గౌతమి పుత్ర... ప్లస్సులూ మైనస్సులూ ఇవే!
on Jan 5, 2017
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైపోయింది. బాలయ్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిదే. విడుదలకు ముందే ఈ చిత్రం భారీ టేబుల్ ప్రాఫిట్ సంపాదించుకొంది. రిలీజ్ అయ్యాక బాలయ్య సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా ధీమాగా ఉన్నారు. ఈరోజే బాలయ్య సినిమా సెన్సార్ ముంగిటకు వెళ్లబోతోంది. మరి ఈ సినిమా ప్లస్సులు, మైనస్సులమాటేంటి?? ఈ సినిమా ఎలా ఉండబోతోంది. తెలుగు వన్‌కి అందిన కీలక సమాచారం ప్రకారం గౌతమి పుత్ర ప్లస్సులు, మైనస్సులూ ఇవే..
ముందుగా ప్లస్సుల గురించి మాట్లాడుకొంటే... క్రిష్ ఎంచుకొన్న కథా, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. దేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన తొట్టతొలి తెలుగు చక్రవర్తి కథ ఇది. గౌతమి పుత్ర గురించి తెలుసుకొన్నది చాలా తక్కువ. తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చెందిన చక్రవర్తి కథ తెలుగువాళ్లంతా తెలుసుకోవడం ధర్మం. ఆ సెంటిమెంట్ ఈ చిత్రానికి కొండంత రక్ష.
నందమూరి బాలకృష్ణ నటుడిగా ఈ చిత్రంలో విశ్వరూపం చూపించార్ట. అన్ని ఎమోషన్లనీ చాలా అద్భుతంగా పండించాడని, బాలయ్య నటనలో కచ్చితంగా ఓ కొత్త మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందని, ఇది వరకు చూడని బాలకృష్ణని క్రిష్ ఈ చిత్రంలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. బాలకృష్ణ - హేమా మాలిని, బాలకృష్ణ - శ్రియలమధ్య తెరకెక్కించిన ఎపిసోడ్స్ కంటతడి పెట్టించేలా సాగాయట. తెలుగుజాతి ఖ్యాతి, గౌరవం గురించి, ఉగాది ప్రాముఖ్యత గురించీ బాలయ్య చెప్పిన డైలాగులు వన్స్‌మోర్ అనిపించేలా ఉంటాయట.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా ఓ విజువల్ వండర్ గా క్రిష్ తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుందట. యుద్ధ సన్నివేశాలు బాహుబలి అంత కాకపోయినా.. క్రిష్ తన బడ్జెట్‌కు తగ్గట్టుగా అద్భుతంగానే రూపొందించాడని చెబుతున్నారు. పతాక సన్నివేశాలు ఈ సినిమా స్థాయిని పెంచేశాయని.. గౌతమి పుత్ర మేజర్ హైలెట్స్‌లో అదే కీలకమని తెలుస్తోంది.
ఇక మైనస్‌ల విషయానికొస్తే.. సినిమా మొత్తం సీరియస్‌గా సాగడం ప్రధానమైన మైనస్ అట. బాలయ్య గెటప్ బాగున్నా... వయసు మీరిన విషయం తెలుస్తూనే ఉందట. ఆయన ఆహార్యం విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేది అనిపించిదని సమాచారం. కొన్ని సీన్లని చుట్టేశారన్న ఫీలింగ్ కలిగించార్ట. వాస్తవాలు ఎలా ఉన్నా.. వాటిని మరీ డ్రమెటిక్‌గా తీర్చిదిద్దారని దాంతో ఏది నిజమో, ఏది కల్పనో తెలియని అయోమయ స్థితి కలగడం ఖాయమని అంటున్నారు.
మొత్తానికి గౌతమి పుత్ర శాతకర్ణికి బాలయ్య ఇమేజ్ కొండంత అండగా నిలవడం ఖాయం. అదే.. ఈ సినిమాని విజయతీరాలకు చేర్చుతుందని ఆశిద్దాం.