జూన్ 19 నుంచి ఓపెన్ అవుతున్న అమెరికా థియేటర్లు!
on Jun 4, 2020
నార్త్ అమెరికాలో మూడో పెద్ద ఎగ్జిబిటర్ అయిన సినీమార్క్ నాలుగు దశల్లో యుఎస్‌లోని థియేటర్లను ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటి దశ జూన్ 19న (శుక్రవారం) మొదలు కానున్నది. 'టెస్ట్ ఫేజ్' కింద డల్లాస్-ఫోర్ట్ వర్త్ ఏరియాలోని ఐదు థియేటర్లను తెరవనున్నట్లు సినీమార్క్ సీఈఓ మార్క్ జొరాడీ చెప్పారు. రెండో ఫేజ్ కింద ఆ తర్వాతి వారం సినీమార్క్ అధీనంలోని మూడో వంతు థియేటర్లను.. అదీ ఎక్కవ కలెక్షన్లు వచ్చే ప్రధాన మార్కెట్లలో.. తెరుస్తారు. తర్వాతి వారం మరొక మూడో వంతు థియేటర్లను, జూలై 10న నాలుగో దశ కింద మిగతా అన్ని థియేటర్లను ఓపెన్ చేస్తారు. సినీమార్క్ అధీనంలో నార్త్ అమెరికాలో మొత్తం 344 థియేటర్లు ఉన్నాయి.
షెడ్యూల్ ప్రకారం థియేటర్లు ఓపెన్ అయితే జూలై 17న రిలీజవుతున్న వార్నర్ బ్రదర్స్ సినిమా 'టెనెట్'ను పూర్తి స్థాయిలో ప్రదర్శించడానికి వీలవుతుందని జొరాడీ తెలిపారు. ప్రస్తుతం గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం టెక్సాస్‌లోని థియేటర్లలో సీట్ల పరిమతిని 25 శాతానికి తగ్గించారు. టెనెట్ మూవీ రిలీజయ్యే సమయానికి ఈ సీట్ల పరిమితి 50 శాతానికి పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఈలోగా పాత సినిమాలను డిస్కౌంట్ రేట్లకు ప్రదర్శించాలని సినీమార్క్ నిర్ణయించింది. పెద్దలకు 5 డాలర్లు, పిల్లలకు, వృద్ధులకు 3 డాలర్లు డిస్కౌంట్ ఇవ్వాలని అది భావిస్తోంది. భారతీయ సినిమాలకూ.. ప్రత్యేకించి తెలుగు సినిమాకూ ఇది శుభవార్తే.