వయసు తేడా 22 ఏళ్లు.. 54 ఏళ్లుగా చెక్కు చెదరని బంధం!
on Oct 16, 2020
హిందీ చిత్రసీమలో ప్రఖ్యాత నటులుగా పేరుపొందిన దిలీప్ కుమార్, సైరా బాను మధ్య వయసు తేడా 22 సంవత్సరాలు. 54 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆ భేదం ఎన్నడూ వారికి ఓ సమస్య కాలేదు. దిలీప్ కుమార్ జీవితంలో ఒక పిల్లర్ లాగా సపోర్ట్నిస్తూ వచ్చారు సైరా బాను. ఇన్నేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ ఇద్దరూ దేనిమీదా గొడవపడలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. జీవితంలో వారు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి సమయాల్లోనూ వారు ఒకరికొకరు అండగా నిలిచారు. ఇటీవల వారి వైవాహిక జీవితంలో 54వ పెళ్లి రోజు వచ్చింది. ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చిన వాళ్లు ఈసారి మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు.
దానికి ఓ కారణం ఉంది. "నా జీవితంలో అక్టోబర్ 11 అనేది ఎప్పటికీ మోస్ట్ బ్యూటిఫుల్ డే. దిలీప్ సాబ్ నన్ను పెళ్లిచేసుకొని, నా కలలను నిజం చేసిన రోజు. అయితే ఈ సంవత్సరం మేం మా పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోలేదు. మీకు తెలుసు.. దిలీప్ సాబ్ ఇద్దరు సోదరులు అహ్సాన్ భాయ్, అస్లాం భాయ్లను మేం కోల్పోయాం. కొవిడ్-19 మహమ్మారి ఎన్నో జీవితాల్ని బలి తీసుకొని, ఇంకెన్నో జీవితాల్లో దుఃఖాన్ని నింపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరి క్షేమం గురించి ప్రార్థిస్తూ, అందరూ సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం." అని చెప్పారు సైరా బాను.
దిలీప్, సైరా కథ విషయానికొస్తే, వారి మధ్య రాయబారిగా వ్యవహరించింది సైరా తల్లి నసీమ్ బాను. ఆ ఇద్దరినీ పరస్పరం పరిచయం చేసిందీ, ఆ ఇద్దరి మధ్య ప్రేమను పెంపొందింపజేసిందీ ఆమే. ఒకసారి ప్రేమలో పడ్డాక సైరాకు పెళ్లి ప్రపోజల్ తెచ్చారు దిలీప్. 1966లో పెళ్లి జరిగే నాటికి సైరా వయసు 22 ఏళ్లయితే, దిలీప్ వయసు 44 సంవత్సరాలు. ఆ తర్వాత జరిగింది చరిత్ర.