ఆ నిర్మాత వందో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని మాటిచ్చిన దర్శకేంద్రుడు!
on Sep 10, 2019
తుమ్మలపల్లి రామసత్యనారాయణ చిన్న సినిమాల నిర్మాతగా ఫిలిం ఇండస్ట్రీలోని వ్యక్తులకు తెలుసు. ఇప్పటివరకూ ఆయన తీసిన 97 సినిమాలు విడుదలయ్యాయి. చాలా తక్కువ కాలంలోనే ఆయన వీటిని నిర్మించడం ఒక రికార్డు. అయితే ఆయన ఏం సినిమాలు తీశారంటే.. ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్ క్రీం', 'ఐస్ క్రీం 2' సినిమాల నిర్మాత ఆయనే. ఇటీవలే ఆయన నిర్మాతగా 98వ సినిమా పూర్తిచేసి, 99వ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇక వందో సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తియ్యాలని ఆయన సంకల్పించారు. ఆ సినిమాకు డైరెక్ట్ చెయ్యడానికి శతాధిక చిత్రాల దర్శకుడు మాటిచ్చారని ఆయన మీడియాకు వెల్లడించారు.
ఆయనెవరో ఈ సరికి అర్థమై ఉంటుంది. ప్రస్తుతం శతాధిక చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు ఇండస్ట్రీలో ఒక్కరే కనిపిస్తారు. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ కూడా శతాధిక సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ వాళ్లిప్పుడు జీవించిలేరు. అందుకే రాఘవేంద్రరావును ఉద్దేశించే రామసత్యనారాయణ ఆ మాట చెప్పారని అర్థమైంది. తాజాగా ఆ విషయాన్నితెలుగు ఒన్ తో మాట్లాడుతూ రామసత్యనారాయణ ధృవీకరించారు. ఆ మూవీ ఏ జోనర్లో ఉంటుందో అదంతా రాఘవేంద్రరావు ఇష్టమని, తాను కథ కూడా వినననీ, ఆయన తన వందో చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి మించి తనకు ఇంకేం కావాలని ఆయన అన్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ గా ఎస్. గోపాల్ రెడ్డి పనిచేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది.
Also Read