జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఫిల్మ్ టైటిల్ అదేనా?
on Jan 17, 2020
లేటెస్టుగా 'అల.. వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ సంక్రాంతి సినిమా అందించిన టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2020 జూన్‌లో మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. ఈలోగా రాజమౌళి డైరెక్షన్లో చేస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్‌ను తారక్ పూర్తిచేయనున్నాడు. కొంత కాలంగా విభిన్న టైటిల్స్‌తో, అందులోనూ 'అ' అక్షరంతో మొదల్లయ్యే టైటిల్స్‌తో సినిమాలు తీస్తూ ఆకట్టుకుంటున్న త్రివిక్రమ్, ఈ సినిమాకు 'అయినను పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు కూడా.
గతంలో తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ' మంచి విజయం సాధించింది. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో సీరియస్ సినిమాగా తయారైన ఈ మూవీ తారక్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఒక సోషల్ ఎలిమెంట్ నేపథ్యంలో లైన్‌ను తారక్‌కు త్రివిక్రమ్ వినిపించాడనీ, తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలిసింది. 'అల వైకుంఠపురములో' సినిమా చూసిన తారక్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బన్నీ, త్రివిక్రమ్ లను ప్రశంసించిన విషయం తెలిసిందే. త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్లో రెండోసారి నటించేందుకు అతను ఉత్సాహం చూపిస్తున్నాడు.