మహేశ్ ముఖ్యమంత్రి గెటప్ అదిరింది!
on Oct 6, 2017
‘స్పైడర్’ మహేశ్ అభిమానుల్లో అసంతృప్తిని మిగిల్చింది. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఇలా వరుస పరాజయాలను సూపర్ స్టార్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి బాధను కాస్త అయినా.. ఉపశమింపజేయాలని ఎవరో మహానుభావుడు అనుకున్నట్టున్నాడు... అందుకే... ఏకంగా... కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న ‘భరత్ అను నేను’ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ని లీక్ చేసేశాడు. దాన్నే ఫస్ట్ లుక్ అనుకొని అభిమానులు పరవశించిపోతున్నారు. ఆ లీకువీరుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు కూడా. ఈ పరిణామంపై కొరటాల శివ మాత్రం అంతెత్తు లేచాడు. ‘దయచేసి ఇలాంటి పనులు చేయకండి.. ఇలాంటి ఎంకరైజ్ చేయడం కూడా మంచిది కాదు..’ అని ట్విటర్ లో లబోదిబో అన్నాడు.
‘భరత్ అను నేను’లో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టే ఈ స్టిల్ లో... నీట్ గా టక్ చేసుకొని యువనేతగా... అడ్మనిస్ట్రేటర్ లా.. ఠీవీగా నడుచుకుంటూ వస్తున్నాడు మహేశ్. అటు, ఇటు ఇద్దరు గన్ మేన్లు. వెనుక మరో అంగరక్షుడు.. పక్కనే బ్రహ్మాజీ. చూడగానే... కళ్లు తిప్పుకోలేనంత హ్యాండ్ సమ్ గా ఉన్నాడు మహేశ్. నిజంగా ప్రిన్స్ అభిమానులకు ఇది పెద్ద సర్ ప్రైజే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా బాలీవుడ్ నటి కైరా అడ్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో కొంతభాగం చిత్రీకరణ జరిగింది.
మహేశ్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ గత రికార్డులన్నింటినీ తుడిచేసి... భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఆ సినిమాను మించే స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ కథపై కొరటాల కూడా గట్టి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. మరి సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం ఎన్ని మేజిక్కులు చేస్తుందో చూడాలి.