ఇంకో 20 ఏళ్లు మీ ప్రేమ కావాలి - మహేష్
on May 2, 2019
సూపర్ స్టార్ మహేష్ హీరోగా వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పి.వి.పి సినిమా బేనర్స్ పై హై టెక్నికల్ వేల్యూస్ తో రూపొందుతోన్న చిత్రం `మహర్షి`. మహేష్ కు ఇది 25 వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మే 9న విడుదలవుతోన్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిపారు . సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ...`` మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయన్ను ఇష్టపడ్డంతగా ఎవరినీ ఇష్టపడను. ఆయన ఏ ఫంక్షన్ కు వెళ్లినా అది సూపర్ హిట్ అంటారు. ఇక యంగ్ జనరేషన్ హీరోల్లో విజయ్ ను ఎక్కువగా అడ్మైర్ చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాలో తన నటన నాకు బాగా నచ్చింది. ఈ ఇరవై ఐదు సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేసారు.
అలాగే మురారి సినిమా ఇచ్చిన కృష్ణ వంశీ, ఒక్కడు చేసిన గుణ శేఖర్ అలాగే నన్ను అతడు చిత్రంతో యుఎస్ ఆడియన్స్ కు పరిచయం చేసిన త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. ఇక నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే దూకుడు సినిమానే. అంత మంచి సినిమా ఇచ్చిన శ్రీనువైట్ల గారికి థ్యాంక్స్. ఇక శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో రెండు సార్లు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్స్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక మహర్షి చేస్తోన్న వంశీ నా తమ్ముడు లాంటి వాడు. వంశీ ఇచ్చిన 20 నిమిషాల నేరేషన్ ఇచ్చాక సినిమా చేయాలని ఫిక్సయ్యా. కానీ , రెండు సినిమాల తర్వాతే ఈ సినిమా చేయగలననీ చెప్పా. అయిన వెయిట్ చేస్తానన్నారు. అలాగే నాకోసం వెయిట్ చేసాడు. సినిమాలో నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేసారు. ఇక దేవిశ్రీ నా సినిమాకు ఆర్ ఆర్ చేస్తున్నాడంటే నేను రిలాక్స్ అయిపోతాను. మా ముగ్గురు నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చేసారు. నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ 25 సినిమాల జర్నీలో ప్రేక్షకులు, అభిమానులు చూపించిన అభిమానానికి చేతెలెత్తి దండం పెడుతున్నా.ఈ అభిమానం, ప్రేమ మరో పాతిక సినిమాలు, 20 ఏళ్లు ఉండాలని ఆశిస్తున్నా... అన్నారు.