English | Telugu

'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ

on Jan 11, 2020

 

సినిమా పేరు: సరిలేరు నీకెవ్వరు
తారాగణం: మహేశ్, విజయశాంతి, రష్మికా మందన్న, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, సంగీత, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, అజయ్, రాజీవ్ కనకాల, జయప్రకాశ్‌రెడ్డి, హరితేజ, బండ్ల గణేశ్, సత్యదేవ్, రఘుబాబు, తమన్నా (స్పెషల్ అప్పీరెన్స్)
పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, దేవి శ్రీప్రసాద్
సంగీతం: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్
ఫైట్స్: రామ్‌-లక్ష్మణ్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
బ్యానర్స్: ఎంబి ఎంటర్‌టైన్మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్
విడుదల తేదీ: 11 జనవరి 2020

సూపర్ హిట్ల మీదున్న మహేశ్, అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా వస్తున్నదంటే.. అంచనాలకు కొదవేముంటుంది! పైగా పదమూడేళ్ల తర్వాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన సినిమా కూడానాయె! అందుకే విడుదలయ్యే సమయానికి 'సరిలేరు నీకెవ్వరు'పై అంచనాలు అంబరాన్ని చుంబించాయి. దేవి శ్రీప్రసాద్ స్వరాలు కూర్చిన పాటలు కూడా సంగీత ప్రియుల హృదయాల్లో చోటు దక్కించుకోవడం కూడా సినిమాపై బజ్‌ను పెంచింది. ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో, ట్రేడ్‌లో క్రేజీ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న ఆ సినిమా ఎలా ఉంది? మహేశ్, విజయశాంతి పాత్రలు ఎలా వున్నాయి? ఆ పాత్రల్లో వారెలా కనిపించారు?.. 

కథ
కర్నూలులో మినిస్టర్ నాగేంద్ర (ప్రకాశ్‌రాజ్) చేసే అరాచకాలకు అడ్డు చెప్పడమంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవడమే. కానీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) మాత్రం అతనికి ఎదురు తిరుగుతుంది. కూతురి పెళ్లి పనుల్లో ఉన్న ఆమెను కాలేజీ నుంచి సస్పెండ్ చేయించి, ఆమె కుటుంబాన్నంతా అంతమొందించాలని చూస్తాడు. ఆమె కొడుకు ఆర్మీలో పనిచేస్తుంటాడు. టెర్రరిస్టుల నుంచి స్కూలు పిల్లల్ని కాపాడే ఆపరేషన్‌లో తీవ్రంగా గాయపడతాడు. అతడి చెల్లెలి పెళ్లికి సాయం కోసం మేజర్ అజయ్ (మహేశ్) కర్నూలు వస్తాడు. భారతి కుటుంబానికి అండగా నిలిచి, నాగేంద్రకు ఎలా బుద్ధి చెప్పాడనేది మిగతా కథ.

విశ్లేషణ
సైనికుడంటే నిర్వచనం చెప్పే కథతో ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించాడు. దేశాన్ని కాపాడటమంటే, దేశంలోని పౌరులందర్నీ కాపాడటమని, ఆ పనిని బోర్డర్ దగ్గర పనిచేసే సైనికులు చేస్తున్నారని ఈ సినిమాతో అతను చెప్పాడు. ఆ కథకు మూడు పాత్రల్ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు. ఒకటి - మహేశ్ చేసిన మేజర్ అజయ్ రోల్, రెండు - విజయశాంతి పోషించిన ప్రొఫెసర్ భారతి క్యారెక్టర్, మూడు - ప్రకాశ్ రాజ్ చేసిన మినిస్టర్ నాగేంద్ర పాత్ర. ఈ మూడు పాత్రల ఔచిత్యానికి భంగం కలగకుండా ఆ పాత్రల్ని దర్శకుడు డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అజయ్, భారతి పాత్రల చిత్రణ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. స్వతహాగా జోవియల్‌గా ఉంటూ, తన సహోద్యోగి అయిన ప్రసాద్ (రాజేంద్రప్రసాద్)ను అల్లరిపెడుతూ ఉండే అజయ్.. క్యారెక్టర్‌ను ఎక్కడా లూజ్ కాకుండా పకడ్బందీగా, డిగ్నిఫైడ్‌గా డిజైన్ చేశాడు. హీరోయిన్ తన మీది మీదికొస్తున్నా అతను మాత్రం ఎప్పుడూ ఆమెతో అల్లరిగా బిహేవ్ చెయ్యకపోవడం దర్శకుడిలోని పరిణతిని పట్టిస్తుంది.

