నమ్రత మిస్టేక్‌పై మహేశ్‌కు ఫిర్యాదు చేసిన ప్రొడ్యూసర్!
on Jan 16, 2021
గుణశేఖర్ డైరెక్ట్ చేసిన 'ఒక్కడు' మూవీ మహేశ్ కెరీర్ దిశను మార్చేసి, అతడిని స్టార్ హీరోగా మార్చింది. 'రాజకుమారుడు'తో హీరోగా కెరీర్‌ను ఆరంభించిన మహేశ్, 'ఒక్కడు' సినిమాతో తారాపథంలోకి అడుగుపెట్టాడు. అలా ఆ సినిమా మహేశ్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. అంతేకాదు.. తెలుగు చిత్రసీమలోని క్లాసిక్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2003 జనవరి 15న సంక్రాంతికి విడుదలైన ఆ సినిమాని ప్రేక్షకులు అపూర్వ రీతిలో ఆదరించారు. అంటే.. ఆ సినిమా విడుదలై నిన్నటికి 18 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా ఆ సినిమాతో అనుబంధం ఉన్న పలువురు ఆ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు.
కాగా మహేశ్ సతీమణి నమ్రత కూడా 'ఒక్కడు'పై తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. "An eternal classic from the plate of @urstrulymahesh's films!! A film you can watch over and over again!! My all-time favourite 😍😍❤️ and it can only get better with time" అంటూ ఆమె రాసుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా మహేశ్, భూమిక, గుణశేఖర్, ప్రకాశ్‌రాజ్, విజయన్ (స్టంట్ డైరెక్టర్), మణిశర్మల పేర్లను ప్రస్తావించిన ఆమె, ఆ సినిమాని నిర్మించిన ఎం.ఎస్. రాజు పేరును విస్మరించారు. దీంతో ఆమె ఫాలోయర్స్ పలువురు ఈ విషయాన్ని గుర్తు చేశారు. మహేశ్‌కు తొలి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన ప్రొడ్యూసర్ పేరును మర్చిపోవడమేంటని ట్రోల్ చేశారు.
ఎం.ఎస్. రాజు సైతం దీనిపై బాధపడినట్లు కనిపించింది. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్న ఓ ట్వీట్‌లో మిస్టేక్స్ జరుగుతాయనీ, ఒక్కడు 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నమ్రత గారు పెట్టిన పోస్టులో తన పేరును మర్చిపోయారనీ, అయినా ఆ మూవీని ఆమె తన ఫేవరేట్ క్లాసిక్ అని చెప్పినందుకు ఆనందంగా ఉందనీ రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌ను ఆయన మహేశ్‌కు ట్యాగ్ చేశారు.
ఆయన అలా స్పందించిన తర్వాత నమ్రత తన పోస్ట్‌ను ఎడిట్ చేసి, ఎం.ఎస్. రాజు పేరును కూడా జోడించారు. మరోవైపు తన ట్వీట్‌ను ఎం.ఎస్. రాజు డిలీట్ చేశారు. అయితే ఈలోగా ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
