English | Telugu

బిగ్ ఫైట్: 'ఆర్ఆర్ఆర్'ను టార్గెట్ చేస్తున్న 'ఆచార్య'!

on Feb 25, 2020

 

యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'కు ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. రాజమౌళి మునుపటి బ్లాక్‌బస్టర్ మూవీస్ 'బాహుబలి', 'బాహుబలి 2'లను చాలా వెనక్కి నెట్టేలా 'ఆర్ఆర్ఆర్' మూవీకి ప్రి బిజినెస్ జరిగింది. 'బాహుబలి 2' వంటి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై అందరి దృష్టీ ఉండటం సహజం. దానికి తగ్గట్లే ఒక్క ఇండియాలోనే 400 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డుల్లోకి ఎక్కింది. అదీ రాజమౌళికి ఉన్న క్రేజ్. ఇద్దరు మాస్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తుండటం ఆ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. అసలు సిసలు మల్టీస్టారర్‌గా ఆ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు ఉరకలు వేస్తోంది. మొదట జూలై 30న విడుదల చేయాలనుకున్న ఆ మూవీని 2021 జనవరి 8న రిలీజ్ చెయ్యాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించారు.

ఈ మార్పు కొంతమంది స్టార్ల సినిమాలకు విఘాతంగా మారింది. వాటిలో చిరంజీవి సినిమా 'ఆచార్య' కూడా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మొదట ఆగస్టులో విడుదల చెయ్యాలనుకున్నారు. తర్వాత దసరా సీజన్ అయితే బెటర్ అనుకున్నారు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఇటు మహేశ్, అటు అల్లు అర్జున్ కెరీర్లలో బిగ్గెస్ట్ గ్రాసర్స్‌గా నిలవడంతో చిరంజీవి దృష్టి సంక్రాంతి సీజన్‌పై పడింది. 'ఆచార్య'ను సంక్రాంతికి తీసుకొస్తే బాక్సాఫీసును మరింతగా కొల్లగొట్టవచ్చనే అభిప్రాయానికి వచ్చిన ఆయన, అదే అభిప్రాయాన్ని నిర్మాతలైన రాంచరణ్, నిరంజన్ రెడ్డిలతో పంచుకున్నారు. వారు కూడా ఓకే అన్నారు. అందుకు అనుగుణంగా సినిమాని పూర్తి చెయ్యడానికి కొరటాల శివ కూడా సరేనన్నాడు. కానీ జూలై బదులు దసరా సెలవుల్లో వస్తుందని ఇండస్ట్రీ అంతా ప్రచారం జరుగుతూ వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాను అనూహ్యంగా సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు రాజమౌళి బృందం ప్రకటించడంతో 'ఆచార్య' బృందం అవాక్కయ్యింది.

ఇక 'ఆచార్య' దగ్గర ఉన్న ఆప్షన్స్ మూడు. ఒకటి- 2020 దసరా సీజన్‌కు రావడం, రెండు- 2021 వేసవిలో విడుదల కావడం, మూడు- 2021 సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్'తో పోటీపడటం. ఎప్పుడూ సినిమాల్లో నంబర్ వన్‌గా ఉండేందుకే ఇష్టపడే చిరంజీవి.. 'ఖైదీ నంబర్ 150'తో రీ ఎంటీ ఇచ్చి, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవడంతో లభించిన ఉత్సాహం, ఉత్తేజంతో 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ చేశారు. దానితో 'బాహుబలి' రికార్డుల్ని బద్దలు కొట్టాలని ఆశించారు. కానీ ఆ ప్రయత్నం ఫెయిలైంది. ఇప్పుడు 'ఆచార్య'తో ఆ ఫీట్ చెయ్యాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ 'బాహుబలిని 2'ను మించి 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన క్రేజ్, దానికి రికార్డ్ స్థాయిలో జరిగిన ప్రి బిజినెస్ చూసిన ఆయన, 'ఆచార్య'కు సైతం ఆ తరహా క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 

