‘పైసా వసూల్’ కథ ఇదే. ఫ్యాన్స్కి పండగే..పండగ..!
on Aug 31, 2017
బాలయ్య... ఓ హిట్ కొట్టిన తర్వాత వెంటనే మరో హిట్ కొట్టి 23 ఏళ్లయ్యిందంటే నమ్ముతారా? అవును... ‘బంగారు బుల్లోడు’ తర్వాత వెంటనే ‘భైరవద్వీపం’ రూపంలో మరో హిట్ కొట్టారు బాలయ్య. ఇది జరిగింది 1994లో. ఆ తర్వాత హిట్లయితే ఉన్నాయ్ కానీ... ఒకదాని తర్వాత మరో హిట్ అయితే మాత్రం లేదు. అఫ్ కోర్స్.. ఒకే ఏడాది వరుసగా ఆరు హిట్లిచ్చిన హిస్టరీ కూడా బాలయ్యకే ఉందనుకోండి. ఇప్పటికీ చెరగని రికార్డది. అయితే... అదంతా గతం. ఇప్పటి పరిస్థితి మాత్రం ఇదే.
రీసెంట్ గా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ రూపంలో గ్రాండ్ సక్సెస్ ని అందుకున్నారు బాలయ్య. ఆ తర్వాత విడుదలవుతున్న సినిమా ‘పైసావసూల్’. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? బాలయ్య... ఈ దఫా అయినా.. సెకండ్ హిట్ కొడతాడా? లేదా?’.. అనే ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది. వంద సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ‘ఇక నుంచి కథల ఎంపికలో కొత్తగా వెళతా. అభిమానుల్ని నిరాశ పరచను’ అని స్టేట్మెంట్ ఇచ్చారు బాలయ్య. అందుకు తగ్గట్టే తర్వాతి సినిమాకు పూరీ జగన్నాథ్ ని దర్శకునిగా ఎంచుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? పూరీ ఎలాంటి కథను బాలయ్య కోసం ఎంచుకున్నాడు? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్నలు.
వీటి గురించి ‘తెలుగు వన్’ కి ఓ ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ఆ వివరాలు మీకోసం.
ట్రైలర్ను బట్టి ఇందులో బాలయ్య కేరక్టర్ పేరు ‘తేడా సింగ్’. పేరుకు తగ్గట్టే ‘తేడా’గా అనిపిస్తున్నాడు. రఫ్ గా, స్టైలిష్ గా... అండర్ వరల్డ్ లో కింది స్థాయి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కానీ... పూరీ చెప్పడమేమో... ‘ఇందులో బాలయ్య అండర్ వరల్డ్ డాన్ గా కనిపిస్తారు’ అని. అసలు ఆ బిహేవియర్ చూస్తే...‘డాన్’ అని ఎవరైనా అంటారా?. ‘మందేసిన మదపుటేనుగునురా..’, ‘రామకృష్ణ స్టూడియోస్ గల్లీల్లో పెరిగా.. నాది నేల టికెట్ బ్యాచ్’, ‘శవాన్ని లేపి మరీ చంపేస్తా’.. కీరాయి తీసుకొని హత్యలు చేసేవాడి డైలాగులు ఇవన్నీ. మరి ఇందులో బాలయ్య డాన్ కాడా? అనే అనుమానం ఎవరికైనా రావొచ్చు.
నిజమే... బాలయ్య ఇందులో అండర్ వరల్డ్ కు చెందిన వాడే కాదట. తను ఓ సిన్సియర్ పోలీస్ అధికారి. అది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. మనం ట్రైలర్స్ లో చూస్తున్న హంగామా అంతా ఫస్టాప్. సెకండాఫ్ మొత్తం సీరియస్ మోడ్ లో ఉంటుందని టాక్. ఓ విధంగా ‘బిజినెస్ మేన్’లో మహేశ్ కేరక్టర్.. పోలీస్ అయితే ఎలా ఉంటుంది? అనేదే ‘పైసా వసూల్’ సినిమా అట. విశ్వసనీయ సమాచారం ఏంటంటే... ప్రథమార్థం మొత్తం ఇది పూరీ సినిమా. ద్వితీయార్థం మొత్తం ఇది బాలయ్య మార్క్ సినిమా. గతంలో ఆయన పోలీస్ గా చేసిన రౌడీ ఇన్ స్పెక్టర్, లక్ష్మీనరసింహ సినిమాలు గుర్తొస్తాయట సెకండాఫ్ లో. అభిమానులూ.. ఇక పండగ చేసేసుకోండి.