ENGLISH | TELUGU  

దొంగాట‌ రివ్యూ

on May 8, 2015

క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో ఓ కిక్ ఉంది. కొంచెం క్రైమ్ కొంచెం కామెడీ మిక్స్ చేస్తే.. బండి లాగించేసిన‌ట్టే. ఇలాంటి సినిమాల్లో స్టార్ వాల్యూకి ప‌నిలేదు. సెంటిమెంట్ డైలాగుల డోసు అక్క‌ర్లెద్దు. కానీ ఆ క్రైమ్ కామెడీకి సెంటిమెంట్ ట‌చ్ చేసి.. స్టార్ వాల్యూ క‌లిపిన చిత్రం ఏదైనా ఉందంటే.. అది దొంగాట‌.

ఈ సినిమాలో ప‌ది మంది స్టార్స్ ఉన్నారు. (ఓ పాట‌లో క‌నిపిస్తారు లెండి). దానికితోడు సెంటిమెంట్ కావ‌ల్సినంత ఉంది.. (అనాథ‌ల చుట్టూ అల్లిన క‌థ‌). దానికి కామెడీ, క్రైమ్ జోడించాడు ద‌ర్శ‌కుడు. సో.. దొంటాట‌.. ఓ మిక్స్‌డ్ అనుభూతిని క‌లిగించే చిత్రంగా మిగిలింది.

శ్రుతి (మంచు ల‌క్ష్మి) ఓ స్టార్‌. అమ్మ జ్యోతిల‌క్ష్మి ( ప‌విత్ర‌) శ్రుతికి కావ‌ల్సిన అన్ని విష‌యాలూ ద‌గ్గ‌రుండి చూసుకొంటుంటుంది. శ్రుతిని కిడ్నాప్ చేయ‌డానికి ప్లాన్ చేస్తారు వెంక‌ట్ (అడ‌వి శేష్‌), విజ్జు (మ‌ధు) కాటం రాజు (ప్ర‌భాక‌ర్‌). పుట్టిన రోజు పార్టీ నుంచి శ్రుతిని ఎత్తుకొచ్చేసి ప‌ది కోట్లు డిమాండ్ చేస్తారు. ఈ కేస్ డీల్ చేయ‌డానికి రంగంలోకి దిగుతాడు ప్రైవేట్ డిటెక్టీవ్ బ్ర‌హ్మీ (బ్ర‌హ్మానందం). అయితే బ్ర‌హ్మీ ఇంట్లోనే కిడ్నాప‌ర్లు శ్రుతిని దాచి పెడ‌తారు. ప‌ది కోట్లూ చేతిలో ప‌డిపోతున్నాయ్ అన‌గా.. క‌థ‌లో ఓ కొత్త ట్విస్టు. అదేంటి??  ప‌ది కోట్లు కిడ్నాప‌ర్ల‌కు అందాయా? ఈ కిడ్నాప్ ఆట‌లో ఎవ‌రు ఎవ‌రితో దొంగాట ఆడారు?  అనేదే ఈ సినిమా క‌థ‌.

కిడ్నాప్ డ్రామాకున్న ఎడ్వాంటైజ్ ఏంటంటే... కాస్త ప‌క‌డ్బందీగా రాసుకొంటే స‌రిపోతుంది. ప్రేక్ష‌కుల్ని ఆస‌క్తిగా థియేట‌ర్లో కూర్చోబెట్టొచ్చు. క‌న్‌ఫ్యూజ్ డ్రామా, వినోదం... కొంచెం టెన్ష‌న్ సృష్టించ‌గ‌లిగితే టైమ్ పాస్ అయిపోతుంది. దొంగాట‌కు ఇవ‌న్నీ ప్ల‌స్ అయిపోయాయి. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ బండి ఆడుతూ పాడుతూ సాగిపోతుంది.క‌థంతా ఒకే చోట తిరుగుతున్నా బోరింగ్ అనిపించ‌దు. ఎందుకంటే.. ల‌క్ష్మీ, బ్ర‌హ్మీ, ఫృద్వీ కావ‌ల్సినంత  ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇచ్చేస్తారు. మ‌ధ్య‌లో ల‌క్ష్మి మందు కొట్టి, ఓ పాటేసుకొని ప్రేక్ష‌కుల్ని ప‌రేషాన్ చేసేస్తుంది. సో... క‌థ‌నం హాయిగానే సాగిపోతుంది. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ థ్రిల్ కలిగిస్తుంది. దాంతో ఫ‌స్టాఫ్ చూశాక ప్రేక్ష‌కుడు సంతృప్తికి లోన‌వుతాడు. సాధార‌ణంగా ఇలాంటి క‌థ‌ల‌కు సెకండాఫ్‌లో స్పీడ్ బ్రేక‌ర్లు ప‌డ‌తాయి. దొంగాట‌కూ ఆ బాధ త‌ప్ప‌లేదు. క‌థ‌లో సెంటిమెంట్ ప్ర‌వేశించాక‌.. క‌థ‌నం డ‌ల్ అవుతుంది. బోరింగ్ సీన్స్ ఎంట్రీ ఇస్తాయి. అయితే.. మ‌ళ్లీ క్లైమాక్స్ లో ద‌ర్శ‌కుడు ప‌ట్టుసాధించాడు. ఓ తెలివైన ఎండింగ్ వేసి.. ప్రేక్ష‌కుల ఇగోల్ని సంతృప్తి ప‌రిచాడు.