ఫస్టాఫ్‌లో మహేశ్ పాల్గొనే ఆర్మీ ఆపరేషన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటే, మహేశ్, హీరోయిన్ కుటుంబం మధ్య సరదా సన్నివేశాలతో నడిచే ట్రైన్ ఎపిసోడ్ అలరించింది. హీరోయిన్ 'నీకు అర్థమైతాందా?' అనే ఊతపదం, ఆమె కుటుంబం మొత్తానికి పెట్టిన 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' అనే మేనరిజం ఆకట్టుకుంటాయి. హీరో కర్నూలుకు రాగానే కొండారెడ్డి బురుజు దగ్గర నాగేంద్ర మనుషుల్ని చావగొట్టి, భారతి కుటుంబాన్ని రక్షించి, "భయపడేవాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా" అనడం పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్. సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్మెంట్ తగ్గి ఎమోషనల్‌గా స్టోరీ నడుస్తుంది. నాగేంద్రతో అజయ్ తలపడే సన్నివేశాలు, వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధాలు, అజయ్‌లోని హీరోని ఎలివేట్ చేస్తూ భారతి చెప్పే డైలాగ్స్ శక్తిమంతంగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో హీరోకు తోడుగా ప్రసాద్ పాత్రను, సెకండాఫ్‌లో హీరోకు తోడుగా భారతి పాత్రను నడిపించడం దర్శకుడిలోని పనితనానికి నిదర్శనం. 

హీరోయిన్ తల్లిదండ్రులుగా సంగీత, రావు రమేశ్ క్యారెక్టర్లను పరస్పరం భిన్నంగా డిజైన్ చేసి ఆహ్లాదకర హాస్యాన్ని పండించాడు దర్శకుడు.  పాటలు కథకు అడ్డుపడకపోవడం ఇంకో రిలీఫ్ పాయింట్. హీరోయిన్‌తో ఒకే డ్యూయెట్ పెట్టడం కూడా కథన రీత్యా సరైనదే. ఫైట్లకు కథతో లింక్ ఉండటం, వాటినీ ఎమోషన్స్‌తో నింపడం వల్ల ప్రేక్షకుడు కనెక్టవుతాడు. అనేక సన్నివేశాలు ఆకట్టుకొనేలా, ముచ్చటగొలిపేలా వచ్చాయంటే.. అందులో కెమెరా పనితనమూ, నేపథ్య సంగీత ప్రభావమూ ఉన్నాయి. 5 వేల కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి ఎంపీడీవో రామకృష్ణను చంపకుండా నల్లమల అడవుల్లో మినిస్టర్ నాగేంద్ర ఎందుకు పెట్టాడనేదానికి లాజిక్ మిస్సయింది. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ క్యారెక్టరైజేషన్‌దీ అదే దారి. సినిమాలో ప్రి క్లైమాక్స్ ముందు వరకూ వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్, అవి కలిగించిన ఎఫెక్ట్ కారణంగా క్లైమాక్స్‌ను మరింత ఎఫెక్టివ్‌గా, భారీగా ఉంటాయని ఆశించేవాళ్లు మాత్రం నిరుత్సాహపడతారు. రొటీన్ క్లైమాక్స్‌ను కాకుండా 'సంథింగ్ డిఫరెంట్'ను కోరుకునేవాళ్లను అది ఇబ్బంది పెట్టదు. 