అందుకే మొదట.. సినిమాలోని ఒక కీలకపాత్రను రాంచరణ్‌తో చేయించాలని ఆయన భావించారు. చరణ్ ఆ క్యారెక్టర్ చేస్తే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 'ఆచార్య'కు మరింత బూస్ట్ లభిస్తుందనుకున్నారు. చరణ్ కూడా ఆ క్యారెక్టర్ చెయ్యడానికి సరేనన్నాడు. కానీ అతని ఆశలకు రాజమౌళి చెక్ పెట్టాడు. అగ్రిమెంట్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తయ్యే దాకా మరో సినిమా చెయ్యడానికి వీల్లేదని తేల్చేశాడు. దాంతో గత్యంతరం లేని స్థితిలో 'ఆచార్య'లో నటించే ఆలోచనను విరమించుకున్నాడు చరణ్. ఈ వ్యవహారం చిరంజీవికి ఆగ్రహం తెప్పించిందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చరణ్ విషయంలో రాజమౌళి పెట్టిన ఆంక్షలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదనీ, అందుకే మరో బిగ్ స్టార్‌తో ఆ క్యారెక్టర్ చేయించి, 'ఆచార్య'కు రాజమౌళి ఊహించనంతటి క్రేజ్ తీసుకు రావాలని భావించారని తెలుస్తోంది.

తన బదులు ఆ స్పెషల్ క్యారెక్టర్‌ను అల్లు అర్జున్‌తో చేయించాలని చరణ్ తలచాడు. మాస్‌లో బన్నీకి ఉన్న ఇమేజ్, ఇటీవల 'అల.. వైకుంఠపురములో' సాధించిన బ్రహ్మాండమైన విజయం 'ఆచార్య'కు లాభం చేకూరుస్తాయని అతను అనుకున్నాడు. కానీ చరణ్ సూచనను చిరంజీవి తిరస్కరించారు. మహేశ్ నటిస్తే వచ్చే క్రేజ్ వేరని ఆయన కొడుక్కి చెప్పాడు. ఒక మెగాస్టార్, ఒక సూపర్‌స్టార్ కలిసి నటిస్తే, 'ఆచార్య' క్రేజ్ డబుల్ అవుతుందని ఆయన చెప్పడంతో చరణ్‌కూ ఆ ఆలోచన నచ్చింది. అయితే ఇంతదాకా మరో హీరో సినిమాలో స్పెషల్ రోల్ చేయని మహేశ్.. ఈ క్యారెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుంటాడా? అని అతను సందేహపడ్డాడు. కానీ అతని సందేహాలు పటాపంచలు చేస్తూ ఆ క్యారెక్టర్ చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చిరంజీవి ఫోన్ చేసి, విషయం చెప్పి, కొరటాలను మహేశ్ వద్దకు పంపించారు. మహేశ్‌కు సన్నిహితుడైన కొరటాల ఆ క్యారెక్టర్ చెప్పగానే ఎక్కువ సమయం తీసుకోకుండా సరేననేశాడు మహేశ్. దీంతో చిరంజీవి చాలా ఆనందపడ్డారు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకూ ఆనందమేనని అతను చెప్పాడు. మహేశ్‌కు అధిక రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా, అతను దానికంటే తక్కువ తీసుకోవడానికే మొగ్గుచూపాడు.

'ఆచార్య'లో మహేశ్ రాకతో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. మెగాస్టార్, సూపర్‌స్టార్ కలిసి నటిస్తున్న తొలి సినిమాగా 'ఆచార్య' మూవీకి రాత్రికి రాత్రే మహా మహా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఎదురవుతోంది. అది.. 'ఆచార్య'ను ఎప్పుడు విడుదల చెయ్యాలి?.. అని. 'ఆర్ఆర్ఆర్'కు పోటీగా సంక్రాంతికే తీసుకురావాలని చిరంజీవి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ జనవరి 8 శుక్రవారం రిలీజవుతోంది కాబట్టి జనవరి 10 ఆదివారం 'ఆచార్య'ను విడుదల చేస్తే బాగుంటుందనేది ఆయన ఆలోచన. ఈ సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' విడుదలైంది కూడా ఆదివారమే (జనవరి 12) కావడాన్ని ఆయన ఉదహరిస్తున్నారు. కానీ చరణ్ మాత్రం.. కుదిరితే దసరాకు, లేదంటే 2021 సమ్మర్‌కు 'ఆచార్య'ను విడుదల చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాడు. ఏదేమైనా ఇప్పుడు చిరంజీవి టార్గెట్ 'బాహుబలి 2' కాదు, 'ఆర్ఆర్ఆర్'. అందుకే 'ఆచార్య' మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆయన తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 'ఆర్ఆర్ఆర్' వర్సెస్ 'ఆచార్య' కథ మరింత రసవత్తరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


Cinema GalleriesLatest News


Video-Gossips