ట్రైలర్ వహ్వా!... మరి సినిమా? హీ.. హీ.. హీ..!
on Jul 8, 2017

ఓ అసిస్టెంట్ డైరెక్టరూ... డైరక్టర్ గారితో... ‘మీ కొత్త ట్రైలర్లో షాట్స్ భలే ఉన్నాయి సార్’అన్నాడట అబినందిస్తున్నట్టుగా.. ‘బాగున్న షాట్స్ నే ఏరుకొచ్చి పెడతామురా అబ్బాయ్! ’అని తాపీగా నిజం చెప్పారట డైరెక్టర్. అందుకే.. ‘మిగతా సినిమా ఎలా ఉంటుంది’ అని మాత్రం ఎక్కడా అడక్కండి. ఎందుకంటే... లోగుట్టు దర్శక మహాశయులకే ఎరుక.
ప్రస్తుతం మన సినిమాల పరిస్థితి అలాగే ఉంది మరి. ట్రైలర్ చూస్తేనేమో... ‘వహ్వా’ అనే రేంజ్ లో ఉంటుంది. సినిమా చూస్తే.. మత్తివ్వకుండా కంటికి ఆపరేషన్ చేసినట్టుంటుంది.
మొన్నామధ్య సల్మాన్ ఖాన్ గారిదీ... ‘ట్యూబ్ లైట్’ అని.. ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమా ట్రైలర్ మేకింగ్, ఎడిటింగ్, కెమెరా, ముఖ్యంగా సల్మాన్ నటన చూసిన ప్రేక్షకులు... ‘ఈ సినిమా దెబ్బకు రికార్డులన్నీ ఫట్’ అని ఫిక్స్ అయిపోయారు. తీరా సినిమానే ‘ఫట్’ అనింది.
ఆ మధ్య వచ్చిన కొన్ని భారీ తెలుగు సినిమాల పరిస్థితి కూడా అంతే. ఉదాహరణకు మన పవర్ స్టార్... సర్థార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలే తీసుకోండీ... ఆ ట్రైలర్లను చూసి అభిమానులు పులకించి పోయారు. సినిమాలు చూసి నీరసించిపోయారు.
‘ఓం నమో వెంకటేశాయ’... ఆ ట్రైలర్ చూసిన వారందరూ భక్తి పారవశ్యంతో పొంగిపోయారు. మరో అన్నమయ్య, శ్రీరామదాసు రాబోతోందని ఫిక్సయిపోయారు. వచ్చింది.. ‘గోవిందా... గోవింద’. గుంటూరోడు, రాధా సినిమాలు ట్రైలర్లు కూడా కేకపుట్టిచ్చాయి. మరి సినిమాల పరిస్థితి?
మొన్నామధ్య వచ్చిన దువ్వాడ జగన్నాథం, నిన్ను కోరి సినిమాల ట్రైలర్లు కూడా రిలీజుకు ముందు చర్చనీయాంశమే అయ్యాయి. కానీ సినిమాలు విడుదలయ్యాక... ‘బోరే.. బోరశ్య... బోరభ్యో’.
కృష్ణవంశీ ‘నక్షత్రం ’ ట్రైలర్ చాలా బావుందని టాక్. కానీ పెద్దగా ఎవరూ చూడటం లేదట. పాపం చిన్న హీరోలు కదా. అందుకని కృష్ణవంశీగారు సినిమాను అద్భుతంగా తీసుంటారని ‘సర్టిఫికెట్’ మేం ఇవ్వడం లేదండోయ్. ఎందుకంటే ఇంతకు మునుపు ఆయన కూడా శక్తివంచన లేకుండా ఆడియన్స్ ని వంచన చేసిన వారే.
రెండ్రోజుల క్రితం ఎన్టీయార్ ‘జై లవకుశ’ట్రైలర్ వచ్చేసింది. 24 గంటలు తీరిగే లోపే కోట్ల వ్యూస్ వచ్చాయని టాక్. ఆ సినిమా డైరెర్టర్ గారు బాబీ కూడా ఇలాంటి విషయాల్లో ఘనపాటే. మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి.
దయచేసి దర్శక నిర్మాతలకు మేం చెప్పొచ్చేదేంటంటే...! సినిమాకు హైప్ తీసుకురావడం కాదు ముఖ్యం. మంచి కథను ఎంచుకొని, పేషన్ తో సినిమా తీయడం ముఖ్యం. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమా హిట్. దాంట్లో నో డౌట్.
దీని బట్టి యావత్ ప్రజానీకానికీ మేం తెలిపేదేంటంటే... అధ్యక్షా... ‘నాడా దొరికిందని గుర్రం కొనే వాడు ఎంత పిచ్చోడో... ట్రైలర్ చూసి సినిమాలకు వెళ్లేవాడు అంత వెర్రోడు’.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