బ్ర‌హ్మీ, ఫృద్వీ లు క‌ల‌సి ప‌విత్ర‌కు సైట్ వేసే సీన్లు బాగానే న‌వ్విస్తాయి. అక్క‌డ కావ‌ల్సిన‌న్ని సెటైర్లు ప‌డ్డాయి. ఎమోష‌న్ సీన్స్ లో డైలాగులు బాగున్నాయి. మ‌ని, షీ ఈ రెండూ అంద‌రూ కావాల‌నుకొంటారు.. మ‌ని ప్ర‌తి ఎద‌వ ద‌గ్గ‌రా ఉంటుంది. షీ మాత్రం.. మ‌నిషి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉంటుంది. ఇవి రెండూ కావాలంటే మ‌నిషిగా మారు.. అనే డైలాగ్ బాగుంది. నిజానికి క్రైమ్ కామెడీలో ఎమోష‌న్స్ కి పెద్ద‌గా చోటుండ‌దు. కానీ... వాటినీ క‌థ‌లో మిళితం చేయ‌గ‌లిగాడు. పదిమంది స్టార్స్ క‌ల‌సి ఓ పాట‌లో చిందేయ‌డం.. నిజంగా ప్రేక్ష‌కుల‌కు బోన‌స్‌. ఆ పాట‌ని అంద‌రూ బాగా ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. ప‌తాక స‌న్నివేశాల ముందొచ్చే ట్విస్టు.. క్లైమాక్స్‌లో అస‌లు విల‌న్‌ని బ‌క‌రా చేయ‌డం.. ఇవ‌న్నీ బాగున్నాయి. రొటీన్ సినిమాలు చూసే వాళ్ల‌కు దొంగాట ఓ రిఫ్రెష్‌గా క‌నిపిస్తుంది.

మంచు ల‌క్ష్మి కి ఇది డిఫ‌రెంట్ జోన‌ర్‌. అయినా ఇమిడిపోయింది. ఒక విధంగా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. అయితే ఆ షేడ్స్ పెద్ద‌గా క‌నిపించ‌కుండా ఆ బాధ్య‌త మిగిలిన పాత్ర‌ల‌కూ పంచి.. తెలివైన నిర్ణ‌యం తీసుకొంది. త‌న‌లోని డాన్సింగ్ టాలెంట్ చూపించుకోవ‌డానికి ఏందిరో అన్న పాట పెట్టిన‌ట్టు అనిపిస్తుంది. మంచు లుక్ కూడా ఈ సినిమాలో కాస్త కొత్త‌గా క‌నిపిస్తుంది. శేష్‌కి ఇలాంటి పాత్ర‌లు మామూలే. అన్నిర‌కాల షేడ్స్ చూపించే అవ‌కాశం ద‌క్కింది. బ్ర‌హ్మీ, పృథ్వీలు న‌వ్విస్తారు. మిగిలిన పాత్ర‌ల‌న్నీ త‌మ‌వంతు పాత్ర పోషించాయి. మంచు ల‌క్ష్మి పాడిన ఏందిరో విన‌బుల్‌గా ఉంది. అనాథాశ్ర‌మంలో సాగిన పాట బాగున్నా... అంత ఎమోష‌న్ ని భ‌రించే శ‌క్తి మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డిది. నేప‌థ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. త‌క్కువ బడ్జెట్‌లో తీసినా.. క్వాలిటీ మిస్ కాలేదు. బుర్రా సాయిమాధ‌వ్ రాసిన డైలాగులు బాగున్నాయి.

క్లుప్తంగా చెప్పాలంటే దొంగాట ఓ టైమ్ పాస్ సినిమా. థియేట‌ర్లో కూర్చుంటే కొన్ని న‌వ్వులు, కొన్ని ట్విస్టుల‌తో హాయిగా సాగిపోతుంది. న‌టిగా, నిర్మాత‌గా రెండు పాత్ర‌ల్లోనూ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న స‌క్సెస్ అయిన‌ట్టే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.