పాటల రచయితలకు డిమాండ్ ఉందంటున్న అనంత శ్రీరామ్!
on Oct 22, 2020
"అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా" అంటారు గేయ రచయిత అనంత శ్రీరామ్. అతి చిన్న వయసులోనే పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలో అగ్రశ్రేణి గేయ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. అన్ని రకాల పాటల్లోనూ ప్రతిభ చూపిస్తున్న ఆయన "నా అనుభవం, అవగాహన మేరకు చిత్రసీమలో గౌరవం, ప్రోత్సాహం, తక్కువ ఒత్తిడి ఉన్నది గీత రచనా రంగంలోనే. పాట హిట్టయితే సాహిత్యాన్ని చూస్తున్నారు. తద్వారా రచయితకి పేరు వస్తోంది. పాట ఫ్లాపయితే పట్టించుకోరు కాబట్టి వచ్చే నష్టమేమీ ఉండదు. నెల నెలా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మామీద పుకార్లు ఉండవు. క్రేజ్ లేకపోయినా గౌరవం, ఆప్యాయత ఉంటుంది. సౌకర్యవంతమైన రంగం. మిగతా వాటితో పోలిస్తే పోటీ తక్కువ ఉన్న రంగం ఇదే." అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
సినీ గేయ రచనా రంగంలో నిరుద్యోగం ఉండదని అభిప్రాయపడ్డారు అనంత శ్రీరామ్. "తెలుగు సినిమా రంగంలో ఏడాదికి కనీసం 200 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఒక్కో సినిమాలో సగటున ఐదు పాటలుంటాయనుకుంటే ఆ అన్ని సినిమాల్లో కలిపి వెయ్యి పాటలుంటాయి. బాగా డిమాండ్ ఉన్న రచయిత నెలకి పది పాటలు, అంటే సంవత్సరానికి 120 పాటలు రాస్తాడు. అలాంటి వాళ్లు నలుగురు ఉన్నారనుకుంటే వాళ్లు రాసేది 480 పాటలు. ఇంకా 520 పాటలు రాసే అవకాశం మిగతా వాళ్లకి ఉంది. సంవత్సరానికి 20 చొప్పున వేసుకున్నా ఇంకో 25 మందికి ఇక్కడ అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రంగంలో నిరుద్యోగం అయితే ఉండదు. ఇక్కడ క్రేజ్‌ని బట్టి, హిట్టుని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. పాట రాయడం రాకుండా ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సామాన్య ప్రజ్ఞాపాటవాలుంటే ఈ రంగంలో ఉపాధి దొరుకుతుంది." అని ఆయన వివరించారు.