ENGLISH | TELUGU  

అబ్బబ్బబ్బా.... నిజంగా ఆ రూపంలో ఆయన్ను చూస్తుంటే.....!

on Aug 14, 2017

శ్రీమన్నారాయణుని అవతారాల్లో కృష్ణావతారం ప్రత్యేకమైంది. ‘కష్టాలు అనుభవించడం’ అనే కాన్సెప్ట్ ప్రకారం చూస్తే... అందరూ రామావతారం గురించే మాట్లాడతారు. నిజానికి రాముడు ఎక్కువ కష్టాలు అనుభవించాడా? కృష్ణుడు ఎక్కువ కష్టాలు అనుభవించాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కాస్త లోతుకే వెళ్లాల్సొస్తుంది. 

కౌమార దశ వచ్చేవరకూ రాముడికి కష్టాలంటే ఎంటో తెలీదు. క‌ృష్ణుడి విషయం అలా కాదు. పుట్టడమే జైల్లో పుట్టాడు. కళ్లు తెరవక ముందే కన్నవాళ్లకు దూరమయ్యాడు. అంతేనా... పసి ప్రాయం నుంచే హత్యా ప్రయత్నాలు. అన్నింటినీ తట్టుకుంటూ, నెగ్గుకుంటూ.... తనను తాను కాపాడుకుంటూ, తోటివారిని రక్షించుకుంటూ.. ఎదిగాడు కృష్ణుడు. రాముడి పెళ్లి కూడా ఈజీగానే జరిగిపోయింది. శివధనుస్సుని విరిచాడు. సీతమ్మను చేపట్టాడు. అంతే.. ఫినిష్. కానీ కృష్ణుడు తన అష్టభార్యలనూ  పెళ్లాడటానికి అష్టకష్టాలే పడ్డాడు. పాపం...  ఎన్ని నిందలు మోశాడూ... ఎన్ని యుద్ధాలు చేశాడూ...! రాముని కష్టాలన్నీ 14 ఏళ్లలో ముగిశాయ్. కానీ... కృష్ణుడు కష్టాలు... శరీరాన్ని వదిలేదాకా సాగుతూనే ఉన్నాయ్. 


మంచిని గెలిపించడానికి ‘నా’అనుకున్న వాళ్లనే... కాటికి పంపాల్సి వచ్చినప్పుడు..చెడుకు కొమ్ముకాసినందుకు ధర్మాత్ములను సైతం తనలో ఐక్యం చేసుకోవాల్సొచ్చినప్పుడు...  ఆయన అనుభవించిన బాధ సామాన్యమైందా? చివరకు తన ముందే యదువంశం సర్వనాశనం అవుతుంటే.. బాధను దిగమింగుకున్నాడు తప్ప.. ఎప్పుడైనా బయటపడ్డాడా?  కృష్ణయ్య పిల్లన గ్రోవికే కాదు.. ఆయన  మనసుకు కూడా నిలువెల్లా గాయాలే. కానీ...ఎప్పుడూ ఆ మోములో చిరునవ్వును చెదరనీయలేదు. అందుకే దేవుడయ్యాడు. ఇంకా మాట్లాడితే.. గీతాచార్యుడయ్యాడూ... జగద్గురుడయ్యాడు. 

‘నల్లని వాడు... పద్మ నయనంబుల వాడు’అని కృష్ణయ్యను వర్ణిస్తూ... వ్యాసభగవానుడు భాగవతంలో చెప్పాడు. ఆ భాగవతాన్ని పోతన తెలుగీకరించి మనకందించాడు. దాన్ని బట్టి కృష్ణయ్యను ఊహించుకొని మనం ఆనందపడటమే తప్ప.. నిజంగా ఆయన్ను చూడగలమా? ఈ ప్రశ్నను  ఓ వందేళ్ల క్రితం ఎవర్నయినా అడిగితే... ‘అమ్మో..! కృష్ణయ్యను చూడటమే. ఎన్ని తపస్సులు చేస్తే... ఆ బ్రహ్మాండనాయకుడ్ని చూడగలుతాం’అని సమాధానం వచ్చేది. 


కానీ ఇప్పుడు ఆ సమాధానం రాదు. ఎందుకంటే... వెండితెర పుణ్యమా అని ఎన్నిసార్లు మనం కృష్ణయ్యను చూశాం..! ఎన్నిసార్లు ఆయన లీలను ప్రత్యక్షంగా వీక్షించాం..! అర్జనుడికి మాత్రమే దొరికిన అదృష్టం... కృష్ణయ్య విశ్వరూప సందర్శనం. చివరకు అది కూడా మనకు లభించేసింది. నిజంగా ఈ విషయంలో మనం ఎన్ని జన్మలెత్తినా వెండితెర రుణం తీర్చుకోలేం.   

ముఖ్యంగా ఈ విషయంలో తెలుగువాళ్లు అదృష్టవంతులు. ఎందుకంటే... మనం చూసినన్ని అందమైన కృష్ణ రూపాలను ఏ భాషవారూ చూసుండరు. ఇది నిజం. అసలు ఎన్టీయార్ లాంటి కృష్ణుడు ఎవరికి దొరుకుతాడండీ... మనకు తప్ప. కాదంటారా? 


కిరీటంపై ఆ నెమలీక, నిదుటిపై ఆ కస్తూరీ తిలకం, ఆ నీలమేఘఛాయ, పద్మాల్లాంటి ఆ కళ్లు, వయ్యారమైన ఆ నడక, ఆ చిలిపి చూపు, ఆ కొంటెనవ్వు... అబ్బబ్బబ్బా.... నిజంగా ఆ రూపంలో ఎన్టీయార్ ని చూసి... కృష్ణయ్యనే చూస్తున్నామా? అనేంతగా పరవశించిపోయారు జనం.  ‘ఇద్దరు పెళ్లాలు’(1955) చిత్రంలో తొలిసారి అన్నగారు కృష్ణుడిగా కనిపించారు. అయితే... పూర్తిస్థాయి కృష్ణునిగా నటించింది మాత్రం ‘మాయాబజార్’(1957)చిత్రంలోనే. 

ఆ తర్వాత ‘వినాయక చవితి’(1957), ‘దీపావళి’(1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’(1963), ‘కర్ణ’(తమిళం)(1964), ‘వీరాభిమన్యు’(1965), ‘శ్రీ కృష్ణపాండవీయం’(1966), ‘శ్రీకృష్ణ తులాభారం’(1966), ‘శ్రీకృష్ణావతారం’(1967), శ్రీకృష్ణ విజయం(1971),  ‘శ్రీకృష్ణ సత్య’(1972), ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’(1972), ‘దానవీరసూర కర్ణ’(1977), ‘శ్రీమద్విరాటపర్వం’(1979) ఇలా మొత్తం 14 సినిమాల్లో ఎన్టీయార్ కృష్ణుడిగా చేశారు. 14 రకాలుగా చేశారు. రూపంలోనే తప్ప... ఓ సినిమాలో కృష్ణుడికీ, మరో సినిమాలో కృష్ణుడికీ పొంతనే ఉండదు. ఒకే పాత్రలో అన్నిసార్లు ఆయన తెరపై కనిపించినా మనకు మొహం మొత్తలేదు. కారణం? ఆయన కనిపించింది కృష్ణయ్యగా. మోహం మొత్తే రూపమా కృష్ణయ్యది? 
ఏది ఏమైనా... తెలుగుతెరపై కృష్ణుడు అంటే ఎన్టీయారే. ఇక దానికి తిరుగులేదు. 

తెలుగుతెరపై ఎన్టీయార్ కు ముందు... సీఎస్ఆర్ ఆంజనేయులు, ఈలపాట రఘురామయ్య కృష్ణుడిగా నటించేవారు. ఎన్టీయార్ తర్వాత కృష్ణ పాత్రను ఎక్కువ సార్లు పోషించిన నటుడు కాంతారావు. నర్తనశాల(1963), బబ్రువాహన(1964), పాండవ వనవాసం(1965), సతీ సక్కుబాయ్(1965), ‘ప్రమీలార్జునీయం’(1965) చిత్రాల్లో కాంతారావు కృష్ణపాత్ర పోషించారు. ఆ తర్వాత బాలయ్య,  హరనాథ్, శోభన్ బాబు, రామకృష్ణ నందమూరి బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, ఈ జనరేషన్లో పవన్ కల్యాణ్( ‘గోపాల గోపాల’సినిమా క్లైమాక్స్ లో కృష్ణునిగా కనిపిస్తాడు) కృష్ణ పాత్రల్లో మెరిశారు. 


ఈ రకంగా ఇంతమంది రూపంలో కృష్ణయ్య మనందరికీ కనిపించి, ఆనందపారవశ్యంలో మనల్ని తడిపి తరింపజేశాడు. ఈ రోజు ఆ నల్లనయ్య బర్త్ డే. అందుకే.. ఆయన్ను స్మరించుకుంటూ, వెండితెరపై మనల్ని అలరించిన కృష్ణయ్యలను గుర్తు చేసుకుంటూ... అందరికీ  ’శ్రీకృష్ణాష్టమి’ శుభాకాంక్షలు తెలుపుతోందీ... ‘తెలుగు వన్’.

 

- నరసింహ బుర్రా 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.