గీతా ఆర్ట్స్ పేరుతో మోసం చేస్తున్న యువకుడు
on Jul 11, 2020
సినిమాల్లో నటించాలనేది చాలామంది ఔత్సాహికుల కల. దాని కోసం హైదరాబాద్‌కు వచ్చి సినిమాల్లో చేరాలని నానా పాట్లూ పడుతుంటారు. అలాంటి వాళ్ల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి తరచూ మోసగాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోల పేర్లు వాడుకొని, అమాయకులను మోసం చేసి, డబ్బు గుంజుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పేరును వాడుకొని కొంతమంది యువకులను మోసం చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి రాగా, కొద్ది రోజుల క్రితమే తన పేరును వాడుకొని జనాల్ని మోసం చేస్తున్నారంటూ డైరెక్టర్ అజయ్ భూపతి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా అలాంటి వ్యవహారమే గీతా ఆర్ట్స్ పేరిట చోటు చేసుకుంది.
అల్లు అర్జున్ తదుపరి సినిమాలో హీరోయిన్ రోల్ అవకాశం అంటూ గీతా ఆర్ట్స్ పేరిట ఒక యువకుడు పలువురు అమ్మాయిలను మోసం చేసి, డబ్బు గుంజుతున్నట్లు ఆ సంస్థ దృష్టికి వచ్చింది. దాంతో వారు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మోసగాడి కోసం వెతుకుతున్నారు. టాలీవుడ్‌లో ఈ తరహా చీటింగ్ కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి మాయగాళ్ల వలలో పడొద్దని నిర్మాతలు, దర్శకులు యువతను కోరుతున్నారు. సినిమా అవకాశాలు, ఆడిషన్స్‌కు సంబంధించి ఎప్పుడైనా ఎలాంటి ప్రకటనలను చూసినా, ఆయా నిర్మాణ సంస్థల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయాలని వారు సూచిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
