అల్లరోడికి పూరితో సినిమా చేయాలనుంది
on Apr 22, 2020
కామెడీ క్యారెక్టర్ లకు హీరో స్థాయికి తీసుకొచ్చిన నటులలో 'అల్లరి' నరేష్ ఒకరు. తెరపై అతడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వినోదం తో ప్రేక్షకులకు కితకితలు పెట్టగలడు. అదే సమయంలో సీరియస్ పాత్రలు ఇస్తే ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించగలడు. కొంతకాలంగా సరైన విజయాలు లేక రేసులో వెనుకబడిన అల్లరి నరేష్... 'నాంది' చిత్రంతో తానేంటో చూపిస్తానని, తన ప్రతిభను నిరూపించుకుంటానని ధీమాగా చెబుతున్నాడు. అంతేకాదు... ఆ సినిమాతో ఇండస్ట్రీలో అల్లరి నరేష్ 2.0 చూస్తారని చెబుతున్నాడు. సినిమాలో క్యారెక్టర్, అందులో అతడి నటన ఆ రేంజ్ లో ప్రేక్షకులకు షాక్ ఇస్తుందట.
హీరోగా అల్లరి నరేష్ 50 చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. పలువురు దర్శకులతో పనిచేసాడు. అయితే... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పనిచేయాలని ఉందని అతడు చెప్పుకొచ్చాడు. "నేను పూరికి పెద్ద అభిమానిని. ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను" అని అల్లరి నరేష్ చెప్పాడు. పూరి గారు వింటున్నారా? ప్రస్తుతం ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో... తన ఇమేజ్ నుండి బయటకు వచ్చి విభిన్న పాత్రలు చేయాలని ఉందని, అవసరమైతే డార్క్ రోల్స్ చేస్తానని, వెబ్ సిరీస్ లు చేయడానికి సిద్ధమని అల్లరోడు అన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