ప్లస్ పాయింట్స్
మహేశ్, విజయశాంతి పాత్రల చిత్రణ, వాళ్ల అభినయం
ఫస్టాఫ్‌లోని వినోదం
బోర్ కొట్టించని స్క్రీన్‌ప్లే
సంగీతం, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్
ప్రిక్లైమాక్స్ వరకు ఆకట్టుకొనే టేకింగ్

మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో వినోదం పాలు తగ్గడం
హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ లేకపోవడం
క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ పాత్ర చిత్రణలో లాజిక్ లేకపోవడం, ఆ ఎపిసోడ్ ఆశించిన రీతిలో లేకపోవడం

నటీనటుల అభినయం
ముగ్గురూ ముగ్గురే అనేలా మహేశ్, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. మేజర్ అజయ్ రోల్‌ను చాలా సునాయాసంగా చేసుకుపోయాడు మహేశ్. చాలా రోజుల తర్వాత వినోదం మేళవించిన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌ను మహేశ్ బాగా పండిస్తాడనే విషయం మరోసారి ఈ సినిమా నిరూపించింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది! ఈసారి ఆశ్చర్యపర్చిన విషయం.. డాన్సులతోనూ అతను అలరించడం. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' అనే మాస్ సాంగ్‌లో అతని డాన్సులు ఆకట్టుకున్నాయి. పదమూడేళ్ల తర్వాత విజయశాంతికి ఇది సరైన రీఎంట్రీ అనడంలో సందేహించాల్సింది లేదు. ముఖంలో వయసు మళ్లుతున్న ఛాయలు కనిపించడం మినహా అభినయం విషయంలో అప్పటి గ్రేస్ ఆమెలో ఏమాత్రం తగ్గలేదు. ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్.. అప్పటి విజయశాంతిని మళ్లీ కళ్లముందు నిలిపాయి. కొట్టినపిండి లాంటి పాత్రలో ప్రకాశ్ రాజ్ ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో హీరోయిన్ రోల్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, ఫస్టాఫ్‌లో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు పంచింది రష్మిక. రావు రమేశ్ అంటే చాలు దర్శకుడిలోని క్రియేటివిటీ పదునెక్కుతుందని ఈ సినిమాలోని ఆయన పాత్ర మరోసారి రుజువుచేస్తుంది. ఈసారి ఆయనకు ధీటుగా సంగీత కనిపించడం గమనార్హం. రావి రమేశ్ భార్యగా 'అబ్బబ్బబ్బా' అంటూ ఆమె తనలోని కామిక్ టైమింగ్‌ను గొప్పగా ఆవిష్కరించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఈ తరహాలో మరిన్ని పాత్రలు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. హీరో పాత్రకు తోడుగా ఆద్యంతమూ ఉండే ప్రసాద్ పాత్రలో రాజేంద్రప్రసాద్ గురించి చెప్పాల్సిన పనేముంది.. నల్లేరు మీద బండినడకలా ఆ పాత్రను చేసుకుపోయాడు. కాకపోతే వెన్నెల కిశోర్‌కు తగ్గ పాత్ర పడలేదు. సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, అజయ్, జయప్రకాశ్‌రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
వినోదం, దేశభక్తి, భావోద్వేగాలు మేళవించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా గొప్ప స్థాయిలో లేకపోయినా, ఎక్కడా బోర్ కొట్టించదు. టికెట్టుకు పెట్టిన డబ్బు, చూడ్డానికి వెచ్చించిన సమయం వృథా కాదు. మహేశ్, విజయశాంతి పోటాపోటీ పర్ఫార్మెన్స్‌ను ఆస్వాదించడానికైనా ఈ సినిమా చూడాలి.

రేటింగ్ - 3.25/5

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema GalleriesLatest News


Video-Gossips