‌నిపించిన ఏకైక చిత్ర‌మిదే కావ‌డం విశేషం. 

క‌ట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంత‌రం ఇప్పుడు 'మిస్ ఆసియా ప‌సిఫిక్' దియా మీర్జాతో క‌ల‌సి 'వైల్డ్ డాగ్'లో న‌టిస్తున్నాడు నాగ్. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ కాప్ స్టోరీ.. వేస‌వి చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేట‌గిరి ఏదైనా.. అందాల పోటీల్లో కిరీటం అందుకున్న ఇంద‌రి భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌డం ఒక్క నాగ్ కే చెల్లింది. ఎటొచ్చీ.. వారి కాంబోలో స‌క్సెస్ రేట్ నే అంతంత మాత్రం. మ‌రి.. దియాతోనైనా నాగ్ ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ కొట్టి.. కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడేమో చూద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com