English | Telugu

కృష్ణార్జున‌యుద్ధం రివ్యూ

on Apr 12, 2018

 

నాని సినిమా అంటే హిట్టు గ్యారెంటీ అని ఓ న‌మ్మ‌కం. మామూలు క‌థ‌ని కూడా మ‌రో స్థాయికి తీసుకెళుతుంటాడు నాని. దాంతో క‌థ ప‌రంగా చిన్న చిన్న త‌ప్పులు క‌నిపించినా...ప్రేక్ష‌కులు మాత్రం ఆయ‌న సినిమాల్ని హిట్టు చేసేస్తుంటారు. అందుకే నానికి వ‌రుస‌గా విజ‌యాలే.  ఈ జోరును ఇలాగే కొన‌సాగించాల‌ని ఆయ‌న వేగంగా సినిమాలు చేస్తున్నారు. వేస‌వి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాని చిత్రం ` కృష్ణార్జునయుద్ధం`. నాని ద్విపాత్రాభిన‌యం అన‌గానే  న‌వ్వులు కూడా డ‌బులేమో అన్నంతగా అంచ‌నాలు పెంచుకొన్నారు ప్రేక్ష‌కులు. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా?  తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

* క‌థ‌

కృష్ణ (నాని) చిత్తూరు జిల్లా యువ‌కుడు. ఊళ్లో స్నేహితుల్ని వెంటేసుకొని నాట‌కాలంటూ తిరుగుతుంటాడు. క‌నిపించిన ప్ర‌తి అమ్మాయిని చూసి ప్రేమ‌లో దించాల‌ని చూస్తుంటాడు. అర్జున్ (నాని) యూర‌ప్‌లో ఓ రాక్‌స్టార్‌. తొలి చూపులోనే అమ్మాయిల్ని ఆక‌ర్షించేస్తుంటాడు. కృష్ణ, అర్జున్‌లు ఒకే రూపంతో ఉంటారు కానీ... ఇద్ద‌రి మ‌ధ్య ఎటువంంటి సంబంధం ఉండ‌దు. ఊరికొచ్చిన స‌ర్పంచ్ మ‌న‌వ‌రాలు రియా (రుక్స‌ర్‌)ని చూసి మ‌న‌సు పారేసుకుంటాడు కృష్ణ‌. రియా కూడా కృష్ణ మ‌న‌సు తెలుసుకొని దగ్గ‌ర‌వుతుంది. అర్జున్ ఏమో  సుబ్బ‌ల‌క్ష్మి (అనుప‌మ)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా సుబ్బ‌ల‌క్ష్మే త‌న సోల్‌మేట్ అనుకుంటాడు. కానీ సుబ్బ‌ల‌క్ష్మి స‌సేమిరా అంటూ యూర‌ప్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేస్తుంది. రియా ప్రేమ విష‌యం కూడా తెలిసి ఆమెని హైద‌రాబాద్ పంపిస్తారు.  అలా ఒకే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన రియా, సుబ్బ‌ల‌క్ష్మి ఇంటికి చేరుకోరు. ఆ విష‌యం తెలిశాక వాళ్ల‌ని ప్రేమించి కృష్ణార్జునులు ఏం చేశారు?  అస‌లింత‌కీ ఆ అమ్మాయిలిద్ద‌రూ ఏమైపోయారు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌

రెండు జంటల ప్రేమకథ ఈ చిత్రం. ఫ‌స్ట్‌హాఫ్ మొత్తం కామెడీతో కాల‌క్షేపం చేయిస్తే... సెకండ్‌హాఫ్ ఏమో యాక్ష‌న్ చిత్రాన్ని చూపిస్తుంది. అయితే కామెడీ పండినంత‌గా, యాక్ష‌న్ పండ‌లేదు. క‌థలో బిగి లేక‌పోవ‌డమే అందుకు కార‌ణం. ఫ‌స్ట్‌హాఫ్‌లో కాస్త ఆల‌స్యంగా న‌వ్వులు పండ‌టం మొద‌ల‌వుతుంది. కృష్ణ చిత్తూరు యాస మాట్లాడుతూ చేసే తింగ‌రి ప‌నులు ప్రేక్ష‌కుల్ని బాగా న‌వ్విస్తుంటాయి. అతని స్నేహితుల పాత్ర‌లు  కూడా అందుకు మంచి స‌హ‌కారం అందించాయి. అర్జున్ పాత్ర‌లోనూ వినోదం ఉంటుంది. అయితే సుబ్బ‌ల‌క్ష్మిగా అనుప‌మ ప‌రిచ‌య‌మయ్యాకే న‌వ్వులు మొద‌ల‌వుతుంది. అర్జున్ మేనేజ‌ర్‌గా బ్ర‌హ్మాజీ, సంగీతాన్ని ఇష్ట‌ప‌డే మ‌హిళ‌గా దేవ‌ద‌ర్శిని నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు బాగా న‌వ్విస్తాయి. అయితే సినిమా ఎంతగా ముందుకు సాగుతున్నా అస‌లు క‌థ మాత్రం ఇంకా మొద‌ల‌వ్వ‌లేదేమిటి అనిపిస్తుంటుంది ప్రేక్ష‌కుడికి. విరామానానికి ముందే అస‌లు క‌థ‌లోకి వెళుతుంది సినిమా. క‌థానాయిక‌లిద్ద‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం, ఒకే పోలిక‌లున్న ఇద్ద‌రు క‌థానాయ‌కులు హైద‌రాబాద్‌కి రావ‌డంతో క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం పెద్ద‌గా రిస్క్‌లేమీ తీసుకోకుండా క‌థ‌ని ఫ్లాట్‌గా న‌డిపించేశాడు. దాంతో పెద్ద‌గా ఆస‌క్తి లేకుండానే సన్నివేశాలు ముందుకు సాగిపోతుంటాయి. ఒక రేసీ యాక్ష‌న్‌గా, ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా  సాగాల్సిన ద్వితీయార్థం చ‌ప్ప‌గా ముగుస్తుంది. క‌థలో ఎలాంటి మ‌లుపులు లేక‌పోవ‌డం, ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే స‌న్నివేశాలు సాగ‌డం నిరాశ‌ప‌రిచే విష‌యం.

* న‌టీన‌టులు

నాని న‌ట‌నే సినిమాకి హైలెట్‌. ముఖ్యంగా కృష్ణ పాత్ర‌లో ఆయ‌న ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఆయ‌న ప‌లికిన చిత్తూరు యాస కూడా క‌లిసొచ్చింది. రాక్‌స్టార్ అర్జున్ పాత్ర‌లో పర్వాలేద‌నిపిస్తాడంతే. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ మీర్ పాత్ర‌ల‌కి స‌మ ప్రాధాన్యం ల‌భించింది. ఇద్ద‌రూ కూడా అందంగా కనిపించారు. నాని మిత్ర‌బృందంలో క‌నిపించింది కొత్త న‌టులైనా మంచి టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు.  బ్ర‌హ్మాజీ, సుద‌ర్శ‌న్‌, దేవద‌ర్శిని, ప్రభాస్ శ్రీను  త‌దిత‌రులు ప‌రిది మేర‌కు న‌వ్వించారు.

* సాంకేతిక‌త‌

ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ మ‌రోసారి కామెడీనే త‌న బ‌లం అని నిరూపించారు. కృష్ణ‌, అర్జున్ పాత్ర‌ల చుట్టూ అల్లిన కామెడీ స‌న్నివేశాలే చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. క‌థ ప‌రంగా మాత్రం చాలా చోట్ల తేలిపోయిన‌ట్టు అనిపిస్తుంది. అయితే ఇద్ద‌రు క‌థానాయ‌కుల నేప‌థ్యాన్ని సింక్ చేస్తూ ప్యార‌ల‌ల్‌గా న‌డిపించిన విధానం మాత్రం బాగుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. కార్తీక్ కెమెరా, హిఫ్ హాప్ త‌మిళ సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. దారిచూడు పాట‌తో పాటు, దాన్ని తెర‌కెక్కించిన విధానం కూడా చాలా బాగుంది.

* చివ‌రిగా

నాని శైలి వినోదం కోసం చూడొచ్చు ఈ సినిమాని. క‌థ ప‌రంగా అద్భుతాలు ఆశిస్తే మాత్రం భంగ‌ప‌డ‌క త‌ప్ప‌దు.

రేటింగ్ : 2.0

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here