English | Telugu

2018 అయినా వీరిని గట్టెక్కిస్తుందా?

on Dec 31, 2017

2017 చాలామందికి మరిచిపోలేని సంవత్సరం. ఎందుకంటే... విజయం పేరే మరిచిపోయిన వారు సైతం ఈ ఏడాది విజయాలను అందుకున్నారు. పదేళ్ల తర్వాత 2017లో ‘ఖైదీ నంబర్ 150‘గా మన ముందుకొచ్చిన మెగాస్టార్... బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. బ్లాక్ బస్టర్  ‘లెజెండ్ ’ తర్వాత లయన్, డిక్టేటర్.. అని వరుసగా రెండు డిజాస్టర్స్ ఇచ్చాడు బాలయ్య. ఆ విధంగా కష్టాల్లో ఉన్న ఈ నందమూరి అందగాడ్ని కూడా  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపంలో ఆదుకుంది 2017వ సంవత్సరమే. 

ఎప్పుడో పదేళ్ల క్రితం ‘గోరింటాకు’ రూపంలో హిట్ అదుకున్న రాజశేఖర్... దాదాపు పదేళ్ల విరామం తర్వాత ‘గరుడ వేగ’తో  2017లోనే హిట్ ఇచ్చాడు. అలాగే.. దర్శకుడు తేజ కూడా. తనైతే... ‘జయం ’ తర్వాత హిట్ ఎరుగడు. ఆ సినిమా వచ్చి పధ్నాలుగేళ్ల అయ్యింది. అంత సుదీర్ఘ విరామం తర్వాత 2017లోనే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇవేనా... ఇంకా వరుస విజయాలు అందుకుంటున్న హీరోలకు సైతం భారీ విజయాలిచ్చింది 2017. కానీ.. కొందరు హీరోలు మాత్రం ఇంత లక్కీయాస్ట్ ఇయర్ లో కూడా విజయాలను అందుకోలేకపోయారు. వారే... అల్లరి నరేశ్, మంచు మనోజ్, మంచు విష్ణు, రామ్, సునీల్.

అల్లరి నరేశ్ కి 2013లో వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత సరైన హిట్ లేదు.
మంచు విష్ణుకి  2013లో వచ్చిన ‘దూసుకెళ్తా’ తర్వాత సరైన హిట్ లేదు.
మంచు మనోజ్ కి 2010లో వచ్చిన ‘బిందాస్ ’ తర్వాత సరైన హిట్ లేదు.
సునీల్ కి 2012లో వచ్చిన ‘పూలరంగడు’ తర్వాత సరైన విజయం లేదు.

ఈ నలుగురితో పోలిస్తే.. హీరో రామ్ కాస్త బెటర్. తనకు 2016లో ‘నేను శైలజ’ పేరుతో మంచి హిట్ వచ్చింది. అయితే... కెరీర్ మొదలై పదేళ్లు దాటుతున్నా... అడపా దడపా విజయాలు పలకరించడం రామ్ విషయంలో బాధాకరం. ‘దేవదాసు’  చేసిన రెండేళ్లకు ‘రెడీ’ రూపంలో హిట్ వచ్చింది. ‘రెడీ’ చేసిన మూడేళ్లకు ‘కందిరీగ’ రూపంలో మరో హిట్ వచ్చింది. ఆ సినిమా వచ్చిన నాలుగేళ్ల విరామం తర్వాత ‘నేను శైలజ’ రూపంలో హిట్ వచ్చింది. చేయడానికి పదిహేను సినిమాలు చేశాడు. హిట్లు మాత్రం నాలుగే. 2017 కూడా మనోడికి హిట్ ఇవ్వలేక లేకపోయింది. ఈ ఏడాది విడుదలైన ‘ఉన్నది ఒకటే జిందగీ’ కూడా డిజాస్టర్ అయి కూర్చుంది.

స్టార్ హీరోల పరిస్థితి వేరు. వారికి విశేషమైన అభిమాన గణం ఉంటుంది. వారి సినిమాలు ఫ్లాపులైనా మోయడానికి.. మరో సినిమా చూడ్డానికి అభిమానులు రెడీగా ఉంటారు. మరి స్టార్ ఇమేజ్ లేక.. విజయాలూ రాక.. కెరీర్ ని నెట్టుకురావడం అంటే.. తేలికైన విషయం కాదు. పాపం...కోటి ఆశలతో 2018లోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఆ వచ్చే ఏడాదైనా ఈ అయిదుగురు హీరోలకూ కలిసొస్తుందో లేదో చూడాలి.

2018లో వచ్చే రామ్ సినిమాకు... నక్కిన  త్రినాథరావు దర్శకుడు. మరి ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. రామ్ ను కూడా సక్సెస్ ట్రాక్ లో నిలబెడతాడా?.

2018లోనే మంచు విష్ణు... ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా విడుదల కానుంది. అంతేకాదు... 2018లోనే ‘ఓటర్’ అనే అ సినిమాలో నటించనున్నాడు విష్ణు. హిస్టారికల్ మూవీ ‘కన్నప్ప’ కు కూడా 2018లోనే కొబ్బరి కాయ కొట్టనున్నాడు. మరి ఈ సారైనా మనోడు హిట్ కొడతాడా?

అల్లరి నరేశ్, మంచు మనోజ్, సునీల్ ల భవితవ్యం అయితే... అగమ్య గోచరం. 2018 అయినా వీరిని ఆదుకుంటుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  

గాడ్ బ్లెస్ యూ మైడియర్ హీరోస్.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here