'కిల్ బిల్' అంటే 'రసీదుని చంపు' అని అర్థం!
on Aug 28, 2019
'కిల్' అంటే 'చంపు' అని అర్థం. 'బిల్' అంటే 'రసీదు' అని అర్థం. మరి 'కిల్ బిల్' అంటే.. 'రసీదుని చంపు' అని అర్థం. ఏంటీ.. అని ఆశ్చర్యపోకండి. 'గ్యాంగ్ లీడర్'లో రైటర్ 'పెన్సిల్' (నాని) ప్రతిభ ఇది. సినిమాలో మనవాడు కాపీ రైటర్. అంటే హాలీవుడ్ సినిమాలు చూస్తూ, వాటి కథల్ని యథాతథంగా రాసేస్తుంటాడు. అలాగే ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ క్వెంటిన్ టారంటినో తీసిన సూపర్ హిట్ ఫిల్మ్ 'కిల్ బిల్'ను కూడా కాపీ చేసేస్తాడు. టైటిల్‌ని కూడా ట్రూ ట్రాన్స్‌లేట్ చేసి 'రసీదుని చంపు' అనే పేరు పెట్టేస్తాడు.
ఈ విషయం బుధవారం రిలీజ్ చేసిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. మొదటిసారి పెన్సిల్ ఇంటికి ఐదుగురు ఆడవాళ్లు వస్తారు. వాళ్లలో ఐదేళ్ల పాప నుంచి ఎనభై ఏళ్ల బామ్మ దాకా ఉంటారు. అక్కడ దుమ్ముకొట్టుకుపోయిన ఒక వైట్ క్లాత్ లాగితే, దాని కింద చాలా పుస్తకాలు కనిపిస్తాయి. వాటిలో ఒక పుస్తకం పేరు 'రసీదుని చంపు'.
దాన్ని చూసి బామ్మ (లక్ష్మి) "చాలా మంచి పుస్తకమే ఇది. నేనీ బుక్ పూర్తిగా చదివా కానీ, ఈ రసీదెవరో తెలీదు" అంటుంది ఆసక్తిగా. తన మాటలు బయటివాళ్లకు వినపడకూడదన్నట్లు హీరోయిన్ ప్రియాంక చిన్నగా మాట్లాడుతూ "బామ్మా.. రసీదు అంటే బిల్. 'కిల్ బిల్' అనే మూవీ అది. పెద్ద ఫ్రాడ్ వీడు" అని చెప్తుంది. అదీ విషయం. 'కిల్ బిల్' అనే సూపర్ హిట్ హాలీవుడ్ మూవీని మనవాడు 'రసీదుని చంపు' అనే పేరుతో ట్రూ ట్రాన్స్‌లేట్ చేశాడన్న మాట.
ఆ తర్వాత గ్యాంగ్ మెంబర్స్‌తో పెన్సిల్ మీటింగ్ పెడతాడు. హాల్లో చుట్టూ ఉన్న బుక్ షెల్ఫ్‌లను చూపిస్తూ "మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం" అంటాడు చాలా క్యాజువల్‌గా.
ఇలాంటి ఆసక్తికరమైన, వినోదాత్మకమైన సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయని ట్రైలర్బి బట్టి తెలుస్తోంది. విక్రం కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విలన్‌గా కార్తికేయ నటించాడు. సెప్టెంబర్ 30న 'నానీస్ గ్యాంగ్ లీడర్' మన ముందుకు వస్తోంది.