మహేశ్ సినిమాల్లో నమ్రత ఫేవరెట్ ఏది?
on Feb 10, 2019
'మహేశ్ సినిమాల్లో మీకిష్టమైన సినిమా ఏది?' అని నమ్రతను అడిగితే ''ఒక్కటి అని చెప్పలేను" అన్నారు. మొత్తం ఐదు సినిమాల పేర్లు చెప్పారు. ఆదివారం మహేశ్ బాబు, నమ్రత 14వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత బోలెడు విషయాలు చెప్పారు. మహేశ్‌కి ముందు తానే ప్రపోజ్ చేశానని అన్నారు. మహేశ్ ఇంట్లో ఉంటే ఓ స్టార్ హీరోలా కాకుండా.. సాధారణ వ్యక్తిలా, మంచి భర్తలా, తండ్రిలా ఉంటాడని, పిల్లలతో కలసి అల్లరి చేస్తాడని తెలిపారు. తమ ఇద్దరి మధ్య మనస్పర్థలు, సమస్యలు రావని.. ఒకవేళ వస్తే ఇద్దరం కూర్చుని సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించి పరిష్కరించే కృషి చేస్తామని చెప్పారు.
'మహేశ్ సినిమాల్లో మీకిష్టమైన సినిమా ఏది?' అని నమ్రతను ప్రశ్నిస్తే.. ముందు 'ఒక్కడు' సినిమా పేరు చెప్పారు. మహేశ్‌కి ఫస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇది. తరవాత 'పోకిరి' అన్నారు. ఈ సినిమాతో మహేశ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తరవాత 'దూకుడు', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాలు నమ్రతకు ఇష్టమైన మహేశ్ సినిమాల్లో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.