2018 ఆ సినిమాలతో మొదలు
on Dec 24, 2017
సినిమాలకి అతి పెద్ద సీజన్స్ లో సంక్రాంతి ప్రముఖమయినది. స్టార్ హీరోలు పండగ సెలవుల్ని పూర్తిగా వినియోగించుకునేందుకు, తమ సినిమాల్ని ఆ టైం లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. 2018 సంక్రాంతి కి గాను, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహ చిత్రాలతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో నిర్మాతలకి కాసుల పంట పండించాయి. అయితే, 2018 జనవరి లో ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. మొత్తంగా 2018 జనవరి లో ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం...
1.అజ్ఞాతవాసి:
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి పైన అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. తన సినిమాల్ని ఎక్కువగా వేసవిలో విడుదల చేయడానికి ఇష్టపడే పవన్, ఈ సారి తెలుగు వారికి పండగ కానుకగా అజ్ఞాతవాసి ఇస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
2.జై సింహ:
పైసా వసూల్ తో నిరాశ పరిచిన బాలకృష్ణ, జై సింహ అంటూ మరో మాస్ సినిమాతో వస్తున్నాడు. టీజర్ రొటీన్ గా ఉన్నా, సినిమా లో విషయం ఉంది అంటున్నారు చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కి ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
3.రాజుగాడు:
వరుస ఫ్లాప్ లతో సతమతవవుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త ఏడాది రాజుగాడుతో పలకరించనున్నాడు. అప్పుడెప్పుడో మొదలయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగింది. మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న రాజుగాడు ని సంక్రాంతి విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, జనవరి చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
4.భాగమతి:
బాహుబలి తో దేశం చూపు తన వైపు తన వైపు మరల్చుకున్న అనుష్క శెట్టి భాగమతి తో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్దమవుతుంది. పిల్ల జమీందార్ ఫేమ్ జీ. అశోక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 26 కి విడుదలవనుంది. టీజర్ తో ఆసక్తి పెంచేసిన భాగమతి లో గ్రాఫిక్స్ హైలైట్ అంటున్నారు.
5.టచ్ చేసి చూడు:
రాజా ది గ్రేట్ తో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న రవితేజ, తన పుట్టిన రోజుకి, అనగా జనవరి 26 కి టచ్ చేసి చూడు తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో మాస్ మెచ్చే అంశాలు అన్నీ పుష్కలంగా ఉంటాయట. చూద్దాం 2018 రవితేజకి ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో!