వాళ్ల రాకకు కారణం.. ఈ కాంబినేషనే
on Aug 30, 2017
పూరీ జగన్నాథ్ హీరోలు... ఇడియట్లు, పోకిరీలు, లోఫర్లు.. నేనింతే అనే మెంటాలిటీతో ఉంటారు. స్ట్రయిట్ ఫార్వాడ్ అనేది వాళ్ల హిస్టరీలో కనిపించదు. వంకరటింకరగా వెళ్లడమే వాళ్లకు తెలుసు. ఇక బాలకృష్ణ... ఈయన ఎందులో కనిపించినా స్ట్రయిట్ ఫార్వాడ్. చెప్పి కొట్టడం, కొట్టి చెప్పడం... ఇదే ఆయన కేరక్టర్లలో కనిపించేది. కత్తులతో కాదు... కంటి చూపుతోనే చంపేసే అసాధారణ హీరోయిజం తెరపై బాలయ్యది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిశారు. మరి బాలయ్య స్టైల్లోకి పూరీ వచ్చాడా? పూరీ స్టైల్లోకి బాలయ్య వెళ్లాడా?... ‘పైసా వసూల్’ ట్రైలర్ చూసిన ఎవరైనా.. రెండో దానికే ఓటేస్తారు.
మరి బాలయ్య... పూరీ స్టైల్లో అభిమానుల్ని మెప్పిస్తాడా? అనేది ఒకటో తారీకుతో తేలిపోతుంది. అసలు పూరీ జగన్నాథ్, బాలకృష్ణ సరైన కాంబినేషనేనా? అనేది ఇప్పుడు ముచ్చట. పూరీ సినిమాల్లో హీరోలందరూ... ఒకేలా ప్రవర్తిస్తారు. ఇంకా మాట్లాడితే... పూరీలాగే బిహేవ్ చేస్తారు. తాను సృష్టించే పాత్రల ద్వారా తనను తాను చూసుకోవడం పూరీ స్టైల్. ఏ... హీరోతో సినిమా చేయనీయండి.. ఆ హీరో.. పూరీలా మారిపోవాల్సిందే. చిన్న ఉదాహరణ చెప్పనా? ‘తొలి ప్రేమ’ దాకా పవన్ కల్యాణ్ సినిమాలు చూడండి. తర్వాత ‘బద్రి’ చూడండి. ఆ తేడా ఏంటో అర్థమవుతుంది. అప్పటిదాకా పవన్ లో కనిపించని కొత్త యాంగిల్ ‘బద్రి’లో కనిపిస్తుంది. ఆ యాంగిలే పేరే... ‘పూరీ జగన్నాథ్’. ఆ తర్వాత పూరీ తీసిన ప్రతి సినిమాల్లో ఆ యాంగిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. హీరోలు మారుతున్నారంతే. ఇప్పుడు బాలయ్య వంతు. ఇక బాలయ్య... మహామహుల దర్శకత్వంలో నటించిన నటుడు. ఎన్టీయార్, కె.విశ్వనాథ్, బాపు, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ.. లాంటి గొప్ప దర్శకులతో పనిచేసిన అనుభవం బాలయ్యది. నీళ్లు ఏ పాత్రలో పోస్తే.. ఆ పాత్ర రూపును సంతరించుకున్నట్లు... ఏ పాత్ర పోషిస్తే.. ఆ పాత్రగా మారిపోవడం వీరి నుంచే నేర్చుకున్నాడు బాలయ్య. సో... పూరీ స్టైల్లోకి మారడం ‘నటసింహం’కి పెద్ద పనేం కాదు. ‘పైసా వసూల్’ ట్రైలర్ లో మునుపటి బాలయ్య కనిపించలేదంటే కారణం అదే. రేపు సినిమా ఎలాగైనా ఉండొచ్చు.. కానీ... బాలయ్య యాక్టింగును మాత్రం జనాలు ఎంజాయ్ చేస్తారు. అందులో నో డౌట్. సో... వీరిద్దరిదీ సరైన కాంబినేషనే. బాలయ్య 101వ సినిమా ఇది. ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య చెప్పినట్టు ‘హిస్టరీ రిపీట్...’ అనమాట. దానికి తగ్గట్టే... ట్రైలర్లలో కొత్త నటుడు కనిపిస్తున్నాడు. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాను ఎలాగూ విరగబడి చూస్తారు. పూరీ ఫ్యాన్స్ సంగతి సరేసరి. అలాగే... పూరీ స్టైల్ లో బాలయ్య ఎలా ఉంటాడో చూడాలని వచ్చే తటస్త ప్రేక్షకులు కూడా రేపు థియేటర్లకు రాబోతున్నారు. వీరి రాకకు కారణం.. కేవలం ఈ కాంబినేషన్.